హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీకెండ్ స్పెషల్ : ఛలో ఆక్సిజన్ పార్క్.. కండ్లకోయ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కండ్లకోయ 'ఆక్సిజన్ పార్క్'. ప్రేమికుల రోజుతో ఒక్కసారిగా ఫేమస్ అయిన పేరు. ప్రేమజంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన ప్రదేశం. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ పార్క్ గురించి చాలామందికి తెలియదు. కానీ వాలంటైన్స్ డే మూలంగా రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ పార్క్ పేరు మార్మోగిపోయింది. టీవీల్లో, సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా ఆ పార్క్ నామస్మరణే ప్రతిధ్వనించింది. ఇంతకు ఆ 'ప్రాణ వాయువు' పార్క్ ఎక్కడుంది? హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? ఇంతకు దాని నేపథ్యమేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా "వన్ ఇండియా తెలుగు" వీకెండ్ స్పెషల్ స్టోరీ.

అందాల ప్రకృతి.. స్వచ్చమైన గాలి

అందాల ప్రకృతి.. స్వచ్చమైన గాలి

75 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. యాంత్రిక జీవనానికి దూరంగా, విషవాయువుల జాడ లేని స్వచ్ఛమైన గాలి ఇక్కడ గ్యారంటీగా దొరుకుతుందని చెప్పొచ్చు. వివిధ రకాల పూల, పండ్ల చెట్లలతో పాటు ఔషధ మొక్కలు ఉండటం ఈ పార్క్ ప్లస్ పాయింట్. మర్రి, రావి, ఉసిరి, చింత, నెమలినార, సీతాఫలం తదితర చెట్లు ఇక్కడ దర్శనమిస్తాయి. కుటుంబాలకు పిక్నిక్ స్పాట్ గా మంచి ఆహ్లాదం ఇస్తుంది. పిల్లలకు దాదాపు అన్నిరకాల పూల, పండ్ల చెట్లు చూయించే ఒకే ఒక్క ప్లేస్ ఇదేనంటే అతిశయోక్తి లేదు. స్కూల్ విద్యార్థుల సందర్శనార్థం రెండు మోడల్ క్లాస్ రూములు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఇక్కడకు వెళితే చాలు మనసు తేలిక పడుతుంది. యాంత్రిక జీవనపు అలజడులు అన్నీ మరచిపోయి హాయిగా ప్రకృతి ఒడిలో సేదదీరవచ్చు. స్వచ్ఛమైన గాలి తప్ప పొల్యూషన్ జాడ లేని ఆక్సిజన్ పార్క్‌కు యువత పెద్దఎత్తున క్యూ కడుతోంది.

మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ గ్రామ పరిధిలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది ఈ ఆక్సిజన్ పార్క్. మేడ్చల్ జాతీయ రహదారిపై కండ్లకోయ రింగ్ రోడ్డు జంక్షన్ పక్కనే ఉంటుంది. 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లావాసులు.. సొంత వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కాసింత విరామం కోసం ఈ పార్కులో సేదదీరవచ్చు. దాదాపు రెండున్నర కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ నెలకొల్పారు. వాకింగ్ బ్రిడ్జ్, హెర్బల్ గార్డెన్, యోగా షెడ్, ట్రీ హౌజ్, ఓపెన్ క్లాస్ రూమ్, బటర్ ఫ్లై గార్డెన్, రచ్చబండ తదితర ఏర్పాట్లు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఫొటో షూట్స్ కోసం యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.

అడవులను కాపాడి వాటిని మరింత పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం "జంగల్ బచావో, జంగల్ బడావో" కార్యక్రమం తీసుకొచ్చింది. నానాటికీ పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 16 పార్కులు అభివృద్ధి చేయబోతోంది. అందులో ఒకటి కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. ఇక్కడ ఎలాంటి రణగొన ధ్వనులు, పొల్యూషన్ లేకుండా, ఉన్నంత సేపు హాయిగా ప్రకృతిలో మమేకం అయిపోవచ్చు.

ప్రాణ వాయువు పుష్కలం

ప్రాణ వాయువు పుష్కలం

ఈ ఆక్సిజన్ పార్క్ కు మరో పేరు "అర్బన్ లంగ్స్ స్పేస్". పేరుకు తగ్గట్టుగానే ఊపిరితిత్తులకు సహజమైన "ప్రాణ వాయువు" అందించే మహత్తరమైన పార్క్ గా అభివర్ణించవచ్చు. ప్రజల ఆరోగ్యం, టూరిజం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి దీనికి ఒక రూపు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చిన్నపాటి నీటి కుంటలు, పిల్లలు ఆడుకోవడానికి జంతువుల విగ్రహాలు, వివిధ రకాల పక్షుల కిలకిలరావాలతో చిన్నపాటి అభయారణ్యాన్ని తలపిస్తుంది. మర్రిచెట్టు కింద రచ్చబండ సెటప్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రెన్ ప్లే ఏరియా, వాచ్ టవర్ తదితర ఏర్పాట్లు చూడగానే కట్టిపడేస్తాయి.

ఎంత దూరం.. ఎలా వెళ్లాలి

ఎంత దూరం.. ఎలా వెళ్లాలి

మేడ్చల్ జిల్లా పరిధిలోకి వచ్చే కండ్లకోయ ఆక్సిజన్ పార్క్.. హైదరాబాద్ నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి 20 కిలోమీటర్లు మాత్రమే. కుత్బుల్లాపూర్ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. సికింద్రాబాద్ - బోయినపల్లి మీదుగా మేడ్చల్ హైవే ఎక్కిన తర్వాత సుచిత్ర, కొంపల్లి దాటగానే కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ స్వాగతం పలుకుతుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే ఆర్టీసీ సిటీ బస్సుల్లో సైతం అక్కడికి చేరుకోవచ్చు. సుచిత్ర సర్కిల్ నుంచి 10 కిలోమీటర్లు, కొంపల్లి క్రాస్ రోడ్డు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాణ వాయువు పార్క్.

అన్నిరోజులు తెరచి ఉంచబడును

అన్నిరోజులు తెరచి ఉంచబడును

ఆక్సిజన్ పార్క్.. పేరుకు తగ్గట్టుగా అన్ని రోజులు స్వాగతం పలుకుతుంది. నో హాలిడేస్ అన్నమాట. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. పెద్దలకు 15 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకు ఒక్క రోజుకు పార్కింగ్ ఫీజు 5 రూపాయలు, ఫోర్ వీలర్స్ కు 10 రూపాయలు వసూలు చేస్తారు. ఇక వాకింగ్ చేయాలనుకునేవారికి ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు అనుమతిస్తారు. వీరికోసం మంత్లీ పాసులు కూడా అందుబాటులో ఉంచారు. నెలకు వంద రూపాయలు, సంవత్సరానికి 800 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు.

అధికారుల ఆటవిడుపు

అధికారుల ఆటవిడుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యాన సెలవులు లేకుండా విధినిర్వహణలో బిజీబిజీగా గడిపిన ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు.. ఎలక్షన్లు ముగిశాక ఒకరోజు తమ కుటుంబాలతో ఇక్కడ జాలీగా గడిపారు. ప్రశాంతమైన వాతావరణంలో పని వత్తిడికి దూరంగా, ప్రకృతి ఒడిలో హాయిగా ఆనందించారు. పోలింగ్ ముగిశాక వచ్చిన ఆదివారం నాడు అందరూ ఒక్కచోట చేరారు. ఈ విశాల వనక్షేత్రంలో కుటుంబ సభ్యులతో సరాదాగా గడిపారు. ఆత్మీయంగా అందరూ కలిసిపోయి ఆడిపాడారు. అక్కడే వనభోజనాలు చేసి సాయంత్రం వరకు ఉండి సేదదీరారు. మొత్తానికి ఒక్కసారి వెళితే పదేపదే వెళ్లాలనిపించేలా ఆహ్లాదం అందిస్తున్న ఆక్సిజన్ పార్క్‌కు హ్యాట్సాఫ్. ఫ్యామిలీలతో కలిసి ఒకరోజంతా ధూమ్‌ధామ్ గా సందడి చేయాలనుకునేవారికి ది బెస్ట్ డెస్టినేషన్ ఆక్సిజన్ పార్క్ అలియాస్ అర్బన్ లంగ్స్ స్పేస్.

English summary
Kandlakoya Oxygen Park is located close to Kandlakoya village, near Outer ring road in medchal district. It is located at a distance of about 20 km's from Secunderabad, close to Medchal highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X