రేవంత్ కన్నా తనకే క్రేజ్ ఎక్కువ, ఠాగూర్ ప్యాకేజీకి అమ్ముడుపోయారు..వీహెచ్ హాట్ కామెంట్స్..
టీ పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. అధినేతను ప్రకటించడం మరింత ఆలస్యమవుతోంది. అయితే కొన్ని పేర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వారిలో సీనియర్ నేత వీ హనుమంతరావు ఒకరు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండలేను అని కుండ బద్దలు కొట్టీ మరీ చెప్పారు. పీసీసీ చీఫ్ పదవీని బీసీలకు ఇవ్వాలని వీహెచ్ కోరుతున్న సంగతి తెలిసిందే.

వీహెచ్ హాట్ కామెంట్స్
రేవంత్ రెడ్డిపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పీసీసీ ఇస్తే.. తాను పార్టీలో ఉండనని స్పష్టం చేశారు. తానే కాదు చాలా మంది ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవీకి పనికి రారా? అని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకికి టీపీసీసీ చీఫ్ పదవీ ఇస్తారా అని మండిపడ్డారు. టీడీపీలో ఉండి రేవంత్ ఆ పార్టీనే ఖతం చేశాడని... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే పరిస్థితి వస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీని కూడా రేవంత్ మేనేజ్ చేస్తున్నాడని వీహెచ్ ఆరోపించారు.

తనకే క్రేజ్ ఎక్కువ
ప్రజల్లో రేవంత్ రెడ్డి కంటే తనకే ఎక్కువ క్రేజ్ ఉందని వీహెచ్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ పెరుగుతుంటే.. ఆర్ఎస్ఎస్ వ్యక్తికి పీసీసీ ఇస్తారా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తి కింద తాము పనిచేయనని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తానని తెలిపారు. పీసీసీపై ఉత్తమ్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రేవంత్ మాస్ లీడర్ అయితే.. గ్రేటర్లో 48 సీట్లు తీసుకొని 2 స్థానాలు మాత్రమే గెలిచిందని ఎద్దేవా చేశారు.

మీడియా, సోషల్ మీడియా
మీడియా, సోషల్ మీడియాతోనే రేవంత్ లీడర్ అయ్యాడు. పీసీసీ విషయంలో సమాచారం ఉన్నందుకే మాట్లాడుతున్నానని తెలిపారు. అభిప్రాయ సేకరణలో తాను ఇచ్చిన ఆధారాలను అధిష్టానానికి చేరకుండా ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అడ్డుకున్నాడని ఆరోపించారు. హై కమాండ్‌కు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని.. ప్యాకేజీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. రేవంత్ తమ్ముడు.. దళితుల భూమి కబ్జా చేసినా మీడియా రాయదన్నారు. రేవంత్ మీడియాను పార్టీ హైకమాండ్‌ను మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించారు.

తెలంగాణ వ్యతిరేకి
తెలంగాణ వ్యతిరేకిని పీసీసీ చీఫ్ చేశారని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందన్నారు. మేం ఆయనను కలవడానికి జైలుకు వెళ్లలా అని అడిగారు. వాస్తవాలను వివరిస్తూ లెటర్ రాసినా, మాస్ లీడర్ అయితే కొడంగల్‌లో రేవంత్ ఎందుకు ఓడిపోయాడు అని ప్రశ్నించారు. మూడు రోజుల నుంచి నా ఫోన్‌ను మాణిక్కం ఠాగూర్ ఎత్తడం లేదన్నారు. బీసీగా ఉన్న డీ శ్రీనివాస్ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేశారు. అలాంటి వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవీ ఇవ్వాలి అని సూచించారు.