తెలంగాణ పీఆర్సీ నివేదిక విడుదల... ఫిట్మెంట్,హెచ్ఆర్ఏ,బేసిక్ పేలపై కమిటీ కీలక ప్రతిపాదనలివే...
తెలంగాణ ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ పీఆర్సీ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. పీఆర్సీ నివేదికలో పొందుపరిచిన సిఫారసుల ప్రకారం... ఈసారి ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్మెంట్ పెంపును ప్రతిపాదించారు. కనీస వేతనం రూ.19వేలు,గరిష్ఠ వేతనం రూ.1,62,700గా ఉండాలని సూచించింది. సీపీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 10 శాతం నుంచి 14శాతం పెంపుకు ప్రతిపాదించింది. హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించడం గమనార్హం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పెంపుకు ప్రతిపాదించింది.

హెచ్ఆర్ఏ స్లాబులు ఇవే...
ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవును 3 నెలల నుంచి 4 నెలలకు పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. హెచ్ఆర్ఏ స్లాబులను 11,13,17,24గా నిర్ణయించింది. దాదాపు 31 నెలల తర్వాత బిశ్వాల్ కమిటీ ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సుదీర్ఘ కాలంగా పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు కమిటీ ప్రతిపాదనల పట్ల పెదవి విరుస్తున్నారు. 2014లో 43శాతం ఫిట్మెంట్ ఇవ్వగా... ఇప్పుడు కేవలం 7.5శాతం పెంపునే ప్రతిపాదించడం దారుణమని అంటున్నారు. హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి కుదించడాన్ని తప్పు పడుతున్నారు.

నివేదికను తప్పు పట్టిన కాంగ్రెస్...
కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్దన్ రెడ్డి మాట్లాడుతూ... బిశ్వాల్ కమిటీ అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని,ఏ పట్టణ ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించిందని ప్రశ్నించారు. తాజా నివేదికలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు నెరవేరే ప్రతిపాదనలు లేవన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకే నివేదికను ఇలా రూపొందించారని... ఈమాత్రం దానికి 31 నెలల గడువు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. స్కూల్ అసిస్టెంట్లకు,సెకండరీ గ్రేడ్ టీచర్లకు వేతన వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని... ఈ నివేదికలో దానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు లేవని అన్నారు. 70 ఏళ్లు పైబడ్డ పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ ఇన్సెంటివ్ ప్రతిపాదన చేయలేదన్నారు.

ఉద్యోగ సంఘాలతో చర్చలు... ఆపై నిర్ణయం...
ఉద్యోగుల పీఆర్సీపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మే18, 2018న సీఆర్ బిశ్వాల్ చైర్మన్గా మహ్మద్ ఆలీ రఫత్, ఉమా మహేశ్వరావులతో కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిషన్ గడువును ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. చివరగా 2020 ఫిబ్రవరిలో కమిషన్ గడువును పెంచింది. సీఎం ఆదేశాల మేరకు ఎట్టకేలకు 31 నెలల తర్వాత 2020 డిసెంబర్ 31న సీఎస్ సోమేశ్ కుమార్కు అందచేసింది. ఈ రిపోర్ట్ కాపీని మొదట ఉద్యోగ సంఘాలకు అందజేసి, వాళ్లు స్టడీ చేసేందుకు కొంత గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత చర్చలకు పిలిచి వారి అభ్యంతరాలు,ప్రతిపాదనలు విననున్నారు.
ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో చర్చించి పీఆర్సీ ఫిట్మెంట్పై ప్రకటన చేసే అవకాశం ఉంది.