నో డేటా గవర్నమెంట్... శ్రామిక్ రైళ్లలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారు...
కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో అందరి కంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వలస కూలీలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి డేటా అందుబాటులో లేదని ఇటీవల కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. వలస కార్మికుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో ఎంతమంది చనిపోయారని ప్రశ్నించారు.

పీయుష్ గోయల్ జవాబు...
ఓబ్రెయిన్ ప్రశ్నపై స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్... సెప్టెంబర్ 9 వరకూ మొత్తం 97 మంది వలస కార్మికులు శ్రామిక్ రైళ్లలో మృతి చెందినట్లు తెలిపారు. ఇందులో 87 మంది మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు పంపించగా... ఇప్పటికే 51 పోస్టుమార్టమ్ రిపోర్టులు వచ్చాయన్నారు. ఆ రిపోర్టుల ప్రకారం ఎక్కువమంది గుండెపోటు,గుండె సంబంధిత వ్యాధులు,మెదడు సంబంధిత వ్యాధులు,ఊపిరితిత్తుల వ్యాధులు,కాలేయ వ్యాధులు,అప్పటికే వేధిస్తున్న పలు ఆరోగ్య సమస్యలతో మృతి చెందినట్లు చెప్పారు.

నో డేటా గవర్నమెంట్...
ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని 'నో డేటా గవర్నమెంట్' అని ఎద్దేవా చేశారు. వలస కార్మికుల గురించి ప్రశ్నించినా నో డేటా అన్న సమాధానమే... ఉద్యోగాల గురించి ప్రశ్నించినా నో డేటా అన్న సమాధానమే అని విమర్శించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 1000 మంది వలస కార్మికులు చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నాయన్నారు. దాదాపు 2 కోట్ల మంది వేతన జీవులు ఉద్యోగాలు కోల్పోయారని... 14లక్షల మంది కార్మికులకు పని లేకుండా పోయిందని అన్నారు. ఇంతటి దుస్థితిలో ఇంకా అభివృద్దిని ఏం ఆశిస్తామని ప్రశ్నించారు.

లాక్ డౌన్‌లో విలవిల్లాడిన వలస కార్మికులు
ఈ ఏడాది మార్చి 25న కేంద్రం అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికులు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఉన్నపలంగా ఉపాధి కోల్పోయి నగరాల్లో చిక్కుకుపోవడంతో విలవిల్లాడిపోయారు. దేశవ్యాప్తంగా వేలాదిమంది వలస కార్మికులు నగరాల నుంచి కాలినడకనే స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో,అనారోగ్యం కారణంగా,ఆకలి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ డేటా ఏదీ తమ వద్ద లేదని కేంద్రం పార్లమెంటులో చెప్పడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.