టేబుల్‌పై డెడ్ బాడీ.. పోస్టుమార్టమ్‌కి సిద్దం,ఇంతలోనే ఊహించని షాక్... ఇలాంటి కేసు చూడలేదన్న డాక్టర్...
బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా అతనిలో చలనం కనిపించింది. అతని శరీరంపై రోమాలు నిక్కబొడుచుకోవడంతో పాటు చేతుల్లో కదలిక కనిపించింది. ఆ హఠాత్పరిణామానికి షాక్ తిన్న వైద్యుడికి నోటి వెంట మాట రాలేదు. కాసేపటికి తేరుకున్న వైద్యుడు వెంటనే ఇతర వైద్య సిబ్బందికి,అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

అసలేం జరిగింది...
కర్ణాటకకు చెందిన శంకర్ గోంబి అనే యువకుడు గత నెల 27న మహాలింగాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బెల్గావి ప్రభుత్వ ఆస్పత్రిలో అక్కడి వైద్యులు అతన్ని
రెండు రోజుల పాటు ఆబ్జర్వేషన్‌లో ఉంచారు. చివరకు బ్రెయిన్ డెడ్‌గా నిర్దారించారు. దీంతో సోమవారం(మార్చి 1) మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో శంకర్ కుటుంబ సభ్యులు ఇంటి వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

టేబుల్‌పై డెడ్ బాడీ...
పోస్టుమార్టమ్‌కు అంతా సిద్దం చేసి మృతదేహాన్ని టేబుల్‌పై పెట్టారు. వైద్యుడు ఎస్ఎస్ గల్గాలి ఆ టేబుల్ వద్దకు వచ్చి పోస్టుమార్టమ్ ప్రక్రియ మొదలుపెట్టేందుకు మృతదేహాన్ని తాకాడు. అంతే...ఒక్కసారిగా టేబుల్‌పై ఉన్న మృతదేహంలో చలనం కనిపించింది. అతని శరీరంపై రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చేతులు కూడా మెల్లిగా కదలడం కనిపించింది. మరికొద్ది నిమిషాల్లో ఆ శరీరంపై కత్తి గాట్లు పడుతాయనగా... ఒక్కసారిగా చలనం రావడం వైద్యుడినే షాక్‌కి గురిచేసింది. కాసేపటికి తేరుకున్న డా.గల్గాలి ఆస్పత్రిలోని ఇతర సిబ్బందికి,శంకర్ గోంబి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు.

గుండె కొట్టుకుంటున్నట్లు నిర్దారణ
అనంతరం శంకర్ గోంబీకి వైద్య పరీక్షలు నిర్వహించగా అతని గుండె కొట్టుకుంటున్నట్లు నిర్దారణ అయింది. దీంతో వెంటనే మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ శంకర్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై డా.గల్గాలి మాట్లాడుతూ... తన 18 ఏళ్ల కెరీర్లో ఇటువంటి కేసును చూడలేదన్నారు. ఇప్పటివరకూ 400 పోస్టుమార్టమ్స్ చేశానని చెప్పిన ఆయన... ఈ కేసు తననే షాక్‌కి గురిచేసిందన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని పాడెపై పడుకోబెట్టి స్మశానానికి తరలిస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చొన్నాడు. ఆ తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మదనపల్లె గ్రామీణ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.