హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు: మరో మూడురోజులు
హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. సోమవారం రాత్రి పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జనగామ, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం పడింది. పలు చోట్ల వడగళ్లతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జనగామలోని బచ్చన్నపేట, నర్మెట్ట మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. కాగా, హైదరాబాద్ నగరంలోనూ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు, తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటం, వాయువ్య ప్రాంతంలో నెలకొన్న అస్థిరత ప్రభావంతో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీగా పిడుగులు, ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని హెచ్చరించింది.
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ (నర్సాపూర్), శామీర్పేటతోపాటు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పిడుగులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. వీటితోపాటు సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, కొమురంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. సోమవారం రాత్రికి హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ఉరుములు పడే అవకాశముందని పేర్కొంది. పిడుగులు పడే సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.