ఆపరేషన్ బ్లూ స్టార్: నేటికి 34ఏళ్లు.. 'ఖలీస్తాన్' ఉద్యమ నేపథ్యం..
చంఢీఘడ్: మత ప్రాతిపదికన ముస్లింలు ఎలాగైతే పాకిస్తాన్ పేరుతో వేరుపడ్డారో.. అదే ప్రాతిపదికన సిక్కులు 'ఖలీస్తాన్' దేశం కోసం ఉద్యమించారు.
స్వరాజ్య సిద్ధాంత ప్రాతిపదికన 1970లో ఈ ఉద్యమం మొదలైంది. నేటికి ఆ ఉద్యమానికి 34ఏళ్లు. అహింసా మార్గంలో కాకుండా ఆ ఉద్యమం హింసను ఆశ్రయించడంతో ప్రభుత్వం దాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది.
ఖలీస్తాన్ ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు:
స్వాతంత్య్రానంతరం సిక్కు ప్రాంతాలన్నింటినీ పంజాబ్ రాష్ట్రంగా ఏర్పరిచారు. దీంతో అప్పటిదాకా సిక్కు మత ప్రధాన సంస్థగా కొనసాగిన అకాళీదళ్(1920)లో రాజకీయ పార్టీగా మారింది. రాజకీయ పార్టీగా మారడంతో అన్ని వర్గాలను కలుపుకుపోవాల్సిన అనివార్యత ఏర్పడింది. అప్పటిదాకా తమకోసమే పనిచేసిన అకాళీదళ్.. అలా అందరిని కలుపుకుపోవడం సిక్కులను కొంత అభద్రత భావానికి గురిచేసింది.
అదే సమయంలో రాష్ట్రంలో హరిత విప్లవం కారణంగా మధ్యతరగతి వర్గాలు బలపడ్డాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులు బలంగా పాతుకుని సాంప్రదాయ సిక్కు సంస్కృతి స్థానంలో పాశ్చాత్య సంస్కృతి, డ్రగ్స్, అవినీతివి వంటివి పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సిక్కులు తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే ప్రత్యేక దేశంగా అవతరించాల్సిందేనన్న భావన వాళ్లలో బలపడింది. అలా పురుడుపోసుకున్నదే ఖలీస్తాన్ 'ఉద్యమం'.

ఉద్యమం:
1946నుంచే సిక్కు ప్రత్యేక దేశం డిమాండ్ ఉన్నప్పటికీ.. స్వాతాంత్య్రానంతరం అది కనుమరుగైందని చెబుతారు. దానికి కారణం రాష్ట్రాల పునర్విభజనలో సిక్కులు మూడు రాష్ట్రాల పరిధిలోకి వెళ్లడమే. సమైక్య పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడంతో సిక్కులు మూడు రాష్ట్రాల పరిధిలో విభజించబడ్డారు. దీంతో తిరిగి మత ప్రాతిపదికన ఏకమయ్యేందుకు సిక్కులు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఖలీస్తాన్ ఉద్యమం అవతరించింది. 1970, 1980 దశకాల్లో ఈ ఉద్యమం తీవ్రవాద రూపం దాల్చింది.
ఊచకోత:
అహింసా రూపం దాల్చిన ఖలీస్తాన్ ఉద్యమం మరో అడుగు ముందుకేసి.. ప్రత్యేక దేశం సాకారమైనట్టు తమకు తామే ప్రకటించుకున్నారు.
ఖలిస్థాన్ జాతీయ కౌన్సిల్ కార్యదర్శి హోదాలో బల్బీర్‌సింగ్‌సంధూ చేసిన ఈ ప్రకటన దేశాన్ని కుదిపేసింది. అంతేకాదు, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటుచేసి ఖలిస్థాన్ కరెన్సీని, పాస్‌పోర్టులను విడుదల చేయడం అప్పట్లో మరింత కలకలం రేపింది.
ఇదే క్రమంలో సిక్కు ఉగ్రవాదిగా పేరున్న బింద్రన్‌వాలే దందమీతక్సల్ ఖలీస్తాన్ ఉద్యమాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడంతో ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. స్వర్ణ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగించడంతో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1984 జూన్ 1న 'ఆపరేషన్ బ్లూ స్టార్' పేరుతో స్వర్ణ దేవాయలంలో దాక్కున్న ఖలీస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 1984 జూన్ 8వరకు ఆపరేషన్ బ్లూ స్టార్ కొనసాగింది.
ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో జరిగిన సిక్కుల ఊచకోతకు ఇందిరాగాంధీ హత్యతో వారు బదులు తీర్చుకున్నారు.
