తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఫిక్స్: ఆ రెండు తేదీలపై చర్చ: జెండా, అజెండా రూపకల్పనలో
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి కేంద్రబిందువు అయ్యారు. కొత్త ప్రాంతీయ పార్టీని నెలకొల్పబోతోన్నట్లు ఇదివరకే ప్రకటించిన ఆమె.. వైఎస్సార్ అభిమానులతో జిల్లాలవారీగా ఆత్మీయ సమావేశాల్లో తలమునలై ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. వారి అభిప్రాయాలను సేకరిస్తోన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బంజారాహిల్స్ లోటస్ పాండ్‌లోని నివాసంలో విద్యార్థులతో ఆత్మీయ సమావేశాన్ని ముగించారు. తాజాగా సోషల్ మీడియా ప్రతినిధులతో భేటీ అయ్యారు.

జెండా.. అజెండాలు అవే..
వైఎస్సార్ అభిమానులతో నిర్వహించే సమావేశాల్లో వెల్లడయ్యే అంశాలనే పార్టీ అజెండాగా మార్చుకుంటున్నారామె. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అనుసరించాల్సిన మార్గాలు, వ్యూహాలను వారి నుంచే రాబట్టుకుంటున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి.. పార్టీ అజెండాగా మలుచుతున్నారు. పార్టీ జెండా, అజెండా ఎలా ఉండాలనే విషయంపై కసరత్తు చేస్తోన్నారు. వచ్చేనెల నాటికి అవన్నీ ఓ కొలిక్కి వస్తాయని తెలుస్తోంది. వచ్చేనెల 10వ తేదీ నాటికి ఆత్మీయ సమావేశాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నందున.. అదే నెల చివరి నాటికి పార్టీ విధి విధానాలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

పాదయాత్రకు సిద్ధం.
ఊహించినట్టే.. వైఎస్ షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం దాదాపుగా ఖాయమైంది. బుధవారం నిర్వహించిన విద్యార్థుల సమావేశంలోనూ అంతకుముందు గిరిజన శక్తి ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. పాదయాత్ర చేపట్టడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న క్షేత్రస్థాయి సమస్యలపై ఓ అవగాహన ఏర్పడుతుందని, వాటిని వేగంగా ఎలా పరిష్కరించాలనే విషయంపై స్పష్టత వస్తుందంటూ వారు చేసిన సూచనలకు షర్మిల సూచనప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు.

అంబేద్కర్ జయంతి లేదా వైఎస్సార్ జయంతి..
పాదయాత్రను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు. తేదీ ఖరారైన తరువాతే.. రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తారని సమాచారం. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14వ తేదీ లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8వ తేదీన పాదయాత్రను ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఈ సమావేశాల్లో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇదివరకు వైఎస్సార్, ఆ తరువాత వైఎస్ షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో ఆమె పాదయాత్రను నిర్వహించారు. నవ్యాంధ్రలో ఆమె అన్న.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.

2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్..
2023లో తెలంగాణలో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్‌గా చేసుకుని షర్మిలా పార్టీ తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ ఎలాంటి ఉప ఎన్నికలు గానీ, స్థానిక సంస్థల బరిలో గానీ దిగడానికి పెద్దగా ఇష్టపడట్లేదని తెలుస్తోంది. ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన కూడా ప్రస్తుతానికి లేదనే అంటున్నారు. 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో పార్టీ బలం ఎంత ఉందో అంచనా వేసుకోవడానికి నేరుగా 2023 అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా చేసుకున్నారని చెబుతున్నారు.