2020 బిగ్ ఈవెంట్: హౌడీ మోడీ-నమస్తే ట్రంప్, తాజ్‌మహల్ సందర్శన, అటు ఢిల్లీలో అల్లర్లు
న్యూఢిల్లీ: ఈ 2020 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద కార్యక్రమంలో ఒకటి నమస్తే ట్రంప్. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబసభ్యులు తొలిసారి భారతదేశానికి వచ్చారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఈ నమస్తే ట్రంప్ కార్యక్రమం జరిగింది.

హౌడీ మోడీ- నమస్తే ట్రంప్
అమెరికాలోని హూస్టన్ నగరంలో సెప్టెంబర్ 2019లో జరిగిన హౌడీమోడీ కార్యక్రమానికి స్పందనగా నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని భారతదేశంలో నిర్వహించారు. హౌడీమోడీ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రవాసభారతీయులు పాల్గొన్నారు. కాగా, అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం(మొతేరా స్టేడియం)లో నమస్తే కార్యక్రామన్ని నిర్వహించగా లక్ష మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబసభ్యులు ఈ ఈవెంట్‌లో భాగస్వాములయ్యారు.

భారత్, మోడీపై ట్రంప్ ప్రశంసలు..
ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. భారత్-అమెరికా దైపాక్షి సంబంధాలపై ఇరు దేశాధినేతలు మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను కొనియాడారు. భారత్, మోడీపై డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా ప్రశంసల వర్షం కురిపించారు. లక్షలాది మంది ప్రజల హర్షాతిరేకాల మధ్య ఇరుదేశాధినేతల ప్రసంగాలు కొనసాగాయి.

కెమ్ చో ట్రంప్ నుంచి నమస్తే ట్రంప్‌గా.. ఆ గోడలపై విమర్శలు
మొదట కెమ్ చో ట్రంప్ అని ఈ కార్యక్రామినికి నామకరణం చేసినప్పటికే భారత ప్రభుత్వం దాన్ని నమస్తే ట్రంప్ అని మార్చింది. స్థానికత కన్నా జాతీయతకు ప్రాముఖ్యత ఇచ్చేందుకే ఈ పేరు మార్పు చేసింది. ఇది ఇలావుంటే, సర్దార్ పటేల్ స్టేడియానికి డొనాల్డ్ ట్రంప్ రోడ్డు మార్గం ద్వారానే చేరుకున్నారు. అయితే, ఈ మార్గంలో ఉన్న కొన్ని మురికివాడలు కనిపించకుండా గోడలు కట్టారనే విమర్శలు వచ్చాయి. అయితే, గుజరాత్ ప్రభుత్వం మాత్రం భద్రతా కారణాల వల్లే గోడలు నిర్వహించినట్లు తెలిపింది.

తాజ్ మహల్ సందర్శనలో ట్రంప్ కుటుంబం..
నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ప్రముఖ కట్టడం తాజ్ మహల్‌ను డొనాల్డ్ ట్రంప్ కుటుంసభ్యులు సందర్శించారు. అక్కడే ఫొటోలు, సెల్ఫీలు దిగి సందడి చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ట్రంప్ కుటుంబానికి ఆగ్రా విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ట్రంప్ కుటుంబ పర్యటన సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అగ్రరాజ్యాధినేత పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్రంప్ ఫ్యామిలీకి రాష్ట్రపతి విందు.. భారీ డిఫెన్స్ డీల్..
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందు కార్యక్రమంలో ట్రంప్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఐటీసీ మౌర్యాలో వీరు బస చేశారు. తదుపరి రోజు నానంక్‌పురలోని సర్వోదయ విద్యాలయ సీనియర్ సెకండరీ కో-ఎడ్యుకేషనల్ స్కూల్‌ను అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్ సందర్శించారు. ఇక ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా 5జీ కనెక్టివిటీ, ట్రేడ్ డీల్స్, తదితర కీలక విషయాలపై ప్రసంగించారు. అంతేగాక, 3 బిలియన్ డాలర్ల డిఫెన్ డీల్ కుదుర్చుకున్నారు.

ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న సమయంలోనే..
ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న సమయంలోనే ట్రంప్ పర్యటన కొనసాగడం గమనార్హం. సుమారు వారం రోజులపాటు దేశ రాజధానిలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ట్రంప్ పర్యటన నేపథ్యంలో భారత ప్రతిష్టను దిగజార్చేందుకే కొందరు రాజకీయ నాయకులు ఇలాంటి అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అయితే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ట్రంప్ పర్యటనకు అంత ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడ్డాయి. ట్రంప్ పర్యటన కోసం భారీగా ఖర్చు చేశారంటూ విమర్శించాయి.