వీడియో: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంప్రదాయ నృత్యం అదుర్స్: మెచ్చుకున్న ప్రధాని మోడీ
ఈటానగర్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన అరుణాచల్‌ప్రదేశ్ సంప్రదాయ నృత్యానికి ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. న్యాయశాఖ మంత్రి మంచి డ్యాన్సర్ అంటూ మెచ్చుకున్నారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు బుధవారం కిరణ్ రిజిజు అరుణాచల్‌ప్రదేశ్‌లోని కజలాంగ్ గ్రామానికి వెళ్లారు.
ఈ సందర్బంగా అక్కడి సాజొలాంగ్ ప్రజలు కేంద్రమంత్రికి జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో కిరణ్ రిజిజు కూడా లయబద్ధంగా నృత్యం చేశారు. సంప్రదాయ వాయిద్యాలు, గ్రామస్తుల చప్పట్లు, కేరింతల నడుమ ఉల్లాసంగా కాలుకదిపారు కేంద్రమంత్రి. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి అందమైన కజలాంగ్ గ్రామానికి వెళ్లానని.. ఎవరైనా అతిథులు తమ గ్రామాన్ని సందర్శించినప్పుడల్లా సాజోలాంగ్ ప్రజల ఆనందం ఇదని తెలిపారు. ఇక్కడి జానపద పాటలు, నృత్యాలు.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు కిరణ్ రిజిజు.
కాగా, ఈ వీడియో ట్వీట్ పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. న్యాయశాఖ మంత్రి మంచి డ్యాన్సర్. అరుణాచల్ ప్రదేశ్ అద్భుతమైన సంస్కృతిని చూడటం బాగుంది అని మోడీ వ్యాఖ్యానించారు. నెటిజన్లు కూడా కిరణ్ రిజిజు నృత్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఇటీవల కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఓ బాలీవుడ్ పాట పడి ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కేంద్రమంత్రి.. ఫిట్నెస్, ఆరోగ్యంగాపై ఎక్కువగా పోస్టులు పెడుతుంటారు.
Our Law Minister @KirenRijiju is also a decent dancer!
— Narendra Modi (@narendramodi) September 30, 2021
Good to see the vibrant and glorious culture of Arunachal Pradesh… https://t.co/NmW0i4XUdD
దేశంలోని ప్రతి పౌరుడికీ వైద్యసేవలు: ప్రధాని మోడీ
దేశంలో నలుమూలలకూ, ప్రతి పౌరుడికీ వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకోసమే సరికొత్త జాతీయ ఆరోగ్య విధానానికి నడుంబిగించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి గుణపాఠం నేర్పిందని.. దీని మూలంగా వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలకు పూనాది ఏర్పడిందన్నారు. కరోనాను అరికట్టేందుకు, ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు నిమగ్నమయ్యాని, ఈ తరుణంలో భారత్ బలాన్ని, స్వశక్తి పెంచుకునేందుకు ముందడుగువేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా అత్యాధునిక ప్రమాణాలతో మెరుగైన వైద్య విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. అందుకే వైద్య కళాశాలలను విస్తరిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. గురువారం రాజస్థాన్‌లో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. దీంతోపాటు జైపూర్ సీతాపురలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ (ఐపీటీ)ని కూడా ఆయన ప్రారంభించారు. మెడికల్ కాలేజీలను కొత్తగా రాజస్థాన్‌లోని బన్స్వారా, సిరోహి, హనుమాన్‌గఢ్, దౌసాలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలు, ఇనిస్టిట్యూట్ గురించి ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యా రంగం నుంచి వైద్య రంగానికి అనుసంధానంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. స్వచ్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మొదలైనవి సంస్కరణల్లో భాగమేనని ప్రధాని మోడీ వివరించారు.
ఇటీవల ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దేశంలోని ప్రతి మూలలో ఆరోగ్య సేవలను విస్తరించడంలో సహాయపడుతుందని మోడీ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్రం ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిందని.. అందరికీ వ్యాక్సినేషన్ అందించాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 88 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు వెల్లడించారు.