farmers protest modi govt home minister amit shah talks failure రైతుల నిరసన మోడీ ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా చర్చలు
17వ రోజుకు అన్నదాతల నిరసన.. నల్ల చట్టాల రద్దుకు ఢిల్లీ ఘెరావ్ .. నేడు ఢిల్లీ - జైపూర్ రహదారి నిర్బంధం
రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. నేడు 17వ రోజుకు అన్నదాతల ఆందోళన చేరుకుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా అన్నదాతలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాటం చేస్తున్నారు. 16 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాక పోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
తీవ్రమవుతున్న రైతు ఉద్యమం .. ఢిల్లీ ఘెరావ్ ప్లాన్ .. డిసెంబర్ 14 న దేశవ్యాప్త నిరసనకు పిలుపు

ఢిల్లీ - జైపూర్ రహదారిని అడ్డుకునేందుకు రైతు సంఘాల పిలుపు .. భారీగా చేరుకున్న నిరసనకారులు
ఈ క్రమంలో తాజాగా అమృత్ సర్ లోని కిసాన్ మజ్దూర్ సంఘ్ కమిటీ సభ్యులు 700 ట్రాక్టర్లతో రాజధానికి చేరుకున్నారు. ఈరోజు 17 వ రోజు ఆందోళనలో భాగంగా ఢిల్లీ-జైపూర్ రహదారిని అడ్డుకోవాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ - జైపూర్ రహదారిని అడ్డుకునేందుకు నిరసనకారులు చేరుకున్నారు . ఢిల్లీ ఘెరావ్ లో భాగంగా ఢిల్లీ కి వెళ్ళే అన్ని రహదారుల దిగ్బంధనానికి రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మూడు "ఏకపక్ష" చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ యూనియన్ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఉన్నత కోర్టు ఇప్పటికే కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఆందోళనల తీవ్రత దృష్ట్యా భారీగా పోలీసుల బందోబస్తు
నిరసనకారుల ఆందోళనలు ఉధృతం అవుతున్న నేపధ్యంలో వారిని నిరోధించడానికి వేలాది మంది పోలీసులు దేశ రాజధాని సరిహద్దుల్లో విధుల్లో ఉన్నారు . గుర్గావ్‌లో రెండు వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారని, నిరసనకారులను ఆపడానికి ఫరీదాబాద్‌లో 3,500 మంది పోలీసులు విధుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. రైతు సంఘాల ఆందోళన మూడవ వారానికి ప్రవేశించడంతో, అధికార బిజెపి దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనను తిప్పికొట్టే భారీ ప్రచారాన్ని ప్లాన్ చేసింది.

పలుమార్లు రైతులతో చర్చలు జరిగినా ఫలించని చర్చలు
శుక్రవారం, నిరసనకారులు తమ ఆందోళనను రాజకీయ పార్టీలు ద్వారా ప్రభావితం చేశాయనే వాదనలను తోసిపుచ్చారు. ప్రభుత్వ ఈ వాదనను మేము తిరస్కరించాము, మమ్మల్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. ఇది కావాలని మా పై దుష్ప్రచారం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని రైతులు అంటున్నారు. అన్ని నిర్ణయాలు సంయుక్త్ కిసాన్ యూనియన్ తీసుకుంటుంది అని అన్నారు.
ఇప్పటివరకు పలుమార్లు రైతులతో చర్చలు జరిగినప్పటికీ చర్చలు ఫలించలేదు.

డిసెంబర్ 14 నాటికి దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం
వ్యవసాయ చట్టాలలో సవరణలు చేయాలన్న కేంద్రం యొక్క వ్రాతపూర్వక ప్రతిపాదనను నిరసనకారులు ఏకగ్రీవంగా తిరస్కరించారు . వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని భీష్మించుకు కూర్చున్నారు. అంతేకాదు వారి ఆందోళన ఉధృతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 14 నాటికి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిరసన కొనసాగుతుందని , ఉద్యమం ఉధృతం అవుతుందని వారు తెలిపారు.
ఈ వారం ప్రారంభంలో అమిత్ షాతో జరిగిన సమావేశం ప్రతిష్ఠంభనను పరిష్కరించడంలో విఫలమైంది. సమావేశం తరువాత, రైతులు మరియు నిరసనకారుల మధ్య ఆరవ విడత చర్చలు రద్దు అయ్యాయి.