వేల పాటలు పాడి.. కోట్లాది అభిమానుల మనసు దోచిన ఎస్పీ బాలు తొలి పాట ఇదే
హైదరాబాద్: గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఎన్ని మకుటాలు తగిలించినా.. ఎస్పీ బాలసుబ్రమణ్యంకు తక్కువే అనిపిస్తాయి. ఎన్నో వేల పాటలు పాడిన ఆయన.. దేశ వ్యాప్తంగానేగాక ప్రపంచ వ్యాప్తంగానూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాల సుబ్రహ్మణ్యం గాత్రం నుంచి ఎన్నోవేల పాటలు జాలువారినా.. ఆయన తొలి పాట మాత్రం అందరికీ తెలియకపోవచ్చు.
ఆ గొంతు మూగబోయింది: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు..!

ఎస్పీ బాలుకు తొలి పాట అవకాశం ఇలా
తనకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టడటంతో బాలుకు మాటిచ్చారు నాటి ప్రముఖ సంగీత దర్శకులు కోదండపాణి. బాల సుబ్రమణ్యంకు ఇచ్చిన మాటకు కట్టుబడి కోదండపాణి ఆయనకు ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న'సినిమాలో తొలిసారి పాట పాడే అవకాశం ఇచ్చారు. ‘ఏమి ఈ వింత మొహం' అనే పాటను కోదండపాణి వారం రోజులపాటు ఎస్పీ బాలుతో పాడించారు. చివరకు అది సోలో పాట కాదని, నలుగురు కలిసి పాడేదని తెలిసింది. అయినా, మహామహులతో పాడే అవకాశం రావడం గొప్పగానే భావించారు ఎస్బీబీ.

తొలి అవకాశంతోనే నిరూపించుకున్నారు..
1966, డిసెంబర్ 15న విజయగార్డెన్స్‌లో రికార్డిస్ట్ స్వామినాథన్ ఆధ్వర్యంలో పీ సుశీల, కళ్యాణం రఘురామయ్య, పీబీ శ్రీనివాస్‌తో కలిసి బాలు తన తొలి పాటను పాడగా.. రికార్డు చేశారు. ఆ తర్వాత 1967, జూన్ 2న విడుదలైన ఈ సినిమా చలనచిత్ర సంగీత ప్రపంచంలోకి బాలు అనే గాన గంధర్వుడిని పరిచయం చేసింది. ఆయన గాత్రం బాగుండటంతో ప్రముఖ సంగీత దర్శకుల నుంచి ఆయనకు పిలుపులు వస్తూనే ఉండేవి.

చివరి వరకూ తన తొలి పాటను తల్చుకున్న బాలు..
అందుకే బాలు ఎప్పుడూ తన తొలి పాట గురించి చెబుతుంటారు. కోదండపాణి గారనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు ఉండేవారు కాదు.. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద ఎంతో నమ్మకం. నా మొదటి పాట విజయా గార్డెన్స్ ఇంజనీరు స్వామినాథన్ గారితో చెప్పి ఆ టేప్ చెరిపేయకుండా ఏడాదిపాటు అలాగే ఉండేట్లు చేశారు. ఏ సంగీత దర్శకుడు అక్కడికి వచ్చినా వారికి వినిపించి, అవకాశాలు ఇమ్మని అడిగేవారట. ఏమిచ్చినా కోదండపాణి రుణం తీర్చుకోలేనంటూ బాల సుబ్రమణ్యం ఇప్పటి వరకూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా..
కాగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు హిందీ, ఇతర భాషల్లోనూ బాల సుబ్రమణ్యం సుమారు 40వేలకు పైగా పాటలను పాడటం విశేషం. దీంతో ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. అంతేగాక, ఆయన పలు సినిమాల్లో నటించారు కూడా. పలువురు నటులకు డబ్బింగ్ కూడా చెప్పారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలు.. శుక్రవారం అందర్నీ వదిలి స్వర్గస్తులైనారు.