Results: పంజాబ్‌ను ఊడ్చేసిన ఆప్, కేజ్రీవాల్ పార్టీకి 92, మిగితా పార్టీలకు సీట్లు ఎన్నంటే?
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీపార్టీ విజయ దుంధుభి మోగించింది. రాష్ట్రంలోని దాదాపు 70 శాతానికిపైగా సీట్లను ఆప్ గెలుచుకుంది. ప్రస్తుత సీఎంతోపాటు మాజీ సీఎం, పీసీసీ చీఫ్‌లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ హవాలో కొట్టుకుపోయారు. ఒక రకంగా పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త చరిత్రను సృష్టించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఎస్ఎడీ పితామహుడు ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమిపాలయ్యారు. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం తొలి రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 91 స్థానాల్లో ఆధిక్యం సాధించి క్లీన్‌స్వీప్ దిశగా సాగింది.

గురువారం రాత్రి వరకు పంజాబ్ అసెంబ్లీ ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ (18), శిరోమణి అకాలీదళ్ (మూడు), భారతీయ జనతా పార్టీ (రెండు), బహుజన్ సమాజ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన భగవంత్ మాన్ ఖట్కర్ కలాన్‌లో సీఎంగా ప్రమాణం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో కాకుండా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవాన్షహర్ జిల్లాలోని ఖట్కర్కలన్లో కొత్త పంజాబ్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ గురువారం తెలిపారు. ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్ గెలుపొందారు.
ఇది ఇలావుండగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్, ఏకంగా ఐదుసార్లు సీఎంగా సేవలు అందించిన ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చెన్నీ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు.. అయితే, భదౌడా, చమకౌర్ సాహిబ్ రెండు స్థానాల్లోనూ ఆయన పరాజయం పాలయ్యారు.
ఇక, అమృత్ సర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పరాజయం పాలయ్యారు.. అజయ్ గుప్తా అనే ఆప్ అభ్యర్థి సిద్ధూను ఓడించారు. మరోవైపు పంజాబ్ సీఎంగా పనిచేసిన అమరీందర్ సింగ్.. పాటియాలా నుంచి బరిలోకి దిగారు. ఆప్ అభ్యర్థి అజీత్ సింగ్ కోహ్లీ చేతిలో ఓడిపోయారు. శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి జగదీప్ కంబోజీ చేతిలో పరాజయం పాలయ్యారు.. ఇక, మాజీ సీఎం శిరోమణి అకాలీదళ్ అగ్రనేత అయిన ప్రకాష్ సింగ్ బాదల్.. లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో ఓడిపోయారు. ఇలా ఎంతోమంది రాజకీయ ప్రముఖులను మట్టి కరిపించారు ఆప్ అభ్యర్థులు.