
మహిళ ప్రైవేట్ పార్ట్స్ లో 6కోట్ల విలువైన హెరాయిన్: షాకైన కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు
భారతదేశంలో డ్రగ్స్ ఓ మహమ్మారిగా పరిణమిస్తోంది. చాప కింద నీరులా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. అధికారుల కళ్లుగప్పి ఏదో ఒక రకంగా డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. ఇక ఇటీవల కాలంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వారు ఎయిర్ పోర్ట్ లలో పట్టుబడుతున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి.

మహిళ శరీరంలో డ్రగ్స్ .. ఎక్కడెక్కడ దాచిందో తెలిసి షాకైన కస్టమ్స్ అధికారులు
తాజాగా జైపూర్ ఎయిర్ పోర్ట్ లో ఓ మహిళను చెక్ చేసిన అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను ఆమె ఎక్కడ ఎక్కడ దాచిందో తెలుసుకొని నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే సూడాన్‌కు చెందిన మహిళ ఫిబ్రవరి 19న షార్జా నుంచి జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంది. జైపూర్ ఎయిర్ పోర్ట్ లో తొలిసారిగా ఒక మహిళ నుండి 6కోట్ల రూపాయల విలువైన 862 గ్రాముల హెరాయిన్‌తో కూడిన 88 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

మహిళ ప్రైవేట్ పార్ట్స్ లోనూ, కడుపులోనూ 88 హెరాయిన్ క్యాప్సూల్స్
జైపూర్ ఎయిర్ పోర్ట్ లో ఫిబ్రవరి 19వ తేదీన కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీలలో, సూడాన్ కు చెందిన ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకున్నారు. ఆమె నడక తీరు, ప్రవర్తనపై అనుమానం కలిగిన అధికారులు తనిఖీలు చేయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన ప్రైవేట్ పార్ట్స్ లోనూ, కడుపులోనూ 88 హెరాయిన్ క్యాప్సూల్స్ ను దాచుకున్నట్టుగా గుర్తించారు.

ఫిబ్రవరి 19 నుండి మార్చి 2 వరకు ఆపరేషన్లు చేసి క్యాప్సూల్స్ సేకరణ
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆమె శరీరంలోని క్యాప్సూల్స్‌ను స్కాన్ చేశారు. మేజిస్ట్రేట్ నుండి అనుమతి పొందిన తరువాత, ఆమెను ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు ఫిబ్రవరి 19 నుండి మార్చి 2 వరకు క్యాప్సూల్స్‌ను సేకరించినట్లు డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. ఆఫ్రికన్ మహిళ నుండి అన్ని క్యాప్సూల్స్ సేకరించేందుకు వైద్యులకు 12 రోజులు పట్టిందని, వివిధ ఆపరేషన్లు చేసి వాటిని బయటకు తీసినట్లుగా వెల్లడించారు.

ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశాక కోర్టు రిమాండ్
వాటిలో కొన్ని ఆమె మింగినట్లు మరియు మరికొన్ని ఆమె ప్రైవేట్ భాగాలలో దాచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. మహిళను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసిన అనంతరం కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
సదరు సూడాన్ మహిళ నుండి హెరాయిన్ స్మగ్లింగ్ గ్యాంగ్ కు సంబంధించిన వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు అధికారులు. ప్రాణాలకు తెగించి ఇలా మానవ శరీరంలో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న వ్యవహారంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.