గురుగ్రామ్‌లో దారుణం : జై శ్రీరాం అనాలంటూ యువకుడిపై నలుగురి దాడి, కేసు నమోదు
గురుగ్రామ్ : ముస్లిం యువతపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్‌లో గో రక్షకులు రెచ్చిపోగా .. తాజాగా ఢిల్లీలోని గురుగ్రామ్‌లో నలుగురు యువకులు రెచ్చిపోయారు. ఓ ముస్లిం యువకుడిపై దాడికి దిగారు.
నమాజ్ చేసి వస్తుండగా ..
బీహర్ కు చెందిన మహ్మద్ బర్కర్ అలం (25) ఉపాధి కోసం గురుగ్రామ్ వచ్చాడు. ఇక్కడే జకోబ్ పురలో ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా ప్రార్థనలు చేసేందుకు నమాజ్ చేసి తిరిగి వస్తున్నాడు. సర్దార్ బజార్ వద్దకు వచ్చాడో లేదో నలుగురు యువకులు అడ్డుపడ్డారు. తన దారిని తాను వెళుతుంటే మాటల కలిపారు. అయితే మహ్మద్ .. ధరించిన క్యాప్‌పై పుర్రే గుర్తు ఉంది. ఇదే పాపమైపోయింది. ఇదేంటి అని అడిగి .. తన క్యాప్ అని చెబితే, ఇలాంటివి ఈ ఏరియాలో పెట్టుకోవద్దని తలపైనుంచి తీసేశారు. చెంపపై కొట్టారని బాధితుడు వాపోయాడు.

కర్రలతో దాడి ..
బకోబ్ పురలో ఇలాంటి టోపీలు పెట్టుకోవద్దని బెదిరించారు. సరే అని ముందుకు కదలగా .. భారత్ మాతా కీ జై అని కోరారు. సరే అని నినాదించాడు. దీంతో వారు ఊరుకోలేదు. జై శ్రీరాం అని గద్దించారు. అందకు మహ్మద్ తిరస్కరించడంతో కొట్టారని బాధితుడు తెలిపారు. కర్రలు తీసుకొని కాళ్లు, వెనుకభాగంలో చితకబాదాడని వెల్లడించాడు. వారి దెబ్బలకు తాళలేక అరిచానని .. తన వర్గానికి చెందినవారు సాయం చేయాలని కోరానని చెప్పాడు. దీంతో నలుగురు పారిపోయారని బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడు మహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని .. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటీజీ పరిశీలిస్తున్నామని గురుగ్రామ్ సిటీ ఏసీపీ రాజీవ్ కుమార్ మీడియాకు వివరించారు.