అస్సాంలో గడ్డకట్టి , పాడైపోయిన వెయ్యి కోవిషీల్డ్ వ్యాక్సిన్ షాట్లు .. విచారణకు ఆదేశం
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. స్వల్పంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు దుష్ప్రభావాలకు గురవుతుండగా, సానుకూల ఫలితాలు ఎక్కువగా వస్తుండటం కాస్త ఊరట కలిగిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కావాల్సిన కరోనా వ్యాక్సిన్లు తయారు చేయడం పెద్ద ప్రహసనంగా మారింది. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడానికి నాలుగు సంవత్సరాల కాలం పడుతుందని అధికారికంగా అంచనా వేస్తున్నారు.
ఇండియాలో ఏడు నెలల కనిష్టానికి కరోనా కొత్త కేసులు ; 8 నెలల కనిష్టానికి మరణాలు

అస్సాం, కాచర్ జిల్లాలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ లో పాడైపోయిన వెయ్యి వ్యాక్సిన్ లు
ఇదిలా ఉంటే అస్సాంలోని కాచర్ జిల్లాలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ లో నిల్వ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సుమారు 1,000 వ్యాక్సిన్ షాట్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఎస్ఎంసిహెచ్లోని వ్యాక్సిన్ స్టోర్ యూనిట్లో 1000 వ్యాక్సిన్ షాట్లు గడ్డ కట్టినట్లుగా గుర్తించారు.
నివేదికల ప్రకారం, 1,000 మోతాదులను కలిగి ఉన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క 100 బాక్సులు మైనస్ జీరో ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడ్డాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను 2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది.

ఐస్-లైన్డ్ రిఫ్రిజిరేటర్ లో మైనస్ జీరో డిగ్రీల వద్ద గడ్డకట్టిన వ్యాక్సిన్ షాట్లు
సిల్చార్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్లో ఐఎల్ఆర్ ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉంది. దీంతో టీకాలు గడ్డకట్టినట్టు కాచర్ జిల్లాలోని ఒక ఆరోగ్య అధికారి తెలిపారు.
ఐస్-లైన్డ్ రిఫ్రిజిరేటర్ ( ఐ ఎల్ ఆర్) యొక్క సాంకేతిక లోపం కారణంగా చెప్తున్నారు . తాము సాధారణంగా 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఐ ఎల్ ఆర్ యొక్క ఉష్ణోగ్రతను నియంత్రిస్తాము. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, ఐ ఎల్ ఆర్ యంత్రం ఒక సందేశాన్ని పంపుతుంది. కానీ మా వ్యాక్సినేటర్కు ఎటువంటి సందేశం రాలేదని ఆయన చెప్పారు.

కోల్డ్ స్టోరేజ్ లో సాంకేతిక లోపం అంటున్న ఆస్పత్రి వర్గాలు , విచారణకు ఆదేశం
వ్యాక్సిన్ లను కోల్డ్ స్టోరేజ్ లో ఉంచిన క్రమంలో సాంకేతిక లోపం వల్ల టీకాలు రాత్రంతా మైనస్ జీరో డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడ్డాయి .తమకు తెలియకుండానే ఉష్ణోగ్రతలు పడిపోయాయి అని ఆరోగ్య అధికారి తెలిపారు.
మరోవైపు, ఈ సంఘటన తరువాత రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఆసుపత్రి అథారిటీ నుండి నివేదిక కోరింది.
కాచర్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి విచారణకు ఆదేశించారు . రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ లక్ష్మణన్ ఎస్ కూడా కోవిషీల్డ్ యొక్క 1,000 మోతాదులను కలిగి ఉన్న 100 బాక్సులు గడ్డకట్టిన కారణాన్ని గుర్తించాలని ఆదేశించారు.

మానవ తప్పిదమా .. సాంకేతిక లోపమా ?
అస్సాం యొక్క కోల్డ్-చైన్ వ్యవస్థలో, టీకాలను రవాణా చేసి, నిల్వ చేయడానికి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం పేర్కొన్న విధంగా ఐస్-లైన్డ్ రిఫ్రిజిరేటర్లలో (ఐఎల్ఆర్) టీకాలు రవాణా చేయబడ్డాయి.
కానీ టీకాలు గడ్డకట్టి పాడైపోయిన కారణం మాత్రం దర్యాప్తు చేస్తున్నారు . ఒకపక్క కరోనా వ్యాక్సిన్ లను ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంటే సాంకేతిక లోపమో , మానవ తప్పిదమో కానీ వెయ్యి వ్యాక్సిన్ మోతాదులు అనవసరంగా నిరుపయోగంగా మారాయి .