దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ విజయంపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపుపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

నిరంకుశ పోకడలకు జవాబు..
‘టీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణులకు... కేసీఆర్ దొరగారి నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో స్పష్టం చేశారు. ఓటమిపై సమీక్షించుకుంటామని టీఆరెస్ అంటోంది' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

ఒక్క ఓటుతో గెలుపు అనే పరిస్థితికి టీఆర్ఎస్..
‘అయితే, ఈ ఉపఎన్నిక సందర్భంగా టీఆరెస్ నాయకుల వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలి. దుబ్బాకలో టీఆరెస్‌కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని... బీజేపీ, కాంగ్రెస్‌లకు కనీసం డిపాజిట్లు వస్తాయా? అని మొదట వ్యాఖ్యానించి.... ఆ తర్వాత దుబ్బాకలో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనన్నారు. లక్ష మెజారిటీ ఆశించి... ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండి' అని విజయశాంతి హితవు పలికారు.

దుబ్బాక తీర్పు.. మలిదశ ఉద్యమానికి ఊపిరి..
‘ప్రజలు మీరేం(టీఆర్ఎస్) చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోండి.
ఏది ఏమైనా... దొరాధిపత్య దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారు. చైతన్యపూరితమైన తెలంగాణ సమాజపు రానున్న రోజుల పోరాటాలలో ఈ దొర కుటుంబ పాలన ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు' అని విజయశాంతి హెచ్చరించారు.

త్వరలోనే ఢిల్లీకి విజయశాంతి.. బీజేపీలోకి?
త్వరలో విజయశాంతి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. వారం పది రోజుల్లో విజయశాంతి ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అవుతారని, తిరిగి కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయశాంతి నివాసానికి వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ కూడా విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదన్నారు. బీజేపీలో చేరతారంటూ వస్తున్న ప్రచారాన్ని విజయశాంతి కొట్టిపారేయకపోవడమూ, అంతేగాక, కాంగ్రెస్ పార్టీ పదవిని కూడా ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో తొలగించడం కూడా చర్చనీయాంశంగా మారింది.