2050 నాటికి విశాఖ సహా 30 భారతీయ నగరాలకు తీవ్ర నీటి కొరత- WWF హెచ్చరికలు
ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు పలు దేశాల్లో భవిష్యత్తులో భారీ నీటి కొరతను సృష్టించబోతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఇలా నీటి కొరత ఎదుర్కోబోతున్న దేశాలపై అంతర్జాతీయ సంస్ధ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదిక కలకలం రేపుతోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రిస్క్ జాబితాలో 100 నగరాలుంటే ఒక్క భారత్‌లోనే 30 నగరాలు ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. ఆయా నగరాల్లో నివసిస్తున్న 350 మిలియన్ల ప్రజలు బాధితులుగా మారబోతున్నట్లు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వెలువరించిన అంచనాలు ఆందోళన రేపుతున్నాయి. వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవాల్సిన అవసరం తెలియజేస్తున్నాయి.

వాతావరణ మార్పుల ప్రభావం...
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీవాతావరణ మార్పులపై దృష్టిసారిస్తున్నాయి. వివిధ పరిశోధనల్లో ఎదురవుతున్న ఫలితాలతో వాతావరణ మార్పులను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను గుర్తిస్తున్నాయి. పలుదేశాలు వాటిని తక్షణం అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తక్షణం వాతావారణ మార్పులపై స్పందించకపోతే భవిష్యత్తులో ప్రపంచ నగరాలకు తీవ్ర ముప్పు తప్పదని డబ్లూడబ్ల్యూఎఫ్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్ధితులు కొనసాగితే 2050 కల్లా ప్రపంచంలో 100 నగరాలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటాయని ఈ నివేదిక తెలిపింది. ఈ జాబితాలో భారత్‌లోని 30 నగరాలు ఉండటం విశేషం.

భారత్‌లో విశాఖ సహా 30 నగరాలపై ప్రభావం
డబ్లూడబ్ల్యూఎఫ్ వాటర్ రిస్క్ ఫిల్టర్ ప్రకారం, 2050 నాటికి నీటి ప్రమాదంలో అత్యధికంగా నష్టపోతాయని భావిస్తున్న 100 నగరాలు 350 మిలియన్ల మందికి నివాసంగా, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలకు కేంద్రాలుగా ఉన్నాయి. వీటిలో చైనాతో దాదాపు 50 నగరాలు ఉండగా.. భారత్‌లో 30 నగరాలు ఉన్నాయి. భారత్‌లో ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అమృత్సర్, పూణే, శ్రీనగర్, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, కోజికోడ్, విశాఖపట్నం సహా భారతదేశంలో 30 నగరాలు అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. వీటిపై వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో తక్షణం కౌంటర్ చర్యలు తీసుకోవడం ప్రారంభించకపోతే పెను ప్రమాదం తప్పవని
నివేదిక హెచ్చరించింది.

నీటి కొరతకు ప్రధాన కారణాలివే...
వేగంగా పట్టణీకరణ, వాతావరణ మార్పులు, తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలతో భారతదేశం లోని ప్రధాన నగరాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి, ఇది ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెంచుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా, చెన్నై నుండి సిమ్లా వరకు నగరాలు తీవ్ర నీటి సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నీటి సంరక్షణకు కీలకమైన వర్షపు నీటి సేకరణ లేకపోవడం వంటి సమస్యలను ప్రధాని మోడీ.. తన మన్ కి బాత్ రేడియో ప్రసంగంలో హైలైట్ చేస్తూనే ఉన్నారు అయినా భారతదేశంలో 8% వర్షపు నీరు మాత్రమే ఆదా అవుతుందని తెలుస్తోంది.

నగరీకరణపై తీవ్ర ప్రభావం....
భారత్ వంటి దేశాల్లో పర్యావరణ భవిష్యత్తు దాని నగరాలపైనే ఆధారపడి ఉంది. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో దేశాభివృద్ధిలో నగరాల స్ధిరత్వమే కీలకంగా ఉంది. అలాంటి పరిస్ధితుల్లో నీటి కొరత నుంచి నగరాలను రక్షించాలంటే పట్టణ వాటర్‌షెడ్ పథకాలు, చిత్తడి నేలల పునరుద్ధరణ వంటి ప్రకృతి ఆధారిత పరిష్కారాలు పరిష్కారాలు అమలు చేయాలని నిపుణలు చెబుతున్నారు.
స్థిరమైన నీటి మౌలిక సదుపాయాలను సృష్టించడం మరియు పరిరక్షించడం మరియు పట్టణ మంచినీటి వ్యవస్థలను తిరిగి సాధారణ స్ధితికి తీసుకురావడానికి అందరి భాగస్వామ్యం, నిర్వహణ కీలకమని నివేదికలు చెబుతున్నాయి. పట్టణ నీటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నీటి వినియోగాన్ని తగ్గించడం వల్ల నీటి కొరతను ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చెబుతోంది.