విమానం గాల్లో ఉండగా కార్డియాక్ అరెస్ట్ .. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినా దక్కని ఎనిమిదేళ్ళ బాలిక ప్రాణం
గో ఎయిర్ విమానంలో ప్రయాణిస్తున్న ఒక బాలిక కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందింది. మంగళవారం ఉదయం నాగ్పూర్ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్ చేసి, బాలికను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంగళవారం నాడు బాలిక తల్లిదండ్రులతో కలిసి లక్నో నుంచి ముంబై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది.

విమాన ప్రయాణంలో అస్వస్థతకు గురైన బాలిక
ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని సహేరిఖాస్ గ్రామంలో నివసిస్తున్న ఆయుషి పున్వసి ప్రజాపతి అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యం కోసం లక్నో నుంచి ప్రైవేట్ విమానంలో ముంబై కి చికిత్స నిమిత్తం బయలుదేరింది . గోయర్ విమానాన్ని ఎక్కిన తల్లిదండ్రులు పాప అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని అధికారులకు చెప్పలేదు. గాల్లో విమానయానం చేస్తుండగా , బాలిక కార్డియాక్ అరెస్ట్ కు గురైంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా విమానాన్ని ఆపి, బాలికను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి, వైద్యం అందించినా బాలిక మృతి
పాపని ఆసుపత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేసినా, ఆసుపత్రికి తీసుకు వెళ్ళే సమయానికి బాలిక మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. బాలిక గుండెపోటుతో బాధ పడి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అధికారులు చెప్పినట్లు తెలుస్తుంది.
బాలిక రక్తహీనతతో ఉందని, తండ్రి ఈ విషయాన్ని వెల్లడించలేదని అధికారులు తెలిపారు. బాలిక అనారోగ్య పరిస్థితిని తండ్రి చెప్పి ఉంటే బాలిక ప్రాణాలు కోల్పోయి ఉండేది కాదని అంటున్నారు. విమాన ప్రయాణాలు చేసేవారికి 8 నుండి 10 గ్రాముల హిమోగ్లోబిన్ తప్పనిసరిగా ఉండాలి. అంత కంటే తక్కువ ఉన్న రోగులకు విమాన ప్రయాణాలకు అనుమతి లేదు.

రక్తహీనత , అనారోగ్యంతో బాధ పడుతున్న బాలిక
విమాన ప్రయాణం చేసిన బాలికకు 2.5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నందున వారు అసలు విమాన ప్రయాణానికి అనుమతించకూడదు. కానీ బాలిక తండ్రి ఈ విషయాన్ని వెల్లడించక పోవడంతో, అధికారులు విమాన ప్రయాణానికి అనుమతించారు.
చాలా తక్కువ హిమోగ్లోబిన్ కలిగి ఉన్న బాలికకు విమానం గాలిలో ప్రయాణిస్తున్న క్రమంలో ప్రయాణంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ కు గురైందని అధికారులు చెబుతున్నారు.

నాగపూర్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ .. బాలిక మృతిపై కేసు నమోదు దర్యాప్తు
విమానం నాగపూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశామని, ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఆమె మరణించినట్లు అధికారులు ధృవీకరించారు అని తెలిపారు.
విమాన ప్రయాణం వల్ల బాలిక మృతి చెందిందా, లేక అనారోగ్య కారణాల వల్ల బాలిక మృతి చెందిందా అన్నది ప్రస్తుతం నిర్ధారించాల్సి ఉంది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ణయించబడలేదు. ప్రమాదవశాత్తు బాలిక మృతి చెందిన కేసును సోనెగావ్ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.