టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. తెరపైకి గాయత్రి రవి పేరు..
రాజ్యసభ అభ్యర్థులపై టీఆర్ఎస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. మూడు స్థానాలకుగాను అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర, నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు పేర్లకు ఆమోదం తెలిపారు. మోత్కుపల్లి నర్సింహులు, ప్రకాశ్ రాజ్, కవిత పేర్లు కూడా వినిపించినా.. చివరకు వారికి అవకాశం లభించలేదు.

బండ రాజీనామాతో..
టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ గతేడాది డిసెంబర్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బండప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి జరిగే ఉప ఎన్నిక కోసం వీరిలో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నిక సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా, రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది.

ఎవరు నామినేషన్ వేస్తారో
టీఆర్ఎస్ ఎంపిక చేసిన ముగ్గురిలో ఎవరు ఈ ఎన్నిక కోసం నామినేషన్ వేస్తారో రేపటిలోగా తెలియనుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం వచ్చే నెలలో ముగియనుంది. ఈ రెండు స్థానాలకు కూడా ఎన్నిక జరగనుంది. ఈ నెల 24 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ కోశాధికారిగా వ్యవహరించిన దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త-హెటిరో సంస్థ అధినేత పార్ధసారథిరెడ్డికి రాజ్యసభ టికెట్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం అనే చర్చ జరుగుతుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పంపిస్తారనే ప్రచారం జరిగింది. కేటీఆర్‌తో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశమై ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరారట. కేటీఆర్ కూడా ఓకే చెప్పడంతో పెద్దల సభకు పొంగులేటి వెళ్లనట్లే అని స్పష్టం అవుతోంది. అదే సామాజికవర్గం, అదే జిల్లాకే చెందిన పారిశ్రామికవేత్త పార్ధసారథిరెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది.

తెరపైకి గాయత్రి రవి
ఈ రెండు ఊహించినవే కానీ.. మూడో సీటు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కి దక్కింది. దీంతో మోత్కుపల్లి నర్సింహులు, ప్రకాశ్ రాజ్‌కు అవకాశం లభించలేదు. ఈ ముగ్గురులో ఇద్దరు ఓసీలు.. వద్దరాజు రవిచంద్ర ఒక్కరే బీసీ అయి ఉంటారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం స్థానం లభించలేదు.