టీఆర్ఎస్, ఎంఐఎం ఒకే నాణేనికి రెండు ముఖాలు, ఓవైసీ బ్రదర్స్ వల్లే రోహింగ్యాలు: తేజస్వి సూర్య
హైదరాబాద్: దేశ ప్రజలు కుటుంబ రాజకీయాలను తిరస్కరిస్తున్నారని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య అన్నారు. అతి సామాన్యుడు కూడా నాయకుడు కాగలగడం బీజేపీలోనే సాధ్యమని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌లోని మెహబూబ్ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 'ఛేంజ్ హైదరాబాద్' కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
టాలీవుడ్ బాధ్యత మాదే, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ స్థానం: చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్

టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకే నాణేనికి రెండు ముఖాలు..
కేసీఆర్, ఓవైసీ రాజకీయాలను ప్రైవేటు సంస్థలుగా మార్చారని తేజస్వి సూర్య విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆరోపించారు. ఓవైసీ సోదరుల కారణంగానే రోహింగ్యాలు హైదరాబాద్‌ను ఆవాసంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ ఏ వ్యక్తికీ సంబంధించిన పార్టీ కాదని అన్నారు. దేశ ప్రజలు కుటుంబ రాజకీయాలను తిరస్కరిస్తున్నారన్నారు. కాశ్మీర్లో రెండు రాజకీయ కుటుంబాలను ప్రజలు శాశ్వత క్వారంటైన్‌కు పంపారని, తెలంగాణలోనూ అదే జరుగుతుందన్నారు.

ఇది నిజం కాలం కాదు.. మోడీ హాయం..
ఇది నిజాం కాలం కాదని.. నరేంద్ర మోడీ హాయం అని ప్రజలు గుర్తించాలని అన్నారు.
ఈ సందర్భంగా ‘ఛేంజ్ హైదరాబాద్' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన తేజస్వి సూర్య.. ఈ క్యాంపెయిన్ లోకల్ బాడీ ఎన్నికలకే పరిమితం కాదని అన్నారు. తెలంగాణలో మార్పునకు ఛేంజ్ హైదరాబాద్ నాంది అవుతుందన్నారు. ఇవాళ దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందన్నారు. హైదరాబాద్‌లో మార్పు తీసుకొచ్చే వాతావరణం కనిపిస్తోందని, దీనికి సామాన్య బీజేపీ కార్యకర్తలే కారణమన్నారు తేజస్వి సూర్య. తెలంగాణ ప్రజలు, యువత ఎంతో చైతన్యవంతులని అన్నారు.

బీజేపీది చేతల రాజకీయం..: కిషన్ రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పెనుమార్పుల తీసుకొస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశంలో 80 శాతం మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీనే అధికారంలో ఉందన్నారు. విధ్వంసాన్ని కూకటివేళ్లతో పెకలించే పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం మానుకోవాలన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం భూ ఆక్రమణలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమది చేతల రాజకీయమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. : బండి సంజయ్
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీలనే టీఆర్ఎస్ సర్కారు నెరవేర్చలేదన్నారు. నగరంలో అనేక సమస్యలున్నాయన్నారు. కేంద్రం హైదరాబాద్‌కు 2 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. వాటిని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో విద్య వ్యవస్థను కేసీఆర్ సర్కారు చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా.. సీఎం స్పందించడం లేదని విమర్శించారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. భాగ్యనగర రూపు రేఖలను మారుస్తామన్నారు. వరద బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామన్నారు.