వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ మహమ్మారి తర్వాత భవిష్యత్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనావైరస్:కోవిడ్-19 కారణంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న మెజార్టీ ఉద్యోగులు

కోవిడ్-19 కారణంగా దాదాపు చాలా సంస్థలు తమ ఉద్యోగులతో ఇంటి నుంచే పని చేయించుకుంటున్నాయి. మరి భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందా? మున్ముందు అనేక పనుల విషయంలో మనుషులు వినియోగం తగ్గిపోతుందా..? వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులపై కంపెనీలు ఎటువంటి నిఘా పెట్టనున్నాయి? ఉద్యోగులు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కోనున్నారు?

దేశంలో గత మార్చి నెలలో మొదటి సారిగా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి పూర్వీ షా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. నిత్యం ప్రజలతో సంబంధాలు నెరిపే వృత్తిలో ఉన్న ఆమె ఇటు ఆఫీసు పనితో పాటు అటు ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో వృత్తి జీవితానికి-వ్యక్తిగత జీవితానికి మధ్య బ్యాలెన్స్ సాధించేందుకు ఆమె చాలా ప్రయత్నించాల్సి వస్తోంది.

“నిజానికి వర్క్ ఫ్రమ్ హోం చెయ్యడం చాలా కష్టం. కానీ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నానని నాకు అనిపిస్తోంది” అని ఆమె చెప్పుకొచ్చారు.

షా తన ఇంట్లోనే ఒక గదిలో చిన్న ఆఫీస్ రూం వాతావరణాన్ని సృష్టించుకున్నారు. అందులో తన కోసమే ఓ ప్రత్యేకమైన డెస్క్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు.

పరిస్థితులు కాస్త కుదుటపడిన తర్వాత నెమ్మదిగా కో వర్కింగ్ స్పేస్‌ నుంచి పని చేయడం మొదలుపెడతాను అని షా చెప్పారు. “దూరాన్ని దృష్టిలో పెట్టుకొని నేను తిరిగి ఆఫీసుకు వెళ్లానుకోవడం లేదు. అలాగని వర్క్ ఫ్రమ్ హోం కూడా చెయ్యాలనుకోవడం లేదు. నేను మరింత సౌకర్యంగా పని చేసేందుకు నేను పని చేస్తున్న చోటును మార్చాలి” అని షా అన్నారు.

వర్కింగ్ ఫ్రమ్ హోం

“పెద్ద పెద్ద కార్యాలయాలు చిన్న చిన్న యూనిట్స్‌గా మారిపోతున్నాయి. మనుషులు ప్యూన్ల అవసరం లేకుండానే పని చేయడం ఎలాగో నేర్చుకుంటున్నారు. మనిషి అహం విషయానికి వచ్చేసరికి ఇది చాలా పెద్ద మార్పు” అని బ్రాండ్ కన్సల్టెంట్ హరీష్ బిజూర్ అన్నారు.

లాక్ డౌన్ ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసింది. “ప్రస్తుతం జనం రెండు మొబైల్ ఫోన్లను తీసుకెళ్లాల్సి వస్తోంది. ఒకటి వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైతే మరొకటి వృత్తి జీవితానికి సంబంధించినది. అలాగే ఆఫీసు కోసం ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకునేందుకు మరింత పెద్ద ఇళ్లు అవసరమవుతున్నాయి. ప్రింటర్లకు, ఆఫీస్ వస్తువులకు డిమాండ్ ఎక్కువయ్యింది. ఇది కొత్తగా వచ్చిన మార్పే అయినా సాధారణమైపోయింది” అని బిజూర్ చెప్పుకొచ్చారు.

దేశంలో చాలా వరకు ఇళ్లన్నీ చిన్న చిన్నవే. ఆ ఇళ్లలో ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా స్థలం ఉండదు. అని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ గోద్రెజ్ ఇంటీరియోకి చెందిన సమీర్ జోషి బీబీసీతో అన్నారు.

“మా వెబ్ సైట్లో కుర్చీల కోసం వెతికే వాళ్ల సంఖ్య ఒక్కసారిగా 140 శాతం పెరిగింది. అంతగా డిమాండ్ ఉన్న రెండో వస్తువు వర్క్ టేబుల్” అని ఆయన చెప్పారు.

దీంతో చిన్న ఇళ్లలో సులభంగా సర్దుకునేలా ఉండే మడత కుర్చీలు, మడతపెట్టి మూల పెట్టుకునే టేబుళ్లు వంటి ఫర్నిచర్‌ను గోద్రెజ్ ఎక్కువగా ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.

వర్క్ ఫ్రమ్ హోం విషయానికి వచ్చే సరికి కేవలం ఉద్యోగులే కాదు యాజమాన్యాలు కూడా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

“ఇతరుల జోక్యం గురించి ఆందోళన చెందకుండా సెన్సిటివ్ వర్క్‌ని ఉద్యోగులు చేయగలరని నిర్ధారించడం అతి పెద్ద సవాలు. అలాగే మీరు వేరొకరి డేటాను హ్యాండిల్ చేస్తున్నప్పుడు దాన్ని భద్రంగా ఉంచాల్సి వస్తుంది” అని స్క్వేర్ టెక్ సెక్యూరిటీ సర్వీస్ కంపెనీ సహ వ్యవస్థాపకులు పంక్తీ దేశాయ్ అన్నారు.

ఫేస్ బుక్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు మొత్తం తమ ఉద్యోగుల్లో 30 నుంచి 50 శాతానికి మించి కార్యాలయాల్లో పని చేయకుండా ఉండేందుకు తగిన ప్రణాళికల్ని రచించడం ప్రారంభించాయి. ఒక సారి కంపెనీలన్నీ తగిన ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నట్టయితే వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో వివిధ కంపెనీలు తమ కొత్త విధానాలను అమలు చేయడం మొదలు పెడతాయి.

“అయితే ఇకపై వచ్చే పెద్ద మార్పు ఏమిటంటే... అన్ని విభాగాల్లో పని చేసే ఉద్యోగుల్ని వారంలో ఒకట్రెండు రోజులు ఆఫీసుకు రమ్మని కోరే అవకాశం ఉంది. వారికి అందుకు అనుగుణంగా పరిహారం ఉంటుంది” అని యూనికార్న్ ఇండియా వెంచర్స్ మేనేజింగ్ పాట్నర్ భాస్కర్ ముజుందార్ అభిప్రాయపడ్డారు.

కరోనావైరస్:కోవిడ్-19 మహమ్మారి తర్వాత కార్యాలయాల్లోనూ సమూల మార్పులు

కార్యాలయాల్లో వచ్చే ప్రాథమిక మార్పులు

ఇకపై వర్క్ ఫ్రమ్ హోం అన్నది సర్వ సాధారణం కానుంది. కార్యాలయాలకు వచ్చే సిబ్బంది రక్షణను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు పని చేసే ప్రాంతంలో కంపెనీలు తగిన ప్రాథమిక మార్పులు చేస్తాయి. ఇప్పటికిప్పుడు వచ్చే మార్పులు చెప్పాలంటే ఏ ఇద్దరు ఉద్యోగులు పక్క పక్కనే ఉండే వీలుండదు. కనీస దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు తప్పవు.

ఇక ప్రస్తుతం ఉన్న కొలబరేటివ్ జోన్స్ అంటే అందర్నీ ఒక్క చోటుకు చేర్చాలన్న అన్న ఆలోచనకు ఇది పూర్తిగా భిన్నమైనది. అలాగని కలిసి ఉండటం దూరం కాదు. ఇకపై భౌతికంగా జట్టుగా కలిసి కూర్చునే స్థానాన్ని డిజిటల్ కొలబరేషన్ టూల్స్ భర్తీ చేయనున్నాయి.

ఆఫీసుల్లో వీడియో కాన్ఫరెన్సులకు, వీడియో కొలబరేషన్లకు మరింత ఎక్కువ చోటు కల్పిస్తారు. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలంటే మరింత ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. అలాగే ఇకపై సులభంగా శుభ్రం చేయగల, క్రిమిరహితం చేయగల అద్దాల వినియోగం ఎక్కువవుతుంది. అలాగే బ్యాక్టీరియా రహిత పూత (యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్) ఉన్న వస్తువుల వినియోగం ఎక్కువుతుంది.

వ్యవసాయం

దేశంలో 50 శాతం మందికి వ్యవసాయమే ఉపాధి. అలాగే జీడీపీలో 17శాతం వాటా వ్యవసాయానిదే. ఇప్పటికే రైతులు భూసారాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా ఎరువులను వినియోగించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు.

“సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కనీసం 3 ఏళ్లు పడుతుంది. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా అది 6-8 నెలల్లోనే రైతులు అలవాటు పడుతున్నారు” అని ఉన్నతి అగ్రిటెక్ కంపెనీ సహ వ్యవస్థాపకులు అమిత్ సిన్హా అన్నారు.

అత్యవసరం కానీ సాంకేతిక వస్తువుల్ని కొనేందుకు భారతీయ రైతులు అంతగా ఇష్టబడరు. నిజానికి వాటిని ఎలా ఉపయోగించాలో కూడా వారికి తెలియదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే అగ్రిటెక్ కంపెనీలు తగిన పాత్ర పోషించాలి. మధ్యవర్తుల్ని, రైతుల్ని ఒకే వేదికపైకి తీసుకురావాలి. ఉదాహరణకు ఓ రైతు వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకోగలరు. అలాగే వీడియో కాల్‌ ద్వారా నిపుణులతో మాట్లాడగలరు. అలాగే రైతులు అద్దెకు తెచ్చుకున్న ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా గ్యాడ్జెట్స్‌ను ఉపయోగించడం ద్వారా వర్షం ఎప్పుడు పడుతుందో ముందే తెలుసుకోగలరు. అలాగే ఎరువుల నాణ్యత ఎలా ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

కొంత మంది రైతులు కలిసి ఓ ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకొని వాళ్ల అవసరాలకు అనుగుణంగా పంచుకోగలరు. అలాగే నిపుణులు, మధ్యవర్తులు కూడా రైతులు ఎటువంటి పంటలపై దృష్టి పెట్టాలి అలాగే తమ పంటల్ని నేరుగా డీలర్లకే ఎలా అమ్మాలి ఇటువంటి విషయాల్లో వారికి సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు.

భవిష్యత్తులో వ్యవసాయంలోనూ సాంకేతిక పరిజ్ఞానం వాడకం ఎక్కువవుతుందని నిపుణులు భావిస్తున్నారు. మనుషులతో పని చేయడం కన్నా యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడమే సురక్షితమని రైతులు, మధ్య వర్తులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని వారు చెబుతున్నారు.

నిజానికి ఈ మహమ్మారి తలెత్తక ముందు రైతులు, మధ్యవర్తులు తమ వెసులుబాటును బట్టీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేవారు. కానీ ప్రస్తుతం అదే అత్యంత సురక్షితమని వారు భావిస్తున్నారు. ఇంటర్నెట్ డేటా ప్లాన్లు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ధరల్లో ఉండటంతో అవే టెక్నాలజీ వినియోగంలో ఇప్పుడు ప్రధాన ఉత్ప్రేరకాలుగా మారాయి.

ఉద్యోగాల్లో మార్పులు

కొత్త కొత్త బిజినెస్ మోడల్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు నిధుల్ని గుమ్మరిస్తున్నాయి. మెక్‌కిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ 2017లో వేసిన అంచనాల ప్రకారం 2030 నాటికి పెరగనున్న ఆటోమేషన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 14శాతం మంది ఉద్యోగులు తమ వృత్తిని మార్చుకోవడం లేదా కొత్త నైపుణ్యాలను పెంచుకుంటారని తేలింది. కానీ ఈ మహమ్మారి కారణంగా అదే ఇప్పుడు అత్యవసర ప్రశ్నగా మారింది.

ఇకపై ఫ్రీలాన్స్ వర్క్ కొత్త మార్గం కానుందని నిపుణులు భావిస్తున్నారు. గిగ్ ఎకానమీ(శాశ్వత కొలువులు కాకుండా స్వల్పకాలిక కాంట్రాక్ట్ కొలువులకు గిరాకీ పెరగడం) మరింత బలపడుతుంది. అలాగే చాలా వ్యవస్థలు అందులో కుదురుకునేందుకు వేగంగా ప్రయత్నిస్తాయి. 'ఛెఫ్ ఆన్ కాల్’ వంటి కొత్త ఆలోచనలు వాస్తవ రూపం దాల్చుతాయి. ప్రజలు తమ భద్రతను దృష్టిలో పెట్టుకొని రెస్టారెంట్లకు వెళ్లడాన్ని క్రమంగా తగ్గించుకుంటారు. అందుకు బదులుగా తమ ఇంట్లోనే పరిశుభ్రమైన వాతావరణంలో రెస్టారెంట్ రుచుల్ని ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తారు.

వినియోగదారులతో నేరుగా వ్యవహారాలు నడిపే ఉద్యోగాలు అంటే బార్బర్లు, హౌస్ కీపింగ్, ఈవెంట్స్, ఫిజియో థెరపిస్టులు, అథ్లెటిక్ ట్రైనర్లు, మ్యానిక్యూరిస్టులు, క్యాషియర్లు, కొరియో గ్రాఫర్లు, సహా చాలా వృత్తులు కరోనా మహమ్మారి కారణంగా సురక్షితం కావనే భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారు తాము చేస్తున్న వృత్తి, ఉద్యోగాల విషయంలో పునరాలోచిస్తున్నారు కూడా. చాలా ఉద్యోగాలు డిజిటల్ ఫార్మెట్లోకి మారిపోవడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణకు యోగా, డ్యాన్స్, సంగీతాన్ని బోధించే ఉపాధ్యాయులు వివిధ రకాల డిజిటల్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాఠాలు చెబుతున్నారు.

క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ విభాగాలకు డేటా ఇంజనీర్లు, డేటా ఎనలిస్టులు, డేటా సైంటిస్టుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుందని కొందరు మానవ వనరుల విభాగ నిపుణులు చెబుతున్నారు.

రోబోటిక్స్ & ఆటోమేషన్

2011 నుంచి రోబోట్స్ విషయంలో కృషి చేస్తూ వస్తోంది భారత్. వాటి ఆవిష్కరణలకు ఈ కరోనా మహమ్మారి మరింత ప్రోత్సాహం ఇచ్చింది. రోజవారీ పనులు అంటే కిటికీలు, తలుపులు శుభ్రపరచడం, లాన్‌లో గడ్డిని కోయడం, వంటి అనేక పనులకు రోబోలను వినియోగించేందుకు పెద్ద పెద్ద ఆస్పత్రులు, హోటళ్లు, మాల్స్ ప్రయత్నిస్తున్నాయి.

“అటువంటి రోబోలకు ఇప్పుడు 1000-2000 శాతం డిమాండ్ పెరిగింది. ముఖ్యమైన పనులకు సంబంధించిన ఉద్యోగాలు మనుషులు, చిన్న చిన్న పనులు అంటే తలుపులు, గదులు శుభ్రం చేయడం వంటి పనుల్ని రోబోలు చేయనున్నాయి” అని మిలాగ్రో రోబోట్స్ వ్యవస్థాపకుడు రాజీవ్ కర్వాల్ అభిప్రాయపడ్డారు.

ఆయన ఇటీవల తయారు చేసిన మిలాగ్రో ఐ మ్యాప్9 హ్యూమనాయిడ్ రోబో ప్రస్తుతం దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఫ్లోర్‌ను డిస్‌ఇన్ఫెక్ట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఫోర్టిస్, అపోలో, మ్యాక్స్ ఆస్పత్రులకు కూడా ఆయన ఈ తరహా రోబోలను సరఫరా చేశారు.

చాలా కంపెనీలు తమ తయారీ విభాగాన్నంతటినీ ఆటోమేటిక్ విధానానికి మార్చేస్తున్నాయి. అదే సమయంలో తమ మ్యాన్ఫాక్ట్చరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగుల్ని కీలక పనులకు కేటాయించి చిన్న చిన్న పనుల్ని యంత్రాలకు విడిచి పెడుతున్నాయి.

చివరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా ఇప్పుడు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తూ తమ వెంచర్లను వినియోగదారులకు చూపిస్తున్నారు.

కరోనావైరస్:వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఉద్యోగులపై పెరుగుతున్న యాజమాన్యాల నిఘా

నిఘా

వర్క్ ఫ్రమ్ హోం చెయ్యడం వల్ల ఉత్పాదకతక పెద్దగా ఉండదని నమ్మే దేశాల్లో భారత్ ఒకటి. తమ ఉద్యోగులంతా సుదీర్ఘ సమయం ఆఫీసులో గడిపితేనే సమర్థంగా పని చేయగలరని చాలా మంది మేనేజర్లు నమ్ముతారు. కోవిడ్-19 తరువాత పరిణామాలు అటు మేనేజర్లుకు ఇటు టీం సభ్యులకు మధ్య ఉన్న నమ్మకానికి కూడా పరీక్ష పెడుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులు ఆ తరువాత కూడా ఇంటి దగ్గర నుంచి పని చేసేందుకే మొగ్గు చూపుతారని 74శాతం మంది చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్లు భావిస్తున్నట్లు గార్ట్నర్ నివేదిక వెల్లడించింది.

ఇటువంటి ఉద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని వివిధ సంస్థలు మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ వంటి కొత్త సాఫ్ట్ వేర్‌లపై పెట్టుబడులు పెడుతున్నాయి.

“ఓ రకంగా ఇది ప్రీ బిల్డ్ ట్రాకింగ్ మెకానిజం. ఇది ఉద్యోగి పని చేసే ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ డేటాను రీడ్ చేయడమే కాదు, వాటి స్క్రీన్స్‌ను కూడా యాక్సిక్ చేయగలదు. అలాగే సున్నితమైన సమాచారాన్ని ఎక్కడో ఉంటూ కూడా తుడిచి పెట్టేయగలదు” అని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇన్ఫీసెక్ సీఈఓ వినోద్ సెంథిల్ టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికతో అన్నారు.

అంతేకాదు ఉద్యోగి కంప్యూటర్ కీ బోర్డ్ యాక్టివిటీ నుంచి యాప్ వినియోగం వరకు ప్రతి విషయాన్ని మేనేజర్లు పర్యవేక్షించేందుకు వీలు కల్పించడం సాఫ్ట్ వేర్ ప్రత్యేకత. ప్రతి పది నిమిషాలకు ఓ నివేదికను సిద్ధం చేస్తుంది. అలాగే ఉద్యోగి కదలికల్ని తెలిపేందుకు వెబ్ క్యామ్ ద్వారా ఫోటోలను కూడా తీసి పంపిస్తుంది. వర్క్ ఎనలటిక్స్, డెస్ట్రాక్, ఐమానిట్, టెరామైండ్ వంటి ఇదే తరహా సాఫ్ట్ వేర్‌లకు కూడా ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

“నేను ఎన్ని సార్లు బాత్రూంకి వెళ్తానో కూడా మా మేనేజర్‌కి తెలుసు. ఈ వ్యవస్థ నాకు ఏ మాత్రం సౌకర్యంగా లేదు. చాలా అతి చేస్తున్నట్టుంది” అంటూ పేరు చెప్పేందుకు ఇష్టబడని ఓ ఐటీ ఉద్యోగి బీబీసీతో అన్నారు.

కొన్ని కంపెనీలు పని చేస్తున్న సమయంలో వారి వెబ్ కెమెరాలను ఆన్ చేసి ఉంచమంటున్నాయి కూడా. ఇది ఓ రకంగా వ్యక్తిగత గోప్యతను హరించడమే.

అయితే వివిధ పరిశ్రమల్లో పని చేసే కార్మికులు మాత్రం ఇది ఇకపై సర్వ సాధారణమన్న వాస్తవాన్ని గ్రహించి ముందుకెళ్తున్నారు.

రేఖా చిత్రాలు: నికిత దేశ్ పాండే, బీబీసీ ప్రతినిధి

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Jobs after Covid-19 Pandemaic
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X