భారత్ లో కరోనా చికిత్స, పరీక్షలపై అభ్యంతరాలు-35 మంది దేశ,విదేశీ డాక్టర్ల బహిరంగలేఖ
భారత్ లో కరోనా ధర్డ్ వేవ్ కల్లోలం సాగుతోంది. దేశవ్యాప్తంా పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచాయి. అలాగే చికిత్స కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే వీటిలో పాటిస్తున్న విధానాలపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
భారత్ లో కరోనా పరీక్షలు, చికిత్సపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేశ, విదేశాలకు చెందిన 35 మంది ప్రముఖ డాక్టర్లు ఇవాళ ఓ బహిరంగ లేఖ రాశారు. ఇందులో భారత్ లో కరోనా పరీక్షలు, చికిత్సా విధానాలపై వారు పలు ప్రశ్నలు సంధించారు. ఈ లేఖలో డాక్టర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనవసర పరీక్షలు వద్దని, శాస్త్రీయంగా నిరూపణ అయిన పరీక్షా, చికిత్సా విధానాలను మాత్రమే అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న చికిత్సా విధానాలు తమకు ఆమోదయోగ్యం కాదని వారు తెలిపారు. ఈ లేఖపై భారతీయ మూలాలున్న పలువురు హార్వర్డ్, జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయాల డాక్టర్లు కూడా ఉన్నారు.

భారత్ లో గతేడాది కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా అమలు చేసిన పలు అభ్యంతర కర విధానాలనే మరోసారి అమలు చేయడంపై వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టారు. ఈ లేఖపై సంతకాలు చేసిన డాక్టర్లు ప్రధానంగా ముూడు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో అనవసర పరీక్షలు, అనవసర చికిత్సలు, అనవసర ఆస్పత్రుల వినియోగం వంటివి ఉన్నాయి. ప్రస్తుతం బయటపడుతున్న కోవిడ్ కేసులన్నీ స్వల్ప లక్షణాలు కలిగినవేనని, వాటికి చికిత్స అవసరం లేకపోవడం లేదా స్వల్ప చికిత్స మాత్రమే అవసరం ఉందన్నారు. కానీ దాదాపు రోగులందరినీ ఆస్పత్రులకు తరలించి అనవసర చికిత్సలు అందిస్తున్నారని వారు విమర్శించారు.
ప్రస్తుతం మన దేశంలో డాక్టర్లు కోవిడ్ రోగులకు రాస్తున్న మందులు, ఔషధాలైన అజిత్రోమైసిన్, డాక్సీ సైక్లీన్, హైడ్రో క్లోరోక్విన్, ఫావీపిరావిర్, ఐవర్ మెక్టిన్ వంటివి అస్సలు అవసరం లేదన్నారు. కోవిడ్ సోకిన వారిలో చాలా మందికి కేవలం ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా వైరస్ వ్యాప్తిని గుర్తించాల్సి ఉండగా.. అనవసరంగా సీటీ స్కాన్ లు, ఇతర పరీక్షలు చేయడం, ఎంతో ఖర్చుతో కూడిన రక్త పరీక్షలు చేయించడం చేస్తున్నారని, వీటి వల్ల రోగుల కుటుంబాలపై పెను భారం పడుతుందన్నారు. దీనిపై ప్రభుత్వాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డాక్టర్లు కోరారు.