• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అదే ప్రతిష్ఠంభన: పీస్ ప్లాన్ కోసం పట్టు?.. జస్టిస్ రమణ విందుకూ చలమేశ్వర్ డుమ్మా

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల తిరుగుబాటుతో తలెత్తిన సంక్షోభం ఇంకా సమసిపోలేదు. సంధి కోసం ఇరు వర్గాల్లో అంతర్మధనం ప్రారంభమైంది. అయితే చీఫ్ జస్టిస్ నుంచి 'పీస్ ప్లాన్' జస్టిస్ చలమేశ్వర్ టీం కోరుతున్నట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. కీలక కేసులపై గురువారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి సుప్రీంకోర్టును పటిష్ఠమైన వ్యవస్థగా రూపుదిద్దాలని కోరుతున్నారు. దాని స్వతంత్రతను బలోపేతం చేయాలని నలుగురు న్యాయమూర్తులు కోరుతున్నట్లు తెలుస్తున్నది. కొన్ని అంశాలపై చర్చ జరిపేందుకు కూడా వారు సిద్దమేనని సమాచారం. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా మాత్రమే సంక్షోభ నివారణకు మార్గంతో ముందుకు రావాలని వారు కోరుతున్నారు. మంగళ, బుధవారాల్లో నలుగురు న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లతో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా జరిపిన భేటీలో ఏమీ తేలకున్నా సమావేశం మాత్రం సుహృద్భావ వాతావరణంలో జరిగింది.

బుధవారం జస్టిస్‌ చలమేశ్వర్‌ అస్వస్థత వల్ల సుప్రీంకోర్టుకు రాలేదు. సుప్రీంకోర్టులో మరో తెలుగు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ బుధవారం కోర్టు లాంజ్‌లో న్యాయమూర్తులకు విందు ఇచ్చారు. విందు సుహృద్భావ వాతావరణంలో జరిగింది. వారానికి ఒకరు 'ఫ్రెటర్నిటీ లంచ్‌' ఇస్తారు. బుధవారం జస్టిస్‌ ఎన్‌వి రమణ ఇచ్చిన ఈ విందుకు కూడా జస్టిస్ చలమేశ్వర్ గైర్హాజరు కావడం గమనార్హం.సీజేఐ దీపక్ మిశ్రాతోపాటు న్యాయమూర్తులంతా హాజరయ్యారు.

పూర్తిగా శాఖాహార విందుతో జస్టిస్ రమణకు అభినందనలు

పూర్తిగా శాఖాహార విందుతో జస్టిస్ రమణకు అభినందనలు

జస్టిస్‌ రమణ తన స్వగ్రామమైన పొన్నవరం నుంచి ప్రత్యేకంగా అరిసెలు, జున్ను తెప్పించారు. పెరుగు, దొండకాయ వేపుడు, టమాట పచ్చడి, వంకాయకూర, పులిహోర తదితరాలు ప్రత్యేక వంటకాలు కొన్ని అందులో ఉన్నాయి. పూర్తి శాకాహార వంటకాలు, హైదరాబాద్‌ ఖుర్బానీకా మీఠా ఆరగించి కొత్త సంవత్సరంలో చక్కటి భోజనం పెట్టినందుకు న్యాయమూర్తులు జస్టిస్‌ రమణను అభినందించారు. విందు ఆహ్లాదకర వాతావరణంలో జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జస్టిస్‌ ఎ.కె.సిక్రీ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

 పిల్స్ పైనా న్యాయమూర్తుల మధ్య అవగాహనకు చాన్స్

పిల్స్ పైనా న్యాయమూర్తుల మధ్య అవగాహనకు చాన్స్

సీబీఐ జడ్జి బి.హెచ్‌.లోయా అనుమానాస్పద మరణంపై దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా తప్పుకోవడం ఇందుకు సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. తాను అనవసరంగా వివాదానికి కేంద్ర బిందువు అవుతున్నానని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. మూడు రోజుల క్రితం ఇతర న్యాయమూర్తులతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశాల్లో కన్నీటి పర్యంతమయ్యారని తెలుస్తోంది. సున్నితమైన కేసులను జూనియర్‌ న్యాయమూర్తులకు కేటాయించే విషయంలో వచ్చిన భేదాభిప్రాయాలు సమసిపోయే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కేటాయించే విషయంలో కూడా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.

 జడ్జి లోయా కేసు విచారణకు ఇదీ నేపథ్యం

జడ్జి లోయా కేసు విచారణకు ఇదీ నేపథ్యం

జస్టిస్‌ అరుణ్ మిశ్రా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారంటూ దుష్యంత్‌ దవే అనే సీనియర్‌ న్యాయవాది బహిరంగంగా ఆరోపణలు చేశారు. దాంతో ఆయన ఈ కేసు నుంచి తనకు తానుగా తప్పుకుంటున్నట్లు జస్టిస్ అరుణ్ మిశ్రా సంకేతాలిచ్చారు. సొహ్రబుద్దీన్‌ షేక్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తున్న సమయంలో బీహెచ్‌ లోయా 2014 డిసెంబర్ 1న నాగ్‌పూర్‌లో గుండెపోటుతో మరణించారు. ఆ ఎన్‌కౌంటర్‌ కేసులో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ప్రధాన నిందితుడు. లోయా మరణం తర్వాత నియమితులైన న్యాయమూర్తి ఏడాది విచారించి అమిత్ షాపై కేసు విచారణే అవసరం లేదని తేల్చి మరీ కొట్టి పారేశారు. లోయా మరణంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ తెహసీన్‌ పూనావాలా అనే కాంగ్రెస్‌ నేత సుప్రీంకోర్టులో కేసు వేశారు. కేసును జస్టిస్‌ అమిత్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం శంతనగౌడర్‌లతో కూడిన బెంచ్‌కు అప్పగించడంతో వివాదం రేపింది. కీలక కేసులు జూనియర్‌ జడ్జీల బెంచ్‌కు అప్పగించడమేంటని జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ సహా నలుగురు సీనియర్లు ప్రశ్నించి మీడియాకెక్కారు.

దవే వ్యాఖ్యలు సాకుగా జస్టిస్ అరుణ్ మిశ్రా తప్పుకుంటే గౌరవ ప్రదం

దవే వ్యాఖ్యలు సాకుగా జస్టిస్ అరుణ్ మిశ్రా తప్పుకుంటే గౌరవ ప్రదం

ఈ లోగా కేసు వేసిన పూనావాలా - దుష్యంత్‌ దవేతో గొడవపడడం, ఆయన- జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చీఫ్‌ జస్టిస్‌ దీపక్ మిశ్రా కూడా అరుణ్‌ మిశ్రా నుంచి లోయా కేసును తప్పించడం మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. దుష్యంత్‌ దవే వ్యాఖ్యలను ఓ సాకుగా తీసుకుని -అరుణ్‌ మిశ్రాయే ఈ కేసునుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకుంటే అది కొంత గౌరవప్రదంగా ఉంటుందన్న అభిప్రాయానికి చీఫ్‌ జస్టిస్‌ దీపక్ మిశ్రా వచ్చినట్లు సమాచారం. నలుగురు రెబెల్‌ జడ్జీలు మౌలికమైన సంస్థాగతాంశాలు లేవనెత్తారని, వాటికి చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఎలా బదులిస్తారన్నదానిపైనే పరిష్కారం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. జస్టిస్‌ చలమేశ్వర్‌ బుధవారం అనారోగ్యం వల్లే కోర్టుకు రాలేదని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. రేపు వస్తారా? రారా? అన్నది ఇంకా స్పష్టత లేదు. నిజానికి ఆయన ఇవాళ కోర్టుకు రారని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కూడా తెలియపర్చలేదు. ఆయనతో పాటు ఉండాల్సిన జస్టిస్‌ గోయల్‌ కూడా సెలవు పెట్టారు.

రెండు రోజుల క్రితం జస్టిస్ చంద్రచూడ్, లలిత్ భేటీ

రెండు రోజుల క్రితం జస్టిస్ చంద్రచూడ్, లలిత్ భేటీ

జస్టిస్ చలమేశ్వర్‌ వద్దకు రాయబారాలు కొనసాగుతున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి చలమేశ్వర్‌- తనతో పాటు తిరుగుబాటులో పాల్గొన్న ముగ్గురు సీనియర్లు- కురియన్‌ జోసెఫ్‌, రంజన్‌ గొగోయ్‌, మదన్‌ బీ లోకూర్‌లతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఆ తరువాత కొంత సేపటికి డీవై చంద్రచూడ్‌, మరికాసేపటికి యూయూ లలిత్‌ వచ్చారు. వారితో అరగంటసేపు మంతనాలు సాగాయి. వీరిలో డీవై చంద్రచూడ్‌ - దీపక్‌ మిశ్రా వర్గంగా న్యాయవాదులు పేర్కొంటారు. చీఫ్‌ జస్టిస్‌ డీల్‌ చేసే అన్ని కేసుల బెంచ్‌ల్లో చంద్రచూడ్‌ ఉంటారు. ఇదిలా ఉంటే లక్నో మెడికల్‌ కాలేజీ స్కాం నిందితుడైన ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఏఎం ఖుద్దూసీ- ఢిల్లీలోని ఓ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసులో గతంలో తాను ఇద్దరు మధ్యవర్తులతో మాట్లాడిన ఆడియో టేపులు బహిర్గతం కావడం, ఎలక్ట్రానిక్‌ టీవీ చానెళ్లలో ప్రసారం కావడం తన హక్కులకు భంగకరమని, దీనికి సీబీఐదే బాధ్యత అని ఒక పిటిషన్‌ వేశారు. ఈ కేసు విచారణలో థర్డ్ పార్టీ జోక్యం ఉన్నట్లు కనిపిస్తున్నదని ఏఎం ఖుద్దూసీ ఆరోపించారు. మరోవైపు మీడియా తనకుగల భావ ప్రకటనా స్వేచ్ఛ సాకుగా స్వీయ విచారణ నడుపుతోందన్నారు. ప్రస్తుతం ఆయన ఈ కేసులో బెయిల్‌పై ఉన్నారు.

English summary
NEW DELHI: Chief Justice of India Dipak Misra will meet the four senior judges who took him on publicly, tomorrow as part of the efforts at ending a rift that could impact important cases. The meeting, which was initially slated for this morning, did not take place as Justice Jasti Chelameswar is unwell and could not attend court. Sources close to the rebel judges said Chief Justice Mishra is aware of the issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X