కరోనాతో కంటి చూపు కోల్పోయిన బాలిక .. మెదడుపై కరోనా తీవ్ర ప్రభావం
కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ప్రభావం మానవుల శరీరంలో ఏ భాగంపైన పడుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. కరోనా వైరస్ సోకి తగ్గిన తర్వాత కూడా వివిధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా కరోనా కంటి చూపుపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నట్లుగా, మెదడు పైన దారుణమైన ప్రభావాన్ని కనబరుస్తున్నట్లుగా వైద్యులు గుర్తించారు.
ఇంట్రెస్టింగ్ ... కొబ్బరినూనె, పుదీనాతో ఇంట్లో నుండే కరోనా టెస్ట్ .. ఎలాగంటే

కరోనా కారణంగా కంటి చూపు కోల్పోయిన బాలిక ... దేశంలోనే తొలికేసు
కరోనా మహమ్మారి ఊపిరితిత్తులతో పాటు మెదడు పైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది . కరోనా బారిన పడిన వారిలో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. మెదడులోని సున్నితమైన నాడీ కణాల పైన కరోనా వైరస్ దాడి చేయడం వల్ల ఓ 11 ఏళ్ల బాలిక కంటిచూపు కోల్పోయినట్లుగా ఢిల్లీ లోని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇది దేశంలోనే తొలి చిన్నపిల్లల విభాగంలో నమోదైన కేసు అయ్యి ఉండొచ్చని వైద్యులు అంటున్నారు. ఇక దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లుగా వైద్య నిపుణులు వెల్లడించారు.

మెదడు సంకేతాలను దెబ్బ తీస్తున్న కరోనా
అక్యూట్ డిమైలినేటింగ్ సిండ్రోమ్ లేదా ఎడిఎస్ అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఇది మెదడు నరాలను కాపాడే రక్షిత పొర అయిన మైలిన్ను దెబ్బతీస్తుంది, అలాగే మెదడు సంకేతాలను దెబ్బతీస్తుంది. సిండ్రోమ్ ప్రభావం వల్ల దృష్టి, కండరాల కదలిక, ఇంద్రియాలు, మూత్రాశయం మరియు ప్రేగు కదలిక వంటి నాడీ చర్యలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం కరోనా బారిన చాలా మంది ఈ సమస్యతో తీవ్రగా ఇబ్బంది పడుతున్నారు .

కరోనా వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తించిన వైద్యులు
కళ్ళు సరిగ్గా కనిపించడం లేదంటూ ఓ చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించిన నేపథ్యంలో ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు యక్యూట్ డిమైలినేటింగ్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. దీన్నిబట్టి కరోనా వైరస్ మెదడు పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని వైద్యులు నిర్ధారించారు. గతంలో పాపకు ఎలాంటి అనారోగ్యం లేదని కానీ కరోనా సోకడంతో కంటి సమస్య తలెత్తిందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని, ఇమ్యూనో థెరపీ ద్వారా చిన్నారికి చికిత్స చేశామని వైద్యులు చెబుతున్నారు. 50 శాతం చూపు తిరిగివచ్చాక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే మందగిస్తున్న కంటి చూపు
మరో 13 ఏళ్ళ బాలికకు తీవ్ర జ్వరం, మెదడులో వాపు సమస్య ఉందని ,ఆమెకు కూడా చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చాలామంది కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కంటి చూపు మందగించటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు . కరోనా మెదడుకు సంబంధించిన సున్నితమైన నరాలపై పని చెయ్యటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు వైద్యులు .