వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీకి 136 ఏళ్లు: 'హస్తం' వెనుక తెలుగు నేత హస్తం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ

రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు ప్రాణంలాంటిది. తమ గుర్తింపు అంతా ఆ గుర్తులోనే ఉంటుందని భావిస్తుంటాయి. అందుకే, ఓటర్ల మదిలో నిలిచిపోయే ఎన్నికల గుర్తు కోసం ప్రయత్నిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత నాటకీయంగా హస్తం గుర్తు వచ్చింది. ఆ గుర్తు రావడం వెనుక ఓ తెలుగు నేత హస్తం ఉంది.

కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు ఎలా వచ్చింది. దాని వెనుక ఉన్న తెలుగు వ్యక్తి ఎవరు అనే అంశాన్ని రాజకీయ జర్నలిస్టు రషీద్ కిద్వాయ్ తన 'బ్యాలెట్ : టెన్ ఎపిసోడ్స్ దట్ హావ్ షేప్డ్ ఇండియాస్ డెమోక్రసీ' పుస్తకంలో పేర్నొన్నారు.

కాసు బ్రహ్మానందరెడ్డి

కాంగ్రెస్‌లో చీలిక

సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు చీలిపోయింది. మరెన్నో పార్టీలు అందులో కలిసిపోయాయి. అయితే, కొన్ని చీలికలు మాత్రం ఆ పార్టీ చరిత్రనే మార్చేశాయి. అందులో ఒకటి 1978లో వచ్చిన చీలిక.

ఇందిరా గాంధీ దేశంలో అత్యయిక పరిస్థితి విధించిన తరువాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇందిర సైతం రాయబరేలీలో జనతా కూటమి అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. అప్పుడు జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఆ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. 1977‌లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమబెంగాల్‌కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డారు. బ్రహ్మానందరెడ్డి గెలిచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు.

ఆ తరువాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారాయన. ఆ క్రమంలో ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఇందిర తనవర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు.

దాంతో 1978 జనవరి 1న ఇందిరను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు.

ఆ సమయంలో వైబీ చవాన్, వసంత్ దాదా పాటిల్, స్వరణ్ సింగ్ వంటివారంతా బ్రహ్మానందరెడ్డి వెంట నిలిచారు.

'ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర' అన్న డీకే బారువా కూడా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికారు.

కాంగ్రెస్(ఐ) ఏర్పాటు

బహిష్కరణ మరునాడే అంటే జనవరి 2న ఇందిర గాంధీ కాంగ్రెస్(ఐ) అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.

153 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 66 మంది మద్దతు కూడా ఇందిరకు లభించలేదు.

అంతేకాదు, ఆమె తన కొత్త పార్టీకి కొత్త ఆఫీసు కూడా వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది.

పార్టీ గుర్తయిన 'ఆవు - దూడ' చిహ్నాన్ని కూడా ఆమె కోల్పోవాల్సి వచ్చింది.

అత్యధిక మంది మద్దతు తమకే ఉన్నందున 'ఆవు, దూడ' గుర్తు తమకే చెందాలంటూ కాంగ్రెస్(ఐ) తరఫున బూటా సింగ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు.

కానీ, బ్రహ్మానందరెడ్డి వర్గం నుంచి అభ్యంతరాలు ఉండడం, ఆ గుర్తు తమకే చెందాలని వారు కూడా పట్టుపట్టడంతో ఎన్నికల సంఘం అప్పటికి ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేసింది.

పీవీ నరసింహారావు

గందరగోళానికి తెరదించింది పీవీ

కాంగ్రెస్ పార్టీ గుర్తు 'ఆవు, దూడ'ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో కాంగ్రెస్(ఐ)కి కొత్త గుర్తు ఎంచుకోమని సూచించింది ఎలక్షన్ కమిషన్.

అప్పటికి ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి విజయవాడలో పర్యటిస్తున్నారు. గుర్తు ఎంచుకోమని ఎలక్షన్ కమిషన్ బూటా సింగ్ ముందు మూడు ఆప్షన్లు ఉంచింది.

ఆ మూడు ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని భావించి ఇందిర ఆమోదం కోసం విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీకి ట్రంక్ కాల్ చేశారు బూటాసింగ్.

లైన్లన్నీ అస్పష్టంగా ఉన్నాయి.. బూటాసింగ్ చెబుతున్నది ఇందిరకు స్పష్టంగా వినిపించలేదు.

ఆ సమయంలో ఎంతో గందరగోళం చోటుచేసుకుంది. బూటాసింగ్ హాత్ (హస్తం) అని చెబుతుంటే.. ఇందిరకు అది హాథీ(ఏనుగు) అన్నట్లుగా వినిపించింది. దాంతో ఆమె వద్దని చెప్పారు.

ఆ సంగతి అర్థం చేసుకున్న బూటాసింగ్... ఏనుగు కాదు హస్తం అని వివరిస్తున్నా ఫోన్ లైన్ అస్పష్టంగా ఉండడం, బూటాసింగ్ స్వరం కూడా బాగా బొంగురుగా ఉండడంతో ఇందిరకు ఏమీ అర్థం కాలేదు.

దాంతో ఆమె ఫోన్ రిసీవర్‌ను పక్కనే ఉన్న పీవీ నరసింహరావుకు ఇచ్చారు.

బహు భాషా కోవిదుడైన పీవీకి వెంటనే విషయం అర్థమైంది. బూటా చెబుతున్నది అర్థం చేసుకున్న ఆయన హాథీ, హాత్ అనే పదాల మధ్య పోలిక వల్ల గందరగోళం తలెత్తిందని అర్థం చేసుకుని వెంటనే హస్తానికి ప్రత్యాయపదం సూచించి ఇందిరకు ఆ మాట చెప్పమంటారు. ''బూటా సింగ్‌జీ పంజా కహియే పంజా''(బూటాసింగ్ గారూ.. పంజా అని చెప్పండి పంజా) అని పీవీ సూచించడంతో ఇందిర వెంటనే రిసీవర్ అందుకుని ''ఆ గుర్తు బాగుంటుంది.. అదే ఖాయం చేయండి'' అని చెప్తారు.

ఇలా కాంగ్రెస్(ఐ)కి హస్తం గుర్తు వచ్చిందని ఆనాటి పరిణామాలను రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో రాసుకొచ్చారు.

రషీద్ కిద్వాయ్ రాసిన పుస్తకం

నేతల్లో అయిష్టత.. ఇందిర నుంచి సానుకూలత

హస్తం గుర్తు చాలామంది నేతలకు నచ్చలేదు. ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఉంది, ఇదేం గుర్తు? అనే విమర్శలు వచ్చాయి. కానీ, ఇందిర మాత్రం ఈ కొత్త గుర్తు పట్ల సంతోషించారట.

అందుకు కారణం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆవు, దూడ గుర్తును ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ‌లతో పోల్చి విపక్షాలు విమర్శలు కురిపించాయి.

ఈ కొత్త గుర్తుతో ఆ బాధ తప్పిందని ఇందిర సంతోషించారట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Telugu leaders contribution behind the success of congress party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X