ఏపీ చెన్నైలో కలుస్తుందా?: సజ్జల సమైక్య వాఖ్యలపై భగ్గుమన్న షర్మిల, తెలంగాణ నేతలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు ఏ అవకాశం దొరికినా తమ పార్టీ ఓటు వేస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండించారు. అంతేగాక, వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా తెలంగాణ నేతలు ఆ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

మీ ప్రాంతం మీరు చూస్కోండి: సజ్జల వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్
'సజ్జల వ్యాఖ్యలు అర్ధం లేనివి. నేడు తెలంగాణ ఒక వాస్తవం ఎంతో మంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు? మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు.. మీ ప్రాంత అభివృద్ధి.. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం మీకు తగదు' అని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఏపీని మద్రాసులో కలిపేస్తారా? అంటూ జగదీశ్ రెడ్డి
తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇవన్నీ తెలివి తక్కువ వాదనలు అని కొట్టిపారేశారు. ఇష్టం లేకుండానే తెలంగాణను ఏపీతో కలిపారని.. 60 ఏళ్ల పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. సజ్జల చెప్పినట్లే జరిగితే.. ఏపీని చెన్నై, ఇండియాను మళ్లీ ఇంగ్లాండ్ అడగొచ్చని చురకలంటించారు. చరిత్రను వెనక్కి తిప్పడం ఎవరివళ్లా కాదని అన్నారు.అర్థంలేని వాదనలు మానుకుంటే మంచిదన్నారు.

కవిత లిక్కర్ స్కాంను పక్కదోవ పట్టించేందుకేనని బండి సంజయ్
సజ్జల సమైక్య వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. కవిత లిక్కర్ స్కాంను పక్కదోవ పట్టించేందుకే.. వైసీపీ నేతలతో కలిసి కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్ర సీఎం సలహాదారు.. ఈ రాష్ట్ర సీఎం సలహదారు గూడుపుఠానీ చేస్తున్నారన్నారు. స్కాంల నుంచి దృష్టి మరల్చేందుకేనని అన్నారు.

సజ్జల కామెంట్స్ ఓ కుట్ర అంటూ భట్టి విక్రమార్క
సమైక్య రాష్ట్ర నినాదంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. మళ్లీ సెంటిమెంట్ రగిల్చే కుట్రలో భాగమే సజ్జల కామెంట్స్ అని అన్నారు. తెలంగాణ ఆలోచనకు భిన్నంగా సజ్జల వ్యాఖ్యలున్నాయన్నారు. మళ్లీ సమైక్య రాష్ట్రం నినాదం అనే వాదనతో ఉపయోగం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకమన్నారు. మరోవైపు, సజ్జల సమైక్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల వ్యాఖ్యలు చూస్తే మళ్లీ తెలంగాణ మీద దాడి జరిగే అవకాశం ఉందన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి తప్ప.. తెలంగాణలో రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..?
అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే... రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ వైసీపీ పోరాటం చేసిందన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు ఏ అవకాశం దొరికినా మళ్లీ కలిసేందుకే తమ పార్టీ ఓటు వేస్తుందన్నారు. అయితే, విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినందున పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపైనే తాము దృష్టి పెడుతున్నామన్నారు. విభజన చట్టంలో హామీల అములపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలి? అని సజ్జల వ్యాఖ్యానించారు.

సజ్జల వ్యాఖ్యల వెనుక మోడీ అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి ఇవ్వాళ చాలా వికృతంగా విషపు ఆలోచనలతో మాట్లాడారని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. విభజన చట్టమేట్ట అసంబద్ధమని, విభజనకు మేమందరం వ్యతిరేకమన్నవారందరు.. విభజనకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసినమని అది మరలా కలవాలని, దాని కోసం ప్రయత్నం చేస్తున్నామని విషపు మాటలు మాట్లాడారు. వైసీపీ నేతలు మాట్లాడితే కూడా వారు సొంతంగా మాట్లాడారని అనుకోవట్లేదు. ఖచ్చితంగా గత రెండు మూడు రోజులుగా మోడీ.. వైయస్సార్సీపీ నాయకులతో కలిసి వాళ్లను ప్రేరేపించి, కుట్ర చేస్తున్నారు తప్ప మరొక్కటి లేదు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.