కేసీఆర్ అవినీతిపై బీజేపీ కేసులు ఎందుకు పెట్టటంలేదు? చీకటిఒప్పందాలు.. బయట డ్రామాలా?: వైఎస్ షర్మిల
ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటన చేపట్టిన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కెసిఆర్ అవినీతిని, కెసిఆర్ అవినీతిని ప్రశ్నించని బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. హుజూర్నగర్ లో పాదయాత్ర నిర్వహించిన వైయస్ షర్మిల కెసిఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం నిరుద్యోగుల ఫైల్ పైన పెడతామని వైయస్ షర్మిల హామీ ఇచ్చారు.

కేసీఆర్ ను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయి
మాట మీద నిలబడడం అంటే ఏంటో సీఎం కేసీఆర్ కు తెలవదు అని ఎద్దేవా చేశారు. ఓట్లు కావాల్సినపుడు రావడం, మాయ మాటలు చెప్పడం, మళ్లీ ఫామ్ హౌజ్ కు వెళ్ళడం.. ఎనిమిదేండ్లుగా కెసిఆర్ ది ఇదే తీరు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయని షర్మిల ఆరోపించారు. అందుకే ప్రజల తరఫున పోరాటం చేయడానికే వైయస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. దొరల పాలన అంతానికి, వైఎస్సార్ సంక్షేమ పాలన సాధనకు కృషి చేస్తానని వైయస్ షర్మిల వెల్లడించారు.

ప్రజలను దోచుకోవడం కేసీఆర్,మోడీకే చెల్లిందని వైయస్ షర్మిల ఆగ్రహం
ఇక ఇదే సమయంలో అటు టిఆర్ఎస్ పార్టీని ఇటు బిజెపి ని టార్గెట్ చేసిన విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఇస్తానన్న ఇంటికో ఉద్యోగం అటకెక్కింది. బీజేపీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు గాలిలో మేడలే అని వ్యాఖ్యానించారు వైయస్ షర్మిల.నిరుద్యోగులను ఎన్నికల్లో ఎరలా వాడుకుంటున్నారు తప్ప ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం లేదని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మడం,రేట్లు పెంచి ప్రజలను దోచుకోవడం కేసీఆర్,మోడీకే చెల్లిందని వైయస్ షర్మిల కెసిఆర్ ను, మోడీని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు.

కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నా చీకటి ఒప్పందాల వల్లే బయట పెట్టటం లేదా?
అంతేకాదు కెసిఆర్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని పదేపదే మాట్లాడుతున్న బిజెపి లీడర్లు, వాటిని ఎందుకు బయటపెట్టడం లేదో సమాధానం చెప్పాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. మీ మధ్య చీకటి ఒప్పందాలు నడుస్తున్నాయి కాబట్టే బయటపెట్టడం లేదా? అంటూ ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసమే బిజెపి మరియు టిఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని వైయస్ షర్మిల రెండు పార్టీలను టార్గెట్ చేశారు.

కెసీఆర్ ను జైల్లో ఎందుకు పెట్టటం లేదు?
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70వేల కోట్ల అవినీతి జరిగిందని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్న బీజేపీ లీడర్లు.. మరి కేసీఆర్ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఎందుకుజైలుకు పంపడం లేదు? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని వాటికి వడ్డీలను రూపంలో ప్రతి నెలా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు. ఎమ్మెల్యేల ఖాతాలలో వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి అంటూ షర్మిల పేర్కొన్నారు.