పెళ్లి కావడం లేదని యువతి తీవ్రనిర్ణయం.. షాకైన కుటుంబం; హైదరాబాద్ లో ఘటన!!
శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో , యువత చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా భూతద్దంలో చూస్తూ, ఆ సమస్య పరిష్కారం చావే అని భావిస్తూ ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇంత చిన్న కారణానికే ప్రాణాలు తీసుకున్నారా? అని అందరూ ఆలోచించేలా చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో 26 సంవత్సరాల యువతి తనకు పెళ్లి కావడం లేదని చేసిన పని అందుకు అద్దం పడుతుంది.
హైదరాబాద్లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్ లో విజయ లక్ష్మీ అనే 26 సంవత్సరాల యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తుంది. విజయలక్ష్మి తల్లి కవిత భర్త మరణించడంతో హోటల్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. విజయలక్ష్మి తో పాటు ఆమెకు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ఇటీవల విజయలక్ష్మికి పెళ్లి చేయాలని నిర్ణయించిన తల్లి తనకు పెళ్లి సంబంధాలు చూస్తూ వస్తున్నారు. అయితే ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చిన అందరూ వెనక్కు పోతున్నారని తనకు వివాహం మాత్రం కావడం లేదని విజయలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఆపై ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించిన విజయలక్ష్మి బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే విజయలక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. విజయలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రోజు మృతి చెందింది. సోదరుడు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు అంటారు. విజయలక్ష్మికి కళ్యాణ ఘడియ రాకపోవడంతో ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా వెనక్కి పోతూ వచ్చాయి. అయితే కళ్యాణ ఘడియ వస్తే ఆమె పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుందని, కానీ అంతలోపే విజయలక్ష్మి తొందర పడిందని, ఆత్మహత్యకు పాల్పడడం దారుణమని ఈ ఘటన తెలిసిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సమస్యలు వచ్చినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో ముందుకు వెళ్లాలని చెబుతున్నారు. ఇటువంటి దారుణాలకు ఎవరూ పాల్పడవద్దని పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు.