రాముడిపై ప్రాంతీయ వాదమా; తలతిక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితమవుతారు : విజయశాంతి హెచ్చరిక
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతోంది. అయితే తెలంగాణ టిఆర్ఎస్ఎమ్మెల్యే రామమందిర నిర్మాణం కోసం కొనసాగుతున్న విరాళాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాష్ట్రంలోని హిందుత్వ వాదులకు, బిజెపి నాయకులకు ఆగ్రహం తెప్పిస్తుంది. దీంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా బీజేపీ నేత విజయశాంతి టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

దేవుళ్ళకి కూడా ప్రాంతీయ వాదం అంటగడతారా..?
దేవుళ్ళకి కూడా ప్రాంతీయ వాదం అంటగడతారా అంటూ నిప్పులు చెరిగారు. అయోధ్య రాముడు, తెలంగాణ రాముడు అంటూ బేధభావం సృష్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు. దేవుళ్ళకి కూడా ప్రాంతీయ వాదాన్ని అంటగట్టే వైపరీత్యం మనస్తత్వం టిఆర్ఎస్ నేతలకు చెల్లుతుంది అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. దేశంలో మనది ఏ రాష్ట్రమైనా ముందుగా భారతీయులమనే విజ్ఞత మరచి అయోధ్య రాముడు తెలంగాణ రాముడు అంటూ బేధ భావాన్ని సృష్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తలతిక్క గా మాట్లాడే అహంకారాన్ని ప్రదర్శించే టీఆర్ఎస్ నేతలను తప్పక ఇళ్లకే పరిమితం చేస్తారు
అంతేకాదు అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వద్దని తమ ద్వేష మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు అంటూ విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తలతిక్క గా మాట్లాడే అహంకారాన్ని ప్రదర్శించే టీఆర్ఎస్ నేతలను ప్రజలు తప్పక ఇళ్లకే పరిమితం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలి అంటూ విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు.
విరాళాన్ని బిక్ష మంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆరాధ్య భావంతో చేసే సమర్పణకు, అడుక్కోవడానికి తేడా తెలియని తమ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారని విజయశాంతి ఎద్దేవా చేశారు.

ఇళ్లలోనే పూజా మందిరాలు ఉన్నప్పుడు గుళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం దేనికో
ఇక ఇదే సమయంలో మన దగ్గర రాముడు ఆలయాలు లేవా అంటున్న టిఆర్ఎస్ నేత ఇళ్లలోనే పూజా మందిరాలు ఉన్నప్పుడు గుళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం దేనికో కూడా చెప్పాలి అంటూ ప్రశ్నించారు.
జైశ్రీరామ్ అంటూ రాముడి పట్ల తన భక్తి భావాన్ని చాటుతూ ట్వీట్ చేశారు విజయశాంతి.
ఇదిలా ఉంటే రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ హిందుత్వ వాదులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
విరాళాల సేకరణ పై ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి, హిందూ సంఘాలు మెట్ పల్లి లో ఆందోళన నిర్వహించాయి. ఎమ్మెల్యే కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆందోళన చేయడంతో, టిఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడకు చేరుకున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అటు కోరుట్ల లోనూ బిజెపి నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపాయి.