ఈ నెల 10 నుంచి వందేభారత్ మిషన్ మూడోవిడత- 337 విమానాలు రెడీ....
కరోనా వైరస్ లాక్ డౌన్ విధించిన తర్వాత విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వస్ధలాలకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన వందే భారత్ మిషన్ విజయవంతంగా మూడో దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు విడతల్లో లక్షకు పైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన ఈ మిషన్... మూడో విడత ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్రం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్లో కరోనా వైరస్ విస్పోటనం.. పెరిగిన మరణాలు.. తెలంగాణలో తాజా లెక్కలివి..

వందే భారత్ మిషన్ మూడో విడత...
లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన లక్షా 7 వేల మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా ప్రత్యేక విమానాల్లో స్వస్ధలాలకు తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఎయిర్ లిఫ్ట్ గా పేర్కొంటున్న ఈ మిషన్ ప్రస్తుతం మూడో దశకు చేరుకుంటోంది. ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే మూడో విడత వందే భారత్ మిషన్ కోసం కేంద్రం 337 విమానాలను సిద్ధం చేస్తోంది.
ఇందులో భాగంగా 31 దేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 38 వేల మందిని 337 విమానాల ద్వారా స్వదేశానికి తరలించనున్నారు.
వీటిలో 54 విమానాలు అమెరికా, 24 కెనడా, నైజీరియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, కెన్యా, సీషెల్స్, మారిషస్ నుంచి 11 విమానాలు రానున్నాయి. వీటితో పాటు బోర్డర్ చెక్ పోస్టుల ద్వారా కూడా భారతీయులను స్వదేశంలోకి అనుమతించనున్నారు.

భారీగా స్వదేశానికి వలసలు...
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు భారీగా స్పందన ఉంటోంది. ఇప్పటికే విదేశాల్లో చిక్కుకుపోయిన లక్షకు పైగా భారతీయులు రెండు విడతల్లో స్వదేశానికి తిరిగొచ్చారు. వీరిలో 17,485 మంది వలస కార్మికులు, 11,511 మంది విద్యార్ధులు, 8,633 మంది నిపుణులు ఉన్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. వీరంతా లాక్ డౌన్ కు ముందు ఏదో ఒక కారణంతో విదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారే...

చెక్ పోస్టులు, ఇమ్మిగ్రేషన్ పాయింట్ల ద్వారా...
ఓవైపు విదేశాల నుంచి విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకొస్తూనే మరోవైపు... నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగుదేశాల నుంచి సరిహద్దు ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల ద్వారా దాదాపు 32 వేల మంది భారత్ చేరుకున్నట్టు కేంద్రం తెలిపింది. మూడో విడతలోనూ సరిహద్దుల ద్వారా భారతీయ పౌరులను స్వదేశంలోకి అనుమతించనున్నారు. అయితే కరోనా మార్గదర్శకాల ప్రకారం వీరికి కూడా అన్ని పరీక్షలు నిర్వహిస్తారు. క్వారంటైన్ నిబంధనలను పూర్తిగా వర్తింపచేయనున్నారు.