హెచ్ఎండీఏ పరిధి పెంపు.. ఆ 4 జిల్లాల్లోని 16 మండలాలు విలీనం
హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ(HMDA) పరిధిని విస్తరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో హెచ్ఎండీఏ పరిధిలోకి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 16 మందిలాలు విలీనం కానున్నాయి. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోకి కొత్తగా 3 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చేరనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏను విస్తరించనున్నారు. దీంతో మహా మాస్టర్ ప్లాన్ రాబోతోంది. హైదరాబాద్ రూపురేఖలు మరింత మార్చవేయనున్నారు.

2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమల్లో ఉంది. దీనికి మరో 25 ఏళ్లు జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ విస్తీర్ణం పెరగడంతో భూముల రేట్లలో భారీగా మార్పులు రానున్నాయి. అభివృద్ధి కూడా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనుంది. విస్తరణ తర్వాత హెచ్ఎండీఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది. హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా)ని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణయంలో ఏర్పాటు చేశారు.
2008లో అప్పటి ప్రభుత్వం హుడాను హెచ్ఎండీఏగా మార్చింది. ఆ తర్వాత హెచ్ఎండీఏ పరిధి 7257 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అనంతరం జరిగిన విస్తరణలతో హెచ్ఎండీఏ పరిధి 10,472 చదరపు కిలోమీటర్ల చేరింది. సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ మహా నగరం విస్తరణలో హెచ్ఎండీఏ కీలకంగా వ్యవహరిస్తోంది. కాగా, ట్రిపుల్ ఆర్ తో భూముల ధరలు ఇప్పటికే పెరగ్గా.. ఇప్పుడు హెచ్ఎండీఏ విస్తరణ తర్వాత కొత్తగా కలిసిన జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications