టీఆర్ఎస్లో టెన్షన్.. కాంగ్రెస్కు భారీగా క్రాస్ ఓటింగ్.. ఇదీ లెక్క..
తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ భంగపాటుకు గురైనప్పటికి కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ నేతలను కలవరానికి గురి చేస్తోంది.

ఎలా పడ్డాయంటే..
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి పడవలసిన ఓట్లు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోల్ అయినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి 116 ఓట్లు ఉండగా, టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో 96 మంది ప్రజాప్రతినిధులు మిగిలారు. ఏ లెక్కన చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించే అవకాశాలు లేవు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన రాయల్ నాగేశ్వరరావుకు ఊహించని విధంగా ఓట్లు పోలయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని రాయల్ నాగేశ్వరరావు అనూహ్యంగా 242 ఓట్లను సాధించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఒక్కసారిగా కంగు తిన్నారు.

అనుకున్న దానికంటే ఎక్కువే..
ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 480 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాయల్ నాగేశ్వరరావు 242 ఓట్లను సాధించారు. మొత్తంగా 238 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి పై అధికార పార్టీ అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. ఇక చెల్లని ఓట్లు 12 ఉంటే, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తికి నాలుగు ఓట్లు ఫోన్ చెయ్యి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో భారీగా క్రాస్ ఓటింగ్ జరగడం ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నేతలలో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్కు 140 క్రాస్ ఓట్లు
మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 140 ఓట్లు క్రాస్ ఓటింగ్ లో భాగంగా రావడంతో, అధికార పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన తాత మధు ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో పార్టీ నేతల్లో మరింత టెన్షన్ చోటు చేసుకుంది. అసలు ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందన్న దానిపై టీఆర్ఎస్ నేతలు తర్జనభర్జన పడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటమిపాలైనప్పటికీ సంతోషంగానే ఉందని చెప్పాలి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నేత సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క వ్యూహం పనిచేసిందని, అందుకే భారీగా టిఆర్ఎస్ పార్టీ నుండి క్రాస్ ఓటింగ్ జరిగిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ విజయం సాధించినా, క్రాస్ ఓటింగ్ లో ఓట్లు తగ్గటం టిఆర్ఎస్ పార్టీ నేతలను ఒకింత షాక్ కు గురి చేశాయని చెప్పాలి.