పాక్ ,ఇండియా సరిహద్దులో 150 మీటర్ల రహస్య సొరంగం.. నగోట్రా ఎన్ కౌంటర్ తో వెలుగులోకి !!
జమ్మూ కాశ్మీర్ లోని సాంబ సెంటర్లో అంతర్జాతీయ సరిహద్దు వెంట 150 మీటర్ల పొడవు ఉన్న రహస్య మార్గాన్ని భారత భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇటీవల నాగోట్రా ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు ఈ సొరంగ మార్గాన్ని వినియోగించినట్లుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. నగోట్రా ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అంత పెద్ద ఎత్తున ఆయుధాలు ఈ సొరంగ మార్గం ద్వారానే తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లుగా అనుమానిస్తున్నారు.
జమ్మూ, కాశ్మీర్ లో ఎన్కౌంటర్ ..నలుగురు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు హతం

సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద సొరంగం గుర్తించిన బిఎస్ఎఫ్
సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సైనికులు అంతర్జాతీయ సరిహద్దులో జమ్మూ కాశ్మీర్ సాంబా జిల్లాలోని రీగల్ ప్రాంతంలో కనుగొన్న ఈ భూగర్భ సొరంగ మార్గం పాకిస్తాన్ నుండి ఇండియాకు సరిహద్దు దాటడానికి ఉపయోగిస్తున్నట్లు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బిఎస్ఎఫ్ 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగం గుర్తించినట్లు డిజిపి దిల్బాగ్ సింగ్ ధృవీకరించారు. జమ్మూ సరిహద్దు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ ఎన్ ఎస్ జామ్వాల్, జమ్మూ పరిధిలోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముఖేష్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఈ టన్నెల్ ద్వారానే చొరబాటు.. నగ్రోటా ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఉగ్రమూక
ఆర్మీ ఆపరేషన్‌లో గురువారం మృతి చెందిన నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ సొరంగం ఉపయోగించి పాకిస్తాన్ నుంచి దేశంలోకి చొరబడవచ్చని అనుమానిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల నగ్రోటా సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తులో భాగంగాఈ సొరంగ మార్గం వెలికి తీసినట్లు దిల్ బాగ్ సింగ్ తెలిపారు. ఎన్కౌంటర్ సంఘటన స్థలంలో దొరికిన కొన్ని ముఖ్యమైన ఆధారాలను పోలీసులు బిఎస్ఎఫ్ తో పంచుకున్నారు. సొరంగానికి సంబంధించిన అనేక అనుమానాలు తలెత్తడంతో ఫైనల్ గా సొరంగంను కనుగొనగలిగాము అని అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అన్నారు.

భారీగా సొరంగ మార్గాల కోసం కొనసాగుతున్న ఆపరేషన్
సాంబా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు దాటి నలుగురు ఉగ్రవాదుల చొరబాటు గురించి భద్రతా దళాలకు సమాచారం అందటంతో వాహన తనిఖీలలో ఉగ్రవాదులను హతమార్చారు . శుక్రవారం నుంచి భారీగా సొరంగ మార్గాల కోసం ఆపరేషన్ జరుగుతోందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, పోలీసులు కూడా పాల్గొంటున్నట్టు, ఇది ఇంకా కొనసాగుతున్నట్లుగా చెప్పారు. గతంలో కూడా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో పలు సొరంగ మార్గాలను భద్రతా దళాలు గుర్తించాయి.

నవంబర్ 28 నుంచి ఎనిమిది దశల్లో జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు
గురువారం కాశ్మీర్‌కు వెళ్లే ట్రక్కులో ప్రయాణిస్తున్న సమయంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి టోల్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. వారి వద్ద నుండి సేకరించిన పలు ఆధారాలను బట్టి ఈ టన్నెల్ కనుగొనబడింది. నవంబర్ 28 నుంచి ఎనిమిది దశల్లో జరగనున్న జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలకు అంతరాయం కలిగించే పెద్ద ప్రణాళికతో ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడి నట్లుగా పోలీసులు చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు ఇంకా సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తూనే ఉన్నాయి.

సరిహద్దు వెంట కొనసాగుతున్న పాక్ దుశ్చర్యలు
ఇదే సమయంలో పాక్ దుశ్చర్యలకు పాల్పడుతోంది . నిన్నటికి నిన్న రాజౌరీ జిల్లా, నౌషేరా సెక్టార్ లో సైనిక శిబిరాలను, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని చిన్నపాటి ఆయుధాలు, మోర్టార్ లతో దాడికి పాల్పడింది. సత్పాల్, మన్యారి ప్రాంతాల్లోని సైనిక శిబిరాల వద్ద కూడా కాల్పులు జరిపింది. పాక్ దుశ్చర్యలకు పాల్పడుతుంటే భారత సైనిక బలగాలు పాక్ కు గట్టిగానే సమాధానం చెబుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట పాక్ డ్రోన్ కలకలం సృష్టించింది. సరిహద్దు వెంబడి ఆయుధాలు, మాదకద్రవ్యాలను భారత్ లోకి తరలించడం కోసం పాక్ ఈ తరహా చర్యలకు పాల్పడుతోంది.