బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయిన ట్రక్కు: ఆరుగురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన బేతుల్ జిల్లాలోని చోప్నా పట్టణ సమీపంలో తావా నదిపై మంగళవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ప్రమాదశాత్తు తావా నది వంతెనపై నుంచి కిందపడిపోయింది. దీంతో ట్రక్కు డ్రైవర్ సహా ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారిని రికేష్(25), బబ్లు భలావీ(24), దిలీప్(26), సంజు బత్కే(40), మున్నా సలాం(24), డ్రైవర్ మనోహర్(38)లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కూలీలంతా పిప్రి గ్రామానికి చెందివారని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.