
ఘోర ప్రమాదంం బస్సు, సిలిండర్ల ట్రక్కు ఢీకొనడంతో 16 మంది మృతి, మరో 26 మందికి గాయాలు
రాంఛీ: జార్ఖండ్ రాష్ట్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాకూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వస్తున్న బస్సును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పడేర్ కోలాలోని గోవింద్పూర్-సాహెబ్గంజ్ రాష్ట్ర రహదారిపై బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటి వరకు 16 మంది చనిపోగా, గాయపడినవారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

గాయపడినవారికి జిల్లా కేంద్రంలోని సర్దార్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో కొందరు బస్సులోనే ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్లతో ఆ వాహనాన్ని ఛేదించి వారిని బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.
అయితే, ఈ ప్రమాదంతో ట్రక్కులోని గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెపు ప్రమాదం తప్పినట్లయింది. సిలిండర్లు పేలితే ప్రాణ నష్టం భారీగా ఉండేదని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.