• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ సామాజిక ఉద్యమకారులు.. 2018 స్మృతులు

|

హైదరాబాద్ : 2018 వ సంవత్సరం వీడ్కోలు చెప్పబోతోంది. కొత్త సంవత్సరం ఆహ్వానం పలకబోతోంది. భవిష్యత్తుపై కలలు కనడం ఎంత సహజమో.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం అంతే సాధారణం. 2018 కొందరికి తీపి జ్ఞాపకాలు మిగిలిస్తే.. మరికొందరికి చేదు అనుభవాలు చవిచూపించింది. ఇదంతా కామన్. గెలుపోటములను పక్కనబెట్టి మున్ముందు ఏం చేయబోతున్నామనేదే ఇంపార్టెంట్. ఈక్రమంలో తెలంగాణ సామాజిక ఉద్యమకారులకు 2018 వ సంవత్సరం ఎలాంటి అనుభూతులు మిగిల్చిందో తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.

 కోదండరాం

కోదండరాం

ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమంలో పార్టీలకతీతంగా నేతలందర్నీ ఒకేతాటిపై నడిపిన మాస్టారు. జేఏసీ ఛైర్మన్ గా వ్యూహాలకు పదునుపెట్టి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన గురువు. అలాంటి నాయకత్వ లక్షణాలున్న కోదండరాంకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి స్థానమే ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆయన మార్గం వేరు. దీంతో తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. కొన్నిచోట్ల పార్టీ అభ్యర్థులను బరిలో దించారు. కానీ విజయం వరించలేదు. అదలావుంటే సరిగ్గా ఎన్నికల సమయం దగ్గర పడేనాటికి ఆ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న లాయర్ రచనారెడ్డి గుడ్ బై చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమి పేరుతో కాంగ్రెస్ కు దగ్గరైన కోదండరాం జన సమితిలో సామాజిక న్యాయం పాటించడం లేదని ఆమె ఆరోపించడం చర్చానీయాంశమైంది. టీఆర్ఎస్ విధానాలు నచ్చక ఆ పార్టీకి దూరమై తెలంగాణ జనసమితి స్థాపించిన కోదండరాముడికి 2018 చేదు అనుభవాలే మిగిల్చిందని చెప్పొచ్చు.

గద్దర్

గద్దర్

ప్రజా యుద్ధనౌకగా ముద్రపడ్డ గద్దర్ తన ఆటపాటతో ప్రజల చూపును తనవైపు తిప్పుకోవడంలో దిట్ట. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. వీర తెలంగాణమా అంటూ తెలంగాణ ఉద్యమాన్ని శిఖరాగ్రానికి చేర్చారనడం అతిశయోక్తి కాదేమో. విప్లవభావాలు మెండుగా ఉన్న గద్దర్..ఇన్నాళ్లు బ్యాలెట్ ను వ్యతిరేకించారు.

70 ఏళ్ల జీవితంలో 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు. అంతేకాదు అనూహ్యంగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం చర్చానీయాంశమైంది. ఆయన కాంగ్రెస్ లో చేరనప్పటికీ ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చినట్లైంది. గద్దర్ కొడుకు సూర్య అంతకుముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ప్రచారం జరిగినా.. చివరకు అది కుదరలేదు.

తెలంగాణలో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉద్యమ అమరవీరులను విస్మరించిందనేది ఆయన ప్రధాన ఆరోపణ. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోదామనుకున్న గద్దర్ ప్రయత్నాలకు 2018 కలిసిరాలేదని చెప్పొచ్చు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. తెలంగాణ కు ఓ మ‌కుటాయ‌మానం..!! 2018లో అద్బుత నిర్మాణం..!!కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. తెలంగాణ కు ఓ మ‌కుటాయ‌మానం..!! 2018లో అద్బుత నిర్మాణం..!!

మందకృష్ణ మాదిగ

మందకృష్ణ మాదిగ

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 2018లో అంత పెద్దగా ప్రభావం చూపించలేకపోయారని చెప్పొచ్చు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మహాకూటమికి సపోర్ట్ చేసినా ఫలితం దక్కలేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్ ఓడిపోవాలని పిలుపునిచ్చారు.

దళితులకు, మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించని ఏకైక సీఎం కేసీఆరే అంటూ విరుచుకుపడ్డారు. సమైక్య రాష్ట్రంలో కూడా కానరాని నిర్బంధం.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రశ్నించినందుకు తనను జైల్లో పెట్టించారని మండిపడ్డారు.

డెమోక్రసీ గెలిచి నిలవాలంటే కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో ఓటర్లపై ఆయన ప్రభావం కనిపించకపోవడం 2018లో మందకృష్ణ మైనస్ గా చెప్పొచ్చు.

 ఆర్.కృష్ణయ్య

ఆర్.కృష్ణయ్య

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు 2018 పెద్దగా కలిసిరాలేదు. 2014లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ సెగ్మెంట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ముందస్తు ఎన్నికల్లో తర్జనభర్జన పడ్డారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకున్న దరిమిలా ఆయన మళ్లీ టీడీపీ నుంచే పోటీచేస్తారని అందరూ భావించారు.

ఎన్నికలు సమీపించేనాటికి సీన్ రివర్సయింది. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని మిర్యాలగూడ స్థానం నుంచి పోటీచేశారు. అనూహ్యంగా ఆర్.కృష్ణయ్య మిర్యాలగూడెం సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆయన అక్కడ ఓడిపోవడం గమనార్హం. అదలావుంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. బీసీల పట్ల అవలంభిస్తున్న తీరు సరికాదంటూ వ్యతిరేకించారు. సెప్టెంబరులో అసెంబ్లీ రద్దు సమయాన ఏకంగా కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. అది కార్యరూపం దాల్చలేదు.

అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల కోటా 50 శాతానికి పైగా పెంచాలని డిమాండ్ చేస్తున్న ఆర్.కృష్ణయ్యకు సుప్రీంకోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగలినట్లైంది. మొత్తమ్మీద 50 శాతం రిజర్వేషన్లు మించొద్దని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో బీసీలకు 23.81 శాతమే ఖరారైంది. మొత్తానికి ఆర్.కృష్ణయ్యకు 2018 చేదు అనుభవాలే మిగిల్చిందని చెప్పొచ్చు.

గాదె ఇన్నయ్య

గాదె ఇన్నయ్య

తెలంగాణ సామాజిక ఉద్యమకారుల్లో గాదె ఇన్నయ్య ఒకరు. టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైనప్పుడు కేసీఆర్ వెంట నడిచి అండగా నిలిచారు. ఒకరకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ఇన్నయ్య.. తర్వాత కాలంలో కేసీఆర్ కు దూరమయ్యారు. గులాబీ విధానాలు నచ్చక బయటకు వచ్చానని చెబుతుంటారు.

టీఆర్ఎస్ ను వీడిన తర్వాత ప్రజా తెలంగాణ పార్టీని స్థాపించారు. నమ్మినవాళ్లు ఆయన వెంట నడిచినా అది పెద్దగా ముందుకు పోలేదు. వరంగల్ జిల్లాలోని జఫర్‌ఘడ్ మండలంలోని రేగడితండా శివారులో మా ఇల్లు - ప్రజాదరణ ఆశ్రమం స్థాపించి అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. దాదాపు పన్నెండేళ్లుగా ఈ ఆశ్రమం కొనసాగిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితికి దగ్గరయ్యారు. ఒకనాడు టీఆర్ఎస్ ప్రారంభంలో కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్న ఇన్నయ్య..

ఇప్పుడు కోదండరాం పార్టీలో కీలకంగా మారారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి టీజేఎస్ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన గాదె ఇన్నయ్య ఎమ్మెల్యేగా గెలవలేకపోవడం 2018 ఆయనకు మిగిల్చిన చేదు జ్ఞాపకం.

జిట్టా బాలకృష్ణారెడ్డి

జిట్టా బాలకృష్ణారెడ్డి

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగిన వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. కానీ అప్పటి టీడీపీ పొత్తులో భాగంగా ఈయనకు టికెట్ దక్కలేదు. ఇండిపెండెంట్ గా పోటీచేసి రెండో స్థానానికి పరిమితమై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ లో చేరారు. ఆ పార్టీ సమైక్యవాదానికి జై కొట్టడంతో తెలంగాణవాదిగా గుడ్ బై చెప్పారు. అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత జర్నలిస్ట్, న్యూస్ రీడర్ రాణిరుద్రమతో కలిసి యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. అలా రాజకీయ నేతగా ప్రస్థానం కొనసాగించిన జిట్టా.. 2018 ముందస్తు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈక్రమంలో భువనగిరి నుంచి బీజేపీ టికెట్ తో ఎన్నికల బరిలోకి దిగారు. 2018 కూడా జిట్టాకు కలిసిరాక మళ్లీ ఓడిపోయారు.

English summary
2018 Some sweet memories out there ... Some people have bitter experiences. This is common. Important is what is going on and going ahead of victory. In this regard, we will see the Telangana social activists like Kodandaram, Gaddar, Mandakrishna Madiga, R.Krishnaiah, Gade Innaiah, Jitta Balakrishna Reddy in the year 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X