జంట జలశయాలకు పోటెత్తిన వరద, కేసీఆర్ పూడికతీసిన చెరువుకు జలకళ
వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. హైదరాబాద్ సమీపంలో గల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో ఈ రెండు జలాశయాలు నిండు కుండలా మారాయి. హిమాయత్ సాగర్‌లోకి 2,570 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1762.40 అడుగులు. ఉస్మాన్ సాగర్‌లోకి 3,055 క్యూసెక్కుల వరదీ నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1787.35 అడుగులు.
ఇటు మిషన్‌కాకతీయ పథకానికి శ్రీకారం చుడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా పూడిక తీత పనుల్లో పాల్గొన్న నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల చందుపట్ల రాసముద్రం చెరువు జలకళ సంతరించుకుంది. 201 5 ఏప్రిల్ 26న కేసీఆర్ చందుపట్లకు వచ్చి ఎండ్ల బండిపై చెరువులోకి చేరుకున్నారు. తానే స్వయంగా పలుగు పార పట్టి పూడికతీత పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఆయన తన చేతుల మీదుగా ప్రారంభించిన చందుపట్ల రాస ముద్రం చెరువు ప్రస్తుతం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారింది.
సోమవారం అర్ధరాత్రి నుంచి అలుగు పారుతుంది. సుమారు 250 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువును కాకతీయుల కాలంలో నిర్మించగా దానిని సమైఖ్యపాలనలో పట్టించుకోలేదు. దీంతో రాసముద్రంగా పిలిచే ఈ చెరువు నుంచే కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో అప్పటి నుంచి ప్రతీ ఏటా చెరువుకు వరద వచ్చి చేరుతుంది. ఈ ఏడాది కూడా చెరువు మత్తడి దుంకుతుంది.

మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి సోమవారం ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, మధ్యాహ్నం వరకు 8374 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం ఇన్‌ఫ్లో 13178 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇన్‌ఫ్లోను ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు 2 ,4, 7, 8, 11వ నంబరు క్రస్టు గేట్లను ఒక్కో గేటును ఐదు అడుగుల మేర ఎత్తి 12938.74 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
కుడి, ఎడమ కాలువలకు కలిపి 144.72 క్యూసెక్కుల నీరు వెళుతుంది. మొత్తం 13178.66 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో వెళుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.60(4.09 టీఎం సీలు) అడుగులుగా ఉన్నట్లు ఏఈ ఉదయ్ తెలిపారు. మూసీకి వరద ఉధృతి పెరగడం తో పరివాహక ప్రాంత రైతులు ఎవరూ నదిలోకి వెళ్లవద్దని ఏఈ విఙప్తి చేశారు.