కాంగ్రెస్ గూటికి పీకే.. మరీ టీఆర్ఎస్ పరిస్థితి, కటిఫ్ అంటోన్న దళపతి..?
ఎన్నికలకు సమయం ఉన్నా ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పటినుంచే ఫోకస్ చేస్తున్నాయి. తమ తమ బెర్తులు, వ్యుహాలు.. గెలుపులపై అంచనాలు మొదలయ్యాయి. అయితే రాజకీయ వ్యుహాకర్త ప్రశాంత్ కిశోర్ ఇక పార్టీ నేతగా మారబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛనమే అయ్యింది. అయితే ఇప్పటివరకు ఆయన తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పనిచేశారు. దీంతో గులాబీ దళంతో కొనసాగే అవకాశాలు సన్నగిల్లాయి. ఎందుకంటే.. ఆ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేసిన సందర్భాలు అరుదు..

పీకే టీం సర్వే..
ఇప్పటికే పీకే టీం.. రాష్ట్రంలో సర్వే నిర్వహించినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ వైపు చూస్తుండడం.. ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతుండడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన్ను పక్కన పెట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోసారి అధికారం.. కానీ
ప్రశాంత్ రాజకీయ వ్యూహాలతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంది. వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్...కాంగ్రెస్ నేతగా మారేందుకు రంగం సిద్ధమైంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఆయనకు దూరం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సొంత వ్యూహం ఉపయోగించి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉండే కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

తెలుసు.. స్నేహితుడు అని..
ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి ఆయా రాష్ట్రాలో అవి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన పీకే...కొన్నిరోజుల క్రితం టీఆర్ఎస్కు రాజకీయ సలహాదారుగా మారారు. ప్రశాంత్ కిషోర్ గురించి సీఎం కేసీఆర్ బహిరంగంగా మాట్లాడారు. టీఆర్ఎస్కు సేవలందిస్తున్నారనీ చెప్పారు. అసలు పీకే ఉంటే హుజూరాబాద్ ఫలితం మరోలా ఉండేదన్నారు. అంతలా పీకేపై విశ్వాసం ఉంచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాల వెనకా..ప్రశాంత్ ఉన్నట్టు ప్రచారం జరిగింది.

థర్డ్ ఫ్రంట్.. ఫెడరల్ ఫ్రంట్
తృతీయ కూటమి ఏర్పాటు లాంఛనప్రాయమే అన్న పరిస్థితి కనిపించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ ఘనవిజయం, కాంగ్రెస్ ఘోర ఓటమి జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చాయి. పార్టీ ప్రక్షాళన కోసం కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ వైపు చూడడం, రాజకీయ వ్యూహకర్తగా కన్నా..కాంగ్రెస్ నేతగా కనిపించేందుకు పీకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో పీకేను టీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టనుంది. అంతేకాదు సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన వెనక కూడా పీకే ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు సిద్దమయ్యారు.