షాకింగ్: 90 శాతం మంది రాజ్యసభ ఎంపీలు కోటీశ్వరులు! 51 మందిపై క్రిమినల్ కేసులు!
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీలలో దాదాపు 90 శాతం మంది కోటీశ్వరులేనట. ఒక్కో రాజ్యసభ సభ్యుడి సగటు ఆస్తి ఎంతో తెలుసా? రూ.55 కోట్లు. ఇవేవో కాకిలెక్కలు కాదు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
మొత్తం 233 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల్లో 229 మంది స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ డేటాను రూపొందించింది. 229 మంది సిట్టింగ్ ఎంపీల్లో 201 మంది (88 శాతం) మంది కోటీశ్వరులేనని, ఒక్కో రాజ్యసభ సభ్యుని సరాసరి ఆస్తి రూ.55.62 కోట్లు అని ఆ నివేదిక తెలిపింది.

కోటీశ్వరులైన రాజ్యసభ సభ్యుల జాబితాలో.. మహేంద్ర ప్రసాద్ (జనతాదళ్-యునైటెడ్) అత్యధికంగా రూ.4078.41 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు.
సమాజ్వాదీ పార్టీ ఎంపీ, నటి జయాబచ్చన్ రూ.1001.64 కోట్లతో రెండో స్థానంలోనూ, బీజేపీకి చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా రూ.857.11 కోట్లతో మూడోస్థానంలోనూ ఉన్నారు.
పార్టీల వారీగా చూస్తే, 64 మంది బీజేపీ ఎంపీల్లో ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి విలువ రూ.27.80 కోట్లుగా ఉంది. 50 మంది కాంగ్రెస్ ఎంపీల విషయానికొస్తే...ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి రూ.40.98 కోట్లు. 14 మంది ఎంపీలున్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి విలువ రూ.92.68 కోట్లు.
అంతేకాదు, ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. 229 మంది రాజ్యసభ ఎంపీల్లో 51 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. సుమారు 20 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి.
మరోవైపు 154 మంది ఎంపీలు పలు రుణ వితరణ సంస్థలకు బాకీపడి ఉన్నారు. ఇక ఇలా రుణ వితరణ సంస్థలకు బాకీ పడి ఉన్న వారిలో చూసుకుంటే.. సంజయ్ దత్తాత్రేయ కఖడే అత్యధికంగా రూ.304.60 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.