మరికొన్ని గంటల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఏర్పాట్లు పూర్తి
మరికొద్దీ గంటల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నెల 10వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

99.70 శాతం పోలింగ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.70 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. 1324 మంది ఓటర్లు ఉండగా 1320 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 99.22 శాతం పోలింగ్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 97.01 శాతం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 96.09 శాతం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం పోలింగ్ జరిగింది.

10 మంది అభ్యర్థులు
కరీంనగర్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్ రమణ, భానుప్రసాద్ రావు పోటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి.. టీఆర్ఎస్ నుంచి తాత మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణి బరిలో ఉన్నారు.

గెలుపు ఎవరిదో..?
ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగగా, టీఆర్ఎస్ నుంచి యాదవరెడ్డి, కాంగ్రెస్ తరపున తూర్పు నిర్మల, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మల్లారెడ్డి బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు. ఈ స్థానానికి టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు నగేశ్, లక్ష్మయ్య, కే వెంకటేశ్వర్లు, ఈర్పుల శ్రీశైలం, బెజ్జం సైదులు, కొర్ర రామ్‌సింగ్ పోటీ చేశారు.