రూ.64 కోట్లు మాయం: అరెస్టయిన వారి ఖాతాలో లేని నగదు.. మరీ ఎక్కడ నగదు
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో నిధుల లెక్క తేలలేదు. సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్నారు. అకాడమీలో పనిచేస్తున్న అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా విచారిస్తున్నారు. కొన్ని డిపాజిట్లకు సంబంధించి సోమిరెడ్డి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా పోలీసులకు ఆధారాలు దొరికాయి.
బ్యాంకులకు సోమిరెడ్డి ఇచ్చిన రిలీజింగ్ ఆర్డర్‌పై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమిరెడ్డి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అకాడమీ ఖాతాలో నిధులు డిపాజిట్ కాలేదని గుర్తించారు. మస్తాన్ వలీ, శ్రీనివాస్, సోమశేఖర్, రాజకుమార్ పాత్రపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. వీరితోపాటు అకాడమీ మాజీ డైరెక్టర్ సత్యనారాయణను కూడా విచారిస్తున్నారు.

ఏపీ మర్కంటైల్ బ్రాంచ్ నుంచి డ్రా చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 64 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. అరెస్ట్ అయిన వారి ఖాతాలో చిల్లిగవ్వ కూడా లేదని తెలిపారు. నిధులు ఎవరికి చేరాయి అనేదానిపై పోలీసులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. 64 కోట్ల రూపాయల నిధుల ఆచూకీ తెలుసుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై చర్యలు తీసుకుంది. అతనిని విధుల నుంచి తప్పించగా.. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ సహకార సంస్థ మేనేజర్ పద్మావతి, ఆ సంస్థ చైర్మన్ సత్యనారాయణ రాజు, అదే సంస్థకు చెందిన ఉద్యోగి మొయినుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ కార్వాన్ యూనియన్ బ్యాంకు శాఖ నుంచే నగదు మాయం అయ్యాయి. గతేడాది జులై నుంచి విడతలవారీగా బ్యాంకులోని సొమ్ములో రూ.43 కోట్లు కాజేశారు. ఇదే బ్యాంకు సంతోష్ నగర్ బ్రాంచ్ నుంచి మరో రూ.8 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయం అయ్యాయి. ఈ డబ్బును జులై, ఆగస్టు నెలల్లో దారి మళ్లించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. కెనరా బ్యాంకు నుంచి మరో రూ. 9 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ము కూడా గోల్మాల్ చేశారు. ఈ కుంభకోణంలో రూ. 60 కోట్లకు పైగా సొమ్ము చేతులు మారినట్లు తేలింది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కారు అకాడమీ డైరెక్టర్.. సోమిరెడ్డిని పదవీ నుంచి తప్పించింది. ఈ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు అప్పగించింది.