కాచిగూడలో రెండు రైళ్లు ఢీ: ఎంఎంటీయస్ మూడు కోచ్ లు ధ్వంసం: పలువురికి గాయాలు..!
హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. స్టేషన్ సమీపంలో ఇంటర్ సిటీ రైలు ఆగి ఉండగా..అదే ట్రాక్ మీదకు ఎంఎంటీయస్ రైలు వచ్చింది. గ్రీన్ లైట్ రావటంతో అదే లైన్ లోకి ఎంఎంటీయస్ రైలు వచ్చింది. అయితే, పట్టాలు మారాల్సి ఉన్నప్పటికీ..ట్రాక్ మీద ముందుకు వెళ్లేందుకు సాంకేతికంగా గ్రీన్ సిగ్నల్ ఉండటంతో స్టేషన్ లోకి మరో కొద్ది సెకన్లలోకి చేరుకొనే సమయంలో ఆకస్మికంగా ఎదురుగా ఆగి ఉన్న రైలు కనిపించింది. కానీ, అప్పటికే నియంత్రణ లేకుండా పోయింది .దీంతో.. ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలును ఎంఎంటీయస్ రైలు ఢీ కొట్టి..మూడు కోచ్ లు ధ్వంసం అయ్యాయి. దీంతో..ముందుగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ రెండు రైళ్ల మధ్య చిక్కుకుపోయారు. డ్రైవర ను సహచర సిబ్బంది..ప్రయాణీకులు బయటకు తీసారు. అయితే, ధ్వంసం అయిన మూడు కోచ్ ల్లో దాదాపు 20 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. అందులో నలుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు.
సిగ్నల్ వైఫల్యమే కారణమంటూ..
స్టేషన్ సమీపంలో ఒక రైలు ట్రాక్ మీద ఉండగానే..అదే ట్రాక్ మీదకు ఎంఎంటీస్ రైలుకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాచిగూడ మీదుగా ప్రతీ పది నిమిషాలకు ఒక ఎంఎంటీయస్ రైలు ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే, ఇది సిగ్నలింగ్ లోపం అని చెబుతున్నా..అదే ట్రాక్ మీదకు మరో రైలు వచ్చేలా సిగ్నల్ అనేది సమర్ధించుకోలేని తప్పిదం.

అయితే, అదే సమయంలో అధికారులు చెబుతున్నట్లుగా ఇదే సిగ్నల్ సమస్య..ఇదే విధంగా ఒక ట్రాక్ మీద రైలు ఉండగా..మరో రైలు అదే ట్రాక్ మీదకు వచ్చి ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండేదనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. అయితే, ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే ఇంజనీరింగ్ అధికారులు..కమర్షియల్ అధికారులు ప్రమాద ఘటన మీద సమీక్షిస్తున్నారు. అదే సమయంలో కాచిగూడ నుండి కర్నూలు వెళ్లే రైలును దారి మళ్లించారు. దీంతో పాటుగా కాచిగూడ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను నిలిపివేయటంతో పాటుగా..తాత్కాలికంగా ఎంఎంటీయస్ రైళ్ల సర్వీసును రద్దు చేసారు. మరి కొన్ని దారి మళ్లించారు.