హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టుల కదలికలు మళ్లీనా?.. ఎన్నికల బహిష్కరణకు తెలంగాణ కమిటీ పిలుపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కొన్నాళ్ల నుంచి స్తబ్ధుగా ఉన్న మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలయ్యాయా? మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ నుంచి మావోయిస్టులు ప్రాబల్యం చాటుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించడంటూ.. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ప్రియమైన ప్రజలారా అంటూ లేఖ రాసిన జగన్ చాలా విషయాలు ప్రస్తావించారు. బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని.. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు సామ్రాజ్యవాద తొత్తులని పేర్కొన్నారు. ఆ పార్టీలన్నీ కూడ ప్రజా వ్యతిరేకమైనవని, దోపిడీ దొంగ పార్టీలని అభివర్ణించారు. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని.. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలని లేఖలో కోరారు.

నిజామాబాద్ బరి.. గెలుపెవరిదో మరి? కవిత VS మధుయాష్కి VS అర్వింద్నిజామాబాద్ బరి.. గెలుపెవరిదో మరి? కవిత VS మధుయాష్కి VS అర్వింద్

67 ఏళ్ల బూటకపు ఎన్నికల చరిత్ర..!

67 ఏళ్ల బూటకపు ఎన్నికల చరిత్ర..!

ఎన్నికలు న్యాయంగా, స్వచ్ఛందంగా జరగడం లేదని ఆరోపించారు జగన్. ఇందులో ప్రజల పాత్ర నామమాత్రమేనని పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికలు బూటకమని, వీటిని బహిష్కరించాలని, నిజమైన ప్రజల రాజకీయాధికారాన్ని స్థాపించుకోవాలని పిలుపునిచ్చారు. 67 ఏళ్ల బూటకపు పార్లమెంటరీ ఎన్నికల చరిత్రలో పీడిత ప్రజల న్యాయమైన మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించలేదని.. మళ్లీ 17వ లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటకం ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరిపేందుకు దోపిడీ పాలకులు ప్రకటించారని ఆరోపించారు.

వారి చెప్పుచేతల్లో పార్టీలు : జగన్

వారి చెప్పుచేతల్లో పార్టీలు : జగన్

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పులు చెప్పుకుంటూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే మేలిముసుగు ధరించి సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తూ, దళారి నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గాలు పాలన కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేవారు సామ్రాజ్యవాదులపై ఆధారపడి ప్రపంచీకరణ ఆర్థిక విధానాలను అమలుచేస్తూ వారి చెప్పుచేతల్లో నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. రకరకాల పథకాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రతి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు కుల, మత, ప్రాంతీయ భావోద్వేగాలు రెచ్చగొడుతూ మద్యం, డబ్బు వెదజల్లుతూ గుండాగిరి చేస్తూ రిగ్గింగులకు పాల్పడుతున్నారు.

అధికారంలో ఉన్నోళ్లు పోలీసు బలగాలను, ఎన్నికల కమిషన్ ను, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఐటీ, సీబీఐ లాంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమ ప్రజలను అరెస్ట్ చేసి జైళ్లో పెడుతున్నారని.. విప్లవకారులను బూటకపు ఎన్ కౌంటర్లలో హత్యలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీ, మోడీపై జ

బీజేపీ, మోడీపై జ"గన్"..!

2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో యూపీఏ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ఐదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రో ధరల పెంపు, పారిశ్రామిక, వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరి ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా విఫలం. కుంభకోణాల్లో కాంగ్రెస్ పార్టీని మించిపోయింది. దేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా రాఫెల్ వెలుగుచూస్తోంది. వేల కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణాల్లో నేరస్థులు లలిత్ మోడీ, విజయ్ మాల్యా, మెహుల్ చౌక్సీ వంటి వారిని విదేశాలకు దాటించింది.

కార్పొరేట్ కంపెనీలకు 12 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు కల్పిస్తోంది. కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు బకాయిపడ్డ లక్షా 32 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. రుణభారంతో తల్లడిల్లుతున్న రైతాంగానికి మాత్రం ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. దిగజారిపోతున్న ప్రతిష్ట కాపాడుకునేందుకు మోడీ పుల్వామా దాడి ఘటనను వాడుకున్నారని ఆరోపించారు జగన్. ఉద్దేశపూర్వకంగానే యుద్దోన్మాదాన్ని, కుహనా దేశభక్తిని రెచ్చగొట్టి ఓట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మోడీ - అమిత్ షా - మోహన్ భగవత్ నేతృత్వంలోని హిందూ ఫాసిస్టు ముఠా సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో సమాజాన్ని మత ప్రాతిపదికన ధృవీకరించడం కోసం బ్రాహ్మణవాద హిందూ ఫాసిజం రూపంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి అమలుచేస్తోందని ధ్వజమెత్తారు. మోడీ హత్యకు కుట్ర పన్నారంటూ అర్బన్ నక్సల్స్ పేరుతో ప్రజాస్వామిక, దళిత, సామాజిక, ప్రజాసంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేసి జైళ్లో నిర్భందించారు. మోడీ రాజ్యంలో పేదల కోసం పనిచేయడం నేరంగా మారిపోయింది. మోడీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, పట్టణ మధ్యతరగతి దేశీయ బూర్జువా వర్గం, మహిళలు, దళితులు, ఆదివాసులు, మత మైనార్టీలు, పీడిత జాతులను దోచుకుని, వారిని అణచివేసి.. సామ్రాజ్యవాదుల, దళారి నిరంకుశ బూర్జువా, భూస్వాముల ప్రయోజనాలు నెరవేర్చింది.

కాంగ్రెస్ తక్కువేమీ కాదు..!

కాంగ్రెస్ తక్కువేమీ కాదు..!

సామ్రాజ్యవాదానికి దాస్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. కాంగ్రెస్ చరిత్రంతా పీడిత వర్గాలను, పీడిత జాతులను, ప్రజా ఉద్యమాలను హత్యాకాండల ద్వారా అణచివేసిందని ధ్వజమెత్తారు. అనేక కుంభకోణాల చరిత్ర దాని సొంతమని పేర్కొన్నారు.

అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం గురించి నీతులు వల్లిస్తోందని.. ఓట్లు వేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడమే గాకుండా నాయకత్వం కోసం ముఠా కొట్లాటల కారణంగా మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైందని వివరించారు. దేశంలోని వివిధ పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి ఢిల్లీ పీఠమెక్కాలని కలలుగంటున్న కాంగ్రెస్ ఆటలు సాగవన్నారు.

 టీఆర్ఎస్ ను అభిమానంతో గెలిపియ్యలే..!

టీఆర్ఎస్ ను అభిమానంతో గెలిపియ్యలే..!

తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు జగన్. బంగారు తెలంగాణ పేరుతో అప్రజాస్వామిక, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విధానాల వల్ల లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓడిపోతామని భయపడిందన్నారు. అందుకే మోడీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని ముందస్తు ఎన్నికల ఎత్తుగడ వేసిందని చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్ మీద నమ్మకంతో ప్రజలు రెండోసారి అధికారం కట్టబెట్టలేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోవడంతో ప్రత్యామ్నాయంగా కనిపించిన టీఆర్ఎస్ కు ఓట్లేశారే తప్ప కావాలని గెలిపించలేదు. తెలంగాణ పీఠంపై కొడుకును కూర్చోబెట్టి, ఢిల్లీలో చక్రం తిప్పుదామని కలలు కంటున్నాడు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కేసీఆర్ ప్రజాకర్షక పథకాలతో నెరవేరవు. ప్రజాస్వామిక తెలంగాణ ద్వారానే సాధ్యమవుతాయన్నారు జగన్.

టీడీపీకి చురకలు.. సీపీఐ, సీపీఎంపై ధ్వజం

టీడీపీకి చురకలు.. సీపీఐ, సీపీఎంపై ధ్వజం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదని.. అందుకే తిరస్కరించారని లేఖలో పేర్కొన్నారు జగన్. గత్యంతరం లేని స్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి గెలవాలని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. విప్లవోద్యమ నిర్మూలనకు కంకణం కట్టుకుని పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఇది ప్రజా వ్యతిరేకమైందని ధ్వజమెత్తారు. సీపీఐ, సీపీఎం లాంటి రివిజనిస్టు పార్టీలు పీడిత ప్రజల తరపున పోరాటాలను విప్లవ మార్గం నుంచి పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు జగన్. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ, అధికారంలో లేనప్పుడు ప్రజలపక్షం వహిస్తున్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఇది విప్లవోద్యమం అణచివేయడంలో ప్రధాన పార్టీలతో పోటీపడుతోందని ఆరోపించారు.

ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో సహా ఈ పార్టీలన్నీ సామ్రాజ్యవాద దోపిడీ వర్గ ప్రయోజనాలను కాపాడుతూ ప్రతిఘాతుక పాత్రను పోషిస్తున్నాయన్నారు. వీటి వర్గ స్వభావాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల పార్టీలన్నీ ప్రజల నిజమైన ప్రజాస్వామ్యానికి, స్వావలంబనకు, దేశ సార్వభౌమాధికారానికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. అందుకే ఈ పార్టీలన్నింటినీ నిలదీయండి. ఓట్లు వేయకండి. ఎన్నికల బహిష్కరణ ప్రజల ప్రజాస్వామిక హక్కు. అందుకే మీరు ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ, నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వాములు కండి. విప్లవ రాజ్యాధికారాన్ని సాధించుకుందామంటూ ముగించారు.

English summary
Have the Maoist movements stagnated since a few years back? Are Maoists dominating from the early Assembly elections? Maoist party Telangana state committee spokesperson Jagan called for lok sabha elections boycott has now become a hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X