2020 గొప్ప మానవతావాది ..వలస కార్మికులకు దేవుడు.. రీల్ లైఫ్ విలన్ రియల్ లైఫ్ హీరో సోను సూద్
2020లో మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం అని చెప్పాలంటే అది కచ్చితంగా సోనుసూద్ కే చెప్పాలి. 2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ, ఇతరత్రా అనేక కష్టాలలో సోనూసూద్ ఎందరికో బాసటగా నిలిచారు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. ఈ ఏడాది గొప్ప మానవతావాదిగా గుర్తించబడిన వ్యక్తి రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ హీరో .. సోను సూద్.

కరోనా టైం లో వలస వెతలను చూసి చలించిపోయిన సోను సూద్ .. కార్మికులకు అండగా
నటుడు, మానవతావాది, హీరో ఈ మూడు పదాలు రీల్-లైఫ్ విలన్ సోను సూద్ కు ఖచ్చితంగా సరిపోయే పదాలు. కరోనావైరస్ ప్రారంభమైనప్పటి నుండి, బాలీవుడ్ నటుడు ,సినిమాలలో అందరికీ గుర్తుండిపోయిన విలన్ సోనుసూద్ నిజ జీవితంలో మాత్రం హీరోగా మారిపోయారు. కరోనా మహమ్మారి బారిన పడినవారికి సహాయపడటం లో అందరి కంటే ముందు వరుసలో నిలిచారు. వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో, వలస కార్మికుల వెతలను చూసి చలించిపోయాడు. కార్మికుల పాలిట దేవుడయ్యాడు .

వలస కార్మికులను గమ్య స్థానాలకు చేర్చటానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన రియల్ హీరో
వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉండలేక పోతున్నాను అని వారిని ఇళ్లకు చేర్చడానికి ప్రయత్నాలు చేస్తానని చెప్పిన సోను సూద్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి తీసుకొని వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోనూ , బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ప్రజలకు ఆయన వలస దేవుడయ్యాడు. వలస కార్మికులకు భోజనం అందించడం నుండి ప్రవాసి రోజ్గర్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం వరకు ఎన్నోరకాలుగా సహాయం చేశారు.

కరోనా వారియర్స్ కు బాసటగా , తన జుహు హోటల్ లో వారికి వసతి
కరోనా పోరాటంలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలను అద్దె గృహాలలో అనుమతించని కారణంగా సోను సూద్ తమ జుహు హోటల్ వారు ఉండటానికి కేటాయించారు. ముంబైలోని జుహు హోటల్ ను వైద్య సిబ్బంది కోసం కేటాయించి తన మంచి మనసును చాటుకున్నారు . పంజాబ్లోని వైద్యులు, వైద్య సిబ్బంది కోసం 1500 పి పి ఈ కిట్లను ఆయన అందించారు . నటుడు సోను సూద్ కరోనా సమయంలో విద్యార్థుల చదువులు నిలిచిపోవడంతో, చాలా మంది నిరుపేద పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినడానికి కావలసిన స్మార్ట్ ఫోన్లు లేక ఇబ్బంది పడడంతో వారికి ఫోన్లు, టాబ్లెట్లు మరియు ఇతర వస్తువులను అందించారు.

ఆన్ లైన్ తరగతులు వినేందుకు నిరుపేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు , విదేశాలలో ఉన్న ఇండియన్స్ కు సాయం
అంతేకాకుండా, నీట్ పరీక్ష నిర్వహించాలా వద్దా అనే దానిపై తలెత్తిన నిరసనల సమయంలో, నటుడు విద్యార్థుల పక్షాన నిలబడి, పరీక్షలు వాయిదా వేయకపోతే వారికి ప్రయాణానికి సహాయం చేయమని ప్రతిపాదించాడు. విదేశాలలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు స్వదేశానికి తిరిగి రావడానికి కూడా సోను సూద్ అందించిన సహాయం నిరుపమానం . మానవతా దృక్పథంతో సహాయం చేస్తున్న సోనూసూద్ గురించి, అతను చేసిన సహాయం గురించి తెలిసిన తరువాత చాలామంది పలు అత్యవసర సందర్భాలలో సహాయం చేయమని ఆయనకు అభ్యర్థనలు పంపడం ప్రారంభించారు.

అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్న సోను సూద్ .. 2020 గొప్ప మానవతావాది
నావల్ల కాదు అని చెప్పకుండా సోను సహాయం చేస్తూనే పోయారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు సహాయం కోసం తనకు ఫోన్ కాల్స్ చేస్తున్న వారి కోసం సోనూసూద్ ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ని ప్రారంభించారంటే ఆయన ఔదార్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు . అందుకే 2020 సంవత్సరం లో గొప్ప మానవతావాదిగా సోను సూద్ అటు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. 2020 సంవత్సరం లో ఎంతోమందికి ప్రేరణనిచ్చిన గొప్ప మానవతావాది, మంచి మనసున్న వ్యక్తి సోను సూద్ అని చెప్పడం నిర్వివాదాంశం. రీల్ లైఫ్ లో విలన్ అయినా రియల్ లైఫ్ లో హీరోగా ఉన్న సోనూసూద్ కు హ్యాట్సాఫ్ చెప్తూ నువ్వే నిజమైన హీరో అంటూ దేశవ్యాప్తంగా సోనూసూద్ ను కొనియాడుతున్నారు.