టీమిండియాకు బిగ్ షాక్: మరో ఫాస్ట్ బౌలర్ అవుట్?: అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి: నేరుగా ఆసుపత్రికి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెట్ జట్టు ఏ ముహూర్తంలో అడుగు పెట్టిందో గానీ.. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టాప్ క్లాస్ క్రికెటర్లు ఒక్కొక్కరే జట్టును వీడాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యక్తిగత కారణాలతో టెస్ట్ సిరీస్ నుంచి కేప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుకోగా.. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయ పడ్డాడు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే. మరో పేసర్ గాయాల బారిన పడాల్సి వచ్చింది. ఫలితంగా- బౌలింగ్ విభాగం బలహీన పడే అవకాశం లేకపోలేదు.
టీమిండియా మళ్లీ పాతకథ: 32 పరుగులకే చివరి అయిదు వికెట్లు

తొడ కండరాలు పట్టేయడంతో..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో ఉమేష్ యాదవ్ అర్ధాంతరంగా గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది. నేరుగా అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేయాల్సి ఉందని టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. అతనికి ఏమైందనే విషయం.. స్కానింగ్ తీసిన తరువాతే తేలుతుందని పేర్కొంది. గాయం తీవ్రతను బట్టి.. అతను మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది నిర్ధారిస్తామని తెలిపింది.

స్కానింగ్ కోసం..
ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్‌లో బ్యాటింగ్ ఆరంభించిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. తన నాలుగో ఓవర్‌ను వేస్తోన్న సమయంలో అతను గాయపడ్డాడు. నాలుగో ఓవర్ మూడోబంతిని సంధించిన తరువాత.. నొప్పితో విలవిల్లాడి పోయాడు. ఆ ఓవర్‌ను పూర్తి చేయలేకపోయాడు. ఉమేష్ యాదవ్‌ను టీమ్ ఫిజియోథెరపిస్ట్.. గ్రౌండ్ నుంచి బయటికి తీసుకెళ్లాడు. మిగిలిన మూడు బంతులను మహ్మద్ సిరాజ్ వేయాల్సి వచ్చింది. ఎడమ కాలి తొడ కండరాలు పట్టేయడంతో ఉమేష్ యాదవ్ అర్దాంతరంగా మైదానాన్ని వీడాల్సి వచ్చిందని మేనేజ్‌మెంట్ తెలిపింది. స్కానింగ్ చేసిన తరువాతే తదుపరి వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది.

అద్భుత స్పెల్..
రెండో ఇన్నింగ్‌లో ఉమేష్ యాదవ్ అద్భుతంగా బౌల్ చేశాడు. ఇన్నింగ్ మూడో ఓవర్ తొలిబంతికే ఓపెనర్ జో బర్న్స్ అవుట్ చేశాడు. ఉమేష్ యాదవ్ సంధించిన అద్భుతమైన అవుట్ స్వింగర్‌కు జో బర్న్స్ బలి అయ్యాడు. మిడిల్ వికెట్ మీద పిచ్ అయి గాల్లోకి లేచిన ఆ బంతిని డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు జో. అతని అంచనాలకు అందని విధంగా అది అవుట్ స్వింగ్ అయింది. బ్యాట్ ఎడ్జ్‌ను ముద్దాడుతూ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతుల్లో వాలింది. ఫలితంగా నాలుగు పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తరువాత ఆ జట్టు ఏ మాత్రం కోలుకోలేకపోతోంది. వరుసగా వికెట్లు పడుతున్నాయి.

టీమిండియా ఆధిపత్యం..
రెండో టెస్ట్ మ్యాచ్‌పై భారత క్రికెట్ జట్టు పూర్తిగా ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. విజయం వైపు దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్‌లో 131 పరుగుల ఆధిక్యతను సాధించిన తరువాత బరిలోకి దిగిన టీమిండియా.. ఆసీస్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసింది. పరుగులు సాధించడానికి ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేసింది. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌తో ఉచ్చులో చిక్కుకుంది కంగారూ టీమ్. 127 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు సాధించే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఓటమి బారి నుంచి తప్పించుకోవడానికి ఆ జట్టు నానాతంటాలు పడుతోంది.