వైరల్ : తప్పిపోయిన తన బిడ్డ దొరకగానే ఈ చిరుత ఆనందం చూడండి
నాగ్‌పూర్: ఈ సృష్టిలో తల్లిని మించిన ప్రేమ మరొకటి ఉండదు. బిడ్డ కోసం ప్రాణాలు తెగిస్తుంది తల్లి. ఇది ఒక్క మనుషుల్లోనే కనిపించేది కాదు. జంతువుల్లో కూడా తల్లి ప్రేమ కనిపిస్తుంది. ఇక తన బిడ్డ ఎక్కడైనా తప్పిపోతే ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిపోతుందో ఆమెకు మాత్రమే తెలుస్తుంది. తన బిడ్డ దొరికే వరకు కంటిమీద కునుకు లేకుండా వెతుకుతుంది. ఎన్నిరోజులైనా సరే బిడ్డకోసం ఎదురు చూస్తుంది. ఇలానే ఓ చిరుత పులి కూడా తన బిడ్డకోసం వెతుకుతూ కెమెరా కంటికి చిక్కింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా...?
పంటపొలాల్లో దర్శనమిచ్చిన చిరుత కూన
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చిరుత తన బిడ్డను నోటితో కరుచుకుని ఎక్కడో సురక్షిత ప్రాంతానికి వెళుతున్నట్లు కనిపిస్తోంది కదూ....అవును మీరు అనుకుంటున్నది నిజమే. ఈ దృశ్యానికంటే ముందు కథ చాలా జరిగింది. ఇక విషయానికొస్తే... నాగ్‌పూర్‌కు సమీపంలోని ఓ గ్రామంలో చిరుతపులి పిల్ల ఒకటి తచ్చాడుతూ పంటపొలాల్లో గ్రామస్తులకు కనిపించింది. ఇది దాదాపు పిల్లి అంత ఉంది. దాని వయస్సు రెండు నెలలు ఉంటుంది. ఈ చిరుత పులి పిల్లను చూసిన గ్రామస్తులు దానికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు.
పంటపొలాల్లో తప్పిపోయిన చిరుతపులి పిల్ల
ఇక ఆహారం కోసం తచ్చాడుతూ పంటపొలాల్లోకి వచ్చింది ఓ చిరుతపులి. తనతో పాటు తన బిడ్డ కూడా వచ్చింది. అయితే పంటపొలాల్లో బిడ్డ ఇరుక్కుపోయింది. చిరుతపులి మాత్రం తన దారిన అది వెళ్లిపోయింది. సరిగ్గా ఇదే సమయానికి చిరుతపులి పిల్ల గ్రామస్తులకు ఎదురైంది. అయితే బిడ్డను వెతుక్కుంటూ తల్లి మళ్లీ వస్తుందని ఊహించారు గ్రామస్తులు. అయితే తల్లి చిరుత వస్తే గ్రామస్తులపై దాడి చేసే అవకాశం ఉండటంతో దాన్ని దూరంగా తీసుకెళ్లాల్సిందిగా అటవీశాఖ అధికారులను కోరారు.
సొంత వైద్యం తెచ్చిన చేటు: యూట్యూబ్ చూస్తూ డెలివరీ.... ఏమైందో తెలుసా..
బాక్సులో చిరుతకూనను భద్రపరిచిన అధికారులు
గ్రామస్తులు చిరుతపులి కూనను దూరంగా తీసుకెళ్లాల్సిందిగా అధికారులను కోరినప్పటికీ వారు ఒప్పుకోలేదు. బిడ్డ కోసం చిరుతపులి తప్పక వస్తుందని గ్రహించి అక్కడే ఓ చిన్న బాక్స్‌లో బిడ్డను పెట్టి ఆ బాక్స్‌ను పొలాల్లోనే వదిలేశారు. ఇక చిరుత కోసం ఎదురు చూశారు. వీరు ఊహించినట్లుగానే చిరుతపులి తన బిడ్డకోసం గాలిస్తూ అదే పొలాల్లోకి వచ్చింది. పొలాలంతా వాసన చూస్తూ కలియతిరిగింది.ఒక్కసారిగా బాక్స్‌లో ఉన్న తన బిడ్డ ఎదురయ్యేసరికి బాక్సు వైపు పరుగులు తీసింది. బాక్సును కిందకు తోసేయగా అందులోని బిడ్డ బయటకు వచ్చింది. అంతే బిడ్డను దగ్గరకు తీసుకుని ఏదో ముద్దు పెడుతున్నట్లుగా ఆప్యాయంగా తడిమింది. అనంతరం నోటితో బిడ్డను కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది చిరుత. దీన్నంతటినీ అటవీశాఖా అధికారులు వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది.