వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నకు ప్రాణం పోసిన ఏడాది పాప... అతడి కోసమే పుట్టింది - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాప

అన్న కోసమే పుట్టిన ఒక పాప తన మూలకణం దానం చేసి అతడి ప్రాణాలు కాపాడిందని ఈనాడు దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

లోకంలో ప్రతి ఒక్కరి పుట్టుక వెనుక ఏదో ఒక కారణం ఉంటుందంటారు! అందరి సంగతి ఎలా ఉన్నా ఆ పాప మాత్రం కచ్చితంగా కారణజన్మురాలే.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అన్న ప్రాణాలను నిలబెట్టడం కోసం జన్మించిన ఆపద్బాంధవి ఆ చిన్నారి అని పత్రిక రాసింది.

ఏడాది వయసు కూడా నిండకముందే సోదరుడి పాలిట సంజీవనిగా మారి, అతడికి పునర్జన్మను ప్రసాదించిన ఆ పాప పేరు కావ్య.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సహదేవ్‌ సింగ్‌ సోలంకి, అల్పా సోలంకి దంపతుల రెండో సంతానం అభిజిత్‌ (6). అతడు ప్రాణాంతక థలసీమియా వ్యాధి బారిన పడ్డాడు.

ఈ వ్యాధి బాధితులకు తరచుగా రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. వారు దీర్ఘ కాలం బతికే అవకాశాలు కూడా తక్కువే. కుమారుడి అవస్థను చూసి సహదేవ్‌ దంపతులు నిరంతరం బాధపడుతుండేవారు.

ఎముక మజ్జ మార్పిడితో అభిజిత్‌ ప్రాణాలను కాపాడుకోవచ్చునని ఓ రోజు వైద్యులు చెప్పడంతో వారికి ప్రాణం లేచొచ్చినట్లయింది. వెంటనే దాత కోసం అన్వేషించారు.

అయితే వారికి నిరాశే ఎదురైంది. బాలుడికి అవసరమైన 'హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటీజెన్‌ (హెచ్‌ఎల్‌ఏ)’ సరిపోలే దాత ఎక్కడా దొరకలేదు.

దాత దొరకకపోవడంతో మళ్లీ నిరాశలో కూరుకుపోయిన సహదేవ్‌ దంపతులకు వైద్య నిపుణులు ఓ అరుదైన సూచన చేశారు. అదే.. అభిజిత్‌ హెచ్‌ఎల్‌ఏ సరిపోలేలా 'ఇన్‌-విట్రో ఫర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌)’ విధానంలో మరో బిడ్డకు జన్మనివ్వడం.

అందుకు దంపతులు అంగీకరించారు. పుట్టబోయే బిడ్డ హెచ్‌ఎల్‌ఏ అభిజిత్‌కు సరిపోలేలా నిపుణులు ముందే జాగ్రత్తలు తీసుకున్నారని పత్రిక రాసింది.

ఐవీఎఫ్‌ విధానంలో ఏడాది క్రితం పండంటి పాప (కావ్య)కు దంపతులు జన్మనిచ్చారు. ఆపై, ఎముక మజ్జ మార్పిడికి అవసరమైన స్థాయిలో కావ్య బరువు పెరిగే వరకు వైద్యులు వేచి చూశారు.

పాప బరువు ఆశించిన స్థాయికి చేరడంతో ఈ ఏడాది మార్చిలో తన నుంచి అభిజిత్‌కు మూలకణ మార్పిడిని పూర్తిచేశారు.

బాబు పూర్తిగా కోలుకున్నాడని.. ఇకపై అతడికి రక్త మార్పిడి చేయాల్సిన అవసరం లేదని తాజాగా వైద్యులు ప్రకటించారని పత్రిక రాసింది.

అభిజిత్‌, కావ్య.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మన దేశంలో మూలకణాల మార్పిడి కోసం ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన తొలి కేసు ఇదేనని ఈనాడు వివరించింది.

గ్యాంగ్ రేప్

కేక్ తినిపించి, సామూహిక అత్యాచారం

హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఒక యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం ఆలస్యంగా బయటపడినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

పుట్టిన రోజు వేడుకల పేరుతో ఓ యువతిని హోటల్‌కు పిలిపించిన ముగ్గురు దుండగులు.. కేకులో మత్తుమందు కలిపి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటన కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలోని ఆనంద్‌-ఇన్‌ హోటల్‌లో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారని పత్రిక చెప్పింది.

సనత్‌నగర్‌లోని వినాయకనగర్‌కు చెందిన ఎం.జోసెఫ్‌, బి.నవీన్‌రెడ్డి, ఆర్‌.రాము స్నేహితులు. వీరికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి(19)తో ఏడాదిగా పరిచయం ఉంది.

డిగ్రీ చదువుతున్న ఆ యువతిని.. ఈ నెల 5న జోసెఫ్‌ పుట్టిన రోజు పార్టీకి రావాలంటూ ఆ ముగ్గురూ ఆహ్వానించారు.

నలుగురు కలిసి సికింద్రాబాద్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో తిరిగి.. కేక్‌ కటింగ్‌ కోసం భాగ్యనగర్‌ కాలనీలోని ఆనంద్‌-ఇన్‌ హోటల్‌లో 218వ నెంబరు గదిని బుక్‌ చేసుకున్నారు.

పక్కా ప్రణాళికతా వారంతా కేకులో మత్తుమందు కలిపారు. కేక్‌ కట్‌చేశాక.. ''లేడీస్‌ ఫస్ట్‌’’ అంటూ ఆ యువతితో కేకు తినిపించారు.

ఆమె అపస్మారక స్థితికి వెళ్లగానే.. ఆ ముగ్గురూ ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు.

కొద్ది గంటల తర్వాత ఆ యువతి స్పృహలోకి రావడంతో.. ఆటోలో ఇంటికి పంపించారు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

దాంతో భయపడిన ఆ యువతి.. జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. ఈ నెల 11న ఆమె అనారోగ్యంపాలవ్వడంతో.. తల్లిదండ్రులు సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

ఆమెను పరిశీలించిన వైద్యులు.. సామూహిక అత్యాచారం జరిగినట్లు గుర్తించారు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ నెల 15న జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. కేసును కూకట్‌పల్లి స్టేషన్‌కు బదిలీ చేశారు.

కూకట్‌పల్లి పోలీసులు.. జోసెఫ్‌, నవీన్‌రెడ్డి, రామును అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచామని పోలీసులు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

కత్తి కార్తీక

యాంకర్ కత్తి కార్తీకపై చీటింగ్ కేసు

డెవలప్‌మెంట్‌ కోసం తక్కువ ధరకే స్థలం ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో యాంకర్ కత్తి కార్తీకపై కేసు నమోదైనట్లు నమస్తే తెలంగాణ వార్తా కథనం ప్రచురించింది.

డెవలప్‌మెంట్‌ కోసం తక్కువ ధరకే స్థలం ఇప్పిస్తామని మాయమాటలతో నమ్మించి, అడ్వాన్సు కింద కోటి రూపాయలు వసూలుచేసిన యాంకర్‌ కత్తి కార్తీక సహా ఏడుగురిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లో ఉంటున్న పచ్చిపాల దొరస్వామి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని టచ్‌స్టోన్‌ ప్రాపర్టీ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు.

నగర శివారులో స్థలం తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నట్టు పరిచయస్తుడైన ఆర్కిటెక్ట్‌ శ్రీధర్‌ గోపిశెట్టితో చెప్పారు.

శ్రీధర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో దొరస్వామికి కత్తి కార్తీకను పరిచయం చేశారు. కార్తీక గ్రూపు పేరుతో వ్యాపార సంస్థను నడుపుతున్నానని, భూక్రయవిక్రయాలకు సంధానకర్తగా వ్యవహరిస్తుంటానని కార్తీక వారికి చెప్పారు.

మెదక్‌ జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో ఉన్న 52 ఎకరాల స్థలం ఉన్నదని, ఇందులో తామూ కొంతభాగాన్ని కలిగి ఉన్నామని కార్తీకతోపాటు మిగతా వారు దొరస్వామిని నమ్మించారు.

ఈ స్థలాన్ని డెవలప్‌మెంట్‌ కోసం రూ. 35 కోట్లకే ఇప్పిస్తామని, ఇందుకు రూ.కోటి సెక్యూరిటీ డిపాజిట్‌గా తమకు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

స్థల ఒప్పందం కుదరకపోతే వారంలో డిపాజిట్‌ను తిరిగి ఇచ్చేస్తామని మాయమాటలు చెప్పారు. నిజమేనని నమ్మిన దొరస్వామి.. కార్తీక గ్రూప్‌ సంస్థతోపాటు ఆమె సూచించిన బ్యాంకు ఖాతాలకు రూ.కోటి పంపించారని పోలీసులు చెప్పినట్లు కథనంలో రాశారు..

స్థలంపై దొరస్వామి ఆరాతీయగా.. ఈ స్థలం సీస్ల రమేశ్‌, ఆయన సంస్థకు చెందిన వారిదేనని తేలింది.

ఈ స్థలంపై కత్తి కార్తీక, ఆమె వెంట వచ్చినవారికి ఎలాంటి హక్కులు లేవని నిర్ధారణ జరిగింది. దీంతో కత్తి కార్తీక తదితరులపై చర్యలు తీసుకోవాలని రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు దొరస్వామి ఫిర్యాదు చేశారని పత్రిక కథనంలో వివరించింది.

వృద్ధులు

భారత్‌లో సగటు ఆయుర్దాయం 70 ఏళ్లు

భారతీయుల సగటు ఆయుర్దాయం పెరిగిందని ఒక అధ్యయనం చెబుతోందని సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.

భారతీయుల ఆయుర్దాయం పదేళ్లకు పైగా పెరిగిందని లాన్సెట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

1990 నుంచి 2019 మధ్య భారతీ యుల ఆయుఃప్రమాణాలు పెరిగినప్పటికీ రాష్ట్రా నికీ, రాష్ట్రానికీ మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నా యని పేర్కొంది.

1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్టుగా లాన్సెట్‌ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మనుషుల ప్రాణాలు తీసే 286 వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయో, మరో 369 వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అధ్యయనంలో అంచనా వేశారు.

దాని ప్రకారం సగటు ఆయుః ప్రమాణాలను అధ్యయనకారులు లెక్కించారని పత్రికలో రాశారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, గాంధీనగర్‌కి చెందిన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ గోలి భారతీయుల్లో ఆయుర్దాయం పెరిగినంత మాత్రాన వారి ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని చెప్పలేమన్నారు.

చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల తో బాధపడుతూనే బతుకులీడుస్తున్నారని ఆయన చెప్పారని సాక్షి చెప్పింది.

ఈ అధ్యయనంలోని ముఖ్యాంశాలు...

1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న సగటు ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకి పెరిగింది.

కేరళలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 77.3 సంవత్సరాలు కాగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 66.9 ఏళ్లుగా ఉంది.

భారత్‌లోని వ్యాధుల్లో 58% ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులే (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) ప్రబలుతున్నాయి

గత 30 ఏళ్లలో గుండె, ఊపిరితిత్తులుæ, మధుమేహం, కండరాలకు సంబంధించిన వ్యాధులు అధికమయ్యాయి.

2019లో వాయుకాలుష్యం (16.7 లక్షల మృతులు), అధిక రక్తపోటు (14.7 లక్షలు),

పొగాకు వినియోగం (12.3 లక్షలు), పౌష్టికాహార లోపం (11.8 లక్షలు) మధుమేహం (11.8 లక్షలు) కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో అధిక రక్త పోటు కారణంగా 10–20 శాతం మంది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
A one year baby donates cells to his brother and saves his life
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X