
17 ఏళ్ల అమ్మాయిపై 81 ఏళ్ల వృద్ధుడు ‘డిజిటల్ రేప్’: నిందితుడి అరెస్ట్, ఈ నేరానికి శిక్ష ఏమిటంటే?
న్యూఢిల్లీ: 81 ఏళ్ల వృద్ధ స్కెచ్ ఆర్టిస్ట్.. ఓ 17 ఏళ్ల అమ్మాయిపై ఏడేళ్లుగా 'డిజిటల్ రేప్'కు పాల్పడ్డాడు. ఈ నేరం కింద పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో చోటు చేసుకుంది. తమకు తెలిసిన వ్యక్తి కావడంతో నిందితుడి వద్ద ఉండి చదువుకునేందుకు తమ కూతురును పంపించినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, అప్పట్నంచి నిందితుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఏడేళ్లుగా అమ్మాయిపై వృద్ధుడు డిజిటల్ రేప్
వివరాల్లోకి వెళితే.. నిందితుడు మారిస్ రైడర్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అలహాబాద్ కు చెందిన నిందితుడు నోయిడాలో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తున్నాడు. ఇంట్లో పనిచేసేందుకు మైనర్ బాలికను పెట్టుకున్నాడు. ఏడేళ్లుగా ఆమె ఇక్కడే పనిచేస్తోంది. మారిస్ రైడర్.. తనను పనిలో చేరినప్పటి నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను, ఆడియో, వీడియో రికార్డుల రూపంలో పోలీసులకు అందజేసింది.

నిందితుడిపై డిజిటల్ రేప్ అభియోగాలు, పోక్సో చట్టం కింద కేసు
దీంతో పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద కేసునమోదు చేసి అరెస్ట్ చేశారు. డిజిటల్ రేప్ అభియోగాలు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (అత్యాచారం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నిందితుడు మారిస్ రైడర్‌ను అరెస్టు చేశారు. అతను గత ఏడేళ్లుగా 17 ఏళ్ల బాలికపై డిజిటల్ రేప్‌కు పాల్పడ్డాడని ఫిర్యాదు అందిందని పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు.

అసలు డిజిటల్ రేప్ అంటే ఏంటి?: దారుణమే..
డిజిటల్, రేప్ రెండు వేర్వేరు పదాలు. డిజిట్ అంటే ఇంగ్లీషులో అంకె అనే అర్థం వస్తుంది. ఇంగ్లీష్ డిక్షనరీలో శరర భాగాలకు కూడా నెంబర్లు ఉంటాయి. అందుకే డిజిట్, రేప్ కలిపి డిజిటలర్ రేప్ అని పేరు పెట్టారు. డిజిటల్ రేప్ అంటే.. బాధితురాలి జననాంగంలోకి నిందితుడు బలవంతంగా చేతి వేళ్లు, కాలి వేళ్లు లేదా వస్తువులను చొప్పించడం. నిందితుడి వేధింపులు భరించలేక చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ డిజిటల్ రేప్ కేసు వెలుగులోకి వచ్చింది.

డిజిటల్ రేప్ కేసులో శిక్షలు ఎలా ఉంటాయంటే..?
కాగా, యూపీలో డిజిటల్ రేప్ కేసు నమోదు కావడం ఇది రెండసారి కావడం గమనార్హం.డిజిటల్ రేప్‌లతో సహా అనేక అత్యాచార కేసులు సాధారణంగా సన్నిహితులచే జరుగుతాయి, భయం, ఇబ్బంది కారణంగా నివేదించబడవు. అత్యాచార చట్టాల గురించిన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల అనేక కేసులు రిపోర్ట్ చేయబడవు. డిజిటల్ రేప్ కేసులో చట్టం ప్రకారం.. నిందితుడికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదుతో పాటు శిక్ష 10 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.