ఆచార్య రివ్యూ: కొరటాల శివ, చిరంజీవి సినిమా.. పాఠమా? గుణపాఠమా?

చిరంజీవి అంటే 152 సినిమాల చరిత్ర. నాలుగు దశాబ్దాల అలుపెరగని ప్రయాణం. బాక్సాఫీస్ రికార్డులు. చిరు సినిమా వస్తోందంటే.. పండగలాంటి వాతావరణం, ఉరకెలెత్తే ఉత్సాహం కనిపిస్తుంది.
అది... ఇన్నేళ్లుగా చిరంజీవి సంపాదించుకున్న నమ్మకం. దానికి కొరటాల శివ జత కలిశారు. ఫ్లాపులెరగని దర్శకుడు కొరటాల. తన కథలు, అందులోని పాత్రలు, సంఘర్షణ.. ఇవన్నీ బలంగా ఉంటాయి. కాబట్టే - కొరటాలకు హిట్లు వరుసకట్టాయి.
అవి చూసే స్టార్లు కొరటాలని పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. చిరు కూడా అంతే. ఫలితమే ఆచార్య. దాదాపు మూడేళ్ల పాటు సాగిన ప్రాజెక్ట్ ఇది.
చిరు - కొరటాల కాంబో.. దానికి తోడు రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడం, ఆర్ఆర్ఆర్ తరవాత చరణ్ నుంచి వచ్చిన సినిమా ఇదే కావడంలో ఆచార్య చుట్టూ బజ్ ఏర్పడింది.
సుదీర్ఘ విరామం తరవాత ఆచార్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాల్ని అందుకుందా? అందకుండా పోయిందా?
ధర్మం తప్పిన ధర్మస్థలికి కాపరి వచ్చాడు
ధర్మానికి మారు పేరు ధర్మస్థలి. ఆ ప్రాంతానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. మోక్షం కోసం మహర్షులు తపస్సు చేసిన ప్రాంతం అది. కాలక్రమంలో అమ్మవారి ఆలయంగా రూపాంతరం చెందుతుంది.
ఆ అమ్మవారి పాదాల చెంత ఉన్న ప్రాంతం పాదఘట్టం. ఆయుర్వేదానికి ప్రసిద్ధి. అక్కడి సిద్ధవనంపై కొంతమంది అక్రమార్కుల కన్ను పడుతుంది. ధర్మస్థలి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అరాచకాలు మొదలవుతాయి.
అక్కడ బసవన్న (సోనూసూద్) ధర్మస్థలిని తన గుప్పెట్లో ఉంచుకుంటాడు. తనకు ఎదురన్నదే లేదు. ధర్మం తప్పిన.. ధర్మస్థలిని దారిలో పెట్టి, మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఆచార్య (చిరంజీవి) అడుగుపెడతాడు.
అసలు ధర్మస్థలికీ ఆచార్యకు సంబంధం ఏమిటి? సిద్ధ (రామ్ చరణ్)కీ పాదఘట్టానికీ ఉన్న అనుబంధం ఏమిటి? నక్సల్ ఉద్యమం ఇందులో ఎలాంటి పాత్ర పోషించింది? అనేదంతా మిగిలిన కథ.
- అజయ్ దేవ్‌గణ్-కిచ్చా సుదీప్: హిందీ జాతీయ భాషా? భారతదేశంలో అధికార భాషలు ఏవి?
- నవనీత్ కౌర్ రానా: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఢీకొడుతున్న తెలుగు మాజీ హీరోయిన్

ఇమేజ్‌కి సరిపడని కథ
కొరటాల స్వతాహాగా మంచి రచయిత. నా దగ్గర పది శక్తిమంతమైన కథలు ఉన్నాయి అని ఆయన పదే పదే చెబుతూనే ఉన్నారు.
చిరంజీవితో కొరటాల ఓ సినిమా చేస్తున్నారు అనగానే ఈసారి కూడా బలమైన కథనే ఎంచుకున్నారనిపిస్తుంది. కానీ.. ఆచార్య కథలో కానీ, పాత్రల్లో కానీ, రాసుకున్న సన్నివేశాల్లో, సంభాషణల్లో కానీ ఆ బలం కనిపించదు.
ఇంత సింపుల్ కథని నమ్మి ఇద్దరు స్టార్ హీరోల్ని పెట్టుకుని ఎందుకు సాహసం చేశారా? అనిపిస్తుంది.
దుర్మార్గుల కళ్లు పడిన ఓ పవిత్రమైన స్థలాన్ని రక్షించడానికి హీరో ఏం చేశాడు? అనేదే సింపుల్‌గా కథ.
ఇలాంటి లైన్లతో గతంలోనూ చాలా సినిమాలొచ్చాయి. ఇంకా చెప్పాలంటే పాత చింతకాయ తొక్కులాంటి కథ ఇది. పోనీ, దాన్ని చిరంజీవి ఇమేజ్‌కి సరిపోయేలా మార్చారా? అనుకుంటే అదీ జరగలేదు. చిరంజీవికి ఏమాత్రం సూట్ కాని కథ ఇది.
చిరంజీవి నుంచి డాన్సులు, ఫైట్లూ, కామెడీ వంటివన్నీ ఆశిస్తారు. పాపం, కొరటాల కూడా అవన్నీ వండి వార్చే ప్రయత్నం చేశారు. కానీ, చిరంజీవి శైలి మాస్ అంశాలకు, ఈ కథకూ పొంతన లేకుండా పోయింది.
చిరు స్టెప్పులు వేశారు కానీ, జోష్ లేదు.
చిరు కామెడీ చేశారు కానీ, సెట్ కాలేదు.
చిరు ఫైట్లు చేశారు కానీ అవీ ఆకట్టుకోలేదు..
కారణం కథ, కథనం, పాత్రల తీరుతెన్నుల్లో ఉన్న బలహీనతలు. చిరంజీవిని నక్సల్ ఉద్యమ నాయకుడిగా చూపించారు.
అయితే ఆ సీరియస్‌నెస్ ఆయన్ని చూపించడంలో కనిపించలేదు. ఉదాహరణకు.. లాహె లాహె పాటలో ఆయన రొమాంటిక్ చూపులతో స్టెప్పులు వేయడం. ఓ సీరియస్ మిషన్ మీద ధర్మస్థలికి వచ్చిన చిరు అలా కమర్షియల్ సినిమాల్లో హీరోలా సిగ్నేచర్ స్టెప్పులు వేయడం మింగుడు పడని విషయం.
అదో భక్తిరసమైన పాట అనుకుందాం. ఉత్సవాల్లో స్టెప్పులు వేయడం కామన్ అనుకుందాం. తోటి కామ్రేడ్ పెళ్లికి వెళ్లి సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ ఐటెమ్ పాట వేసుకోవడం ఏమిటి? ఇవన్నీ పక్కాగా చిరు ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఇరికించిన పాటలు. వాటిని విడిగా చూస్తే.. ఫ్యాన్స్‌కి హుషారు వస్తుందేమో.. కానీ కథా నేపథ్యం, పాత్రకున్న ఔచిత్యం చూశాక నప్పలేదు అనిపిస్తుంది.
- కిమ్ కర్దాషియన్: తల్లి సెక్స్ టేప్ ప్రకటన చూసిన ఆరేళ్ల కొడుకు.. ఆ తర్వాత..
- కేజీఎఫ్: రియల్ రాకీ భాయ్ ''థంగం రౌడీ’’ ఎవరు? ఆయన్ను ''జూనియర్ వీరప్పన్’’ అని ఎందుకు పిలుస్తారు?

'సిద్ధ’పైనే ఆశలు
ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తాడు అనేసరికి మెగా అభిమానులు మురిసిపోయారు.
చిరు, చరణ్‌లను కలిపి చూడడం వాళ్లకు పండగలాంటిది. సిద్ధ పాత్ర కథలోంచి పుట్టిందని, అందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని, చరణ్ ఒక్కడే న్యాయం చేయగలడని సినిమా విడుదలకు ముందు రకరకాలుగా ఊరించేశారు. దాంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
అయితే, సినిమా చూసేసరికి ఆచార్య పాత్ర తేలిపోతున్నా - సిద్ధ వస్తాడు, సినిమాని కాపాడతాడు అనే ఆశలు మిణుకుమిణుకుమంటుంటాయి. ఇంటర్వెల్ కార్డు వేసేసరికి 'సిద్ధ వచ్చినా ఈ సినిమాని కాపాడలేరు అని సగటు సినీ అభిమాని ఫిక్సయిపోతాడు.
ఏ సినిమాలో అయినా ఫ్యాన్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి లాంటి మాస్ హీరో సినిమాలో అవి తప్పనిసరి. కానీ.. ఆచార్యలో అవేం కనిపించవు.
కాస్త హుషారైన సీన్ రాస్తే సినిమా కథ దెబ్బతింటుందనిపించిందో ఏమో కొరటాల శివ అవేం లేకుండా అతి జాగ్రత్తకు పోయారు.
సిద్ధ పాత్రపై కాస్త ప్రేమతోనే సన్నివేశాలు రాసుకున్నా, ఆ పాత్రలో చరణ్ ఒదిగిపోయినా... ఎందుకో.. అప్పటికే ఈ సినిమాపై ఓకరమైన నమ్మకాన్ని ఏర్పరచుకుంటాడు ప్రేక్షకుడు. చిరు, చరణ్ ఇద్దరూ కలిసి.. మైనింగ్ లొకేషన్‌కి వెళ్లి.. ఏంటండీ.. అలా పొడిచేశారు.. అంటూ కామెడీ చేస్తూ ఓ ఫైట్ ఒకటి డిజైన్ చేశారు.
నిజానికి.. ఆ ఫైట్ కాస్త ఫన్నీగానే ఉంది. కానీ, రాంగ్ ప్లేస్మెంట్ వల్లో, అప్పటికే ఉత్సాహం తగ్గడం వల్లో దాన్ని కూడా ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేని పరిస్థితి.
విలన్ పాత్ర ఎంత ఎఫెక్టివ్ గా ఉంటే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుందన్నది సూత్రం. సోనూసూద్ పాత్రని కూడా అటూఇటూ కాకుండా చేశారు.
విలన్ గ్యాంగ్‌లో ఎంత మంది ఉన్నా, వాళ్లంతా ఆచార్య చేతిలో తన్నులు తినడానికే అన్నట్టు తిరుగుతుంటారు. పతాక సన్నివేశాల్లో రక్తం ఏరులై పారింది.
ఫైట్లు, వాటి కంపోజిషన్లు చాలా రెగ్యులర్ గా ఉండడం, ఆయా సన్నివేశాల్లో కొరటాల కలం బలం సరిపోకపోవడం మరో మైనస్.
- పెళ్లి చేసుకున్న ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్, వెడ్డింగ్ ఫొటోలు చూశారా..
- కేజీఎఫ్ 2 రివ్యూ: చాప్టర్ 2లో అసలు కథ ఎంత? యష్, ప్రశాంత్ నీల్ విజయం సాధించారా?

సీజీల్లో నలిగిపోయిన సిరంజీవి
ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్, సీజీ వర్క్‌ల పుణ్యాన హీరోలు మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు. వాటిని ఈ సినిమాలోనూ ఎడాపెడా వాడేశారు.
చిరంజీవిని వీలైనంత యంగ్‌గా చూపించాలన్న తాపత్రయంతో సీజీలకు, డీఐకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. వాటి మధ్య చిరంజీవి గ్లామర్ నలిగిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది.
చిరు - చరణ్‌లను తండ్రీ కొడుకులుగా చూపిస్తే తప్పేమిటన్నది అస్సలు అర్థం కాదు. చిరుని ఇంకా పెళ్లి కాని యువకుడిగానే చూపించాలని కొరటాలలోని అభిమాని ఆశించి ఉండొచ్చు. కానీ దర్శకుడిగా అలా ఆలోచించి ఉండక పోవాల్సింది.
చిరు ఎప్పటిలానే స్టెప్పుల్లో తన గ్రేస్ చూపించారు. భలే బంజారా పాటలో చిరు.. చరణ్‌లు కలిసి స్టెప్పులు వేయడం ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. తండ్రితో కలిసి నటించానన్న తృప్తి తప్ప చరణ్‌కి కూడా ఈ పాత్ర ద్వారా ఏమీ మిగలదు. పూజా హీరోయిన్‌కి తక్కువ, అతిథి పాత్రకు ఎక్కువ అన్నట్టుంది. సోనూసూద్ మేకప్ సూటవ్వలేదు. మిగిలిన వాళ్ల గురించి పెద్దగా మాట్లాడుకునే అవసరం, అవకాశం రెండూ లేవు.
- అలియా భట్, రణబీర్ కపూర్ ల లవ్‌స్టోరీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది?
- KGF 2: 121 ఏళ్లలో 900 టన్నుల బంగారం అందించిన కేజీఎఫ్ అసలు కథ ఇది

అదిరిపోయిన టెంపుల్ సెటప్
సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. ఖర్చుకు ఎక్కడా వెనుకంజ వేయలేదు. ధర్మస్థలి అనే టెంపుల్ టౌన్‌ని నిర్మించడంలో, ఆ ప్రాంతాన్ని కూడా ఓ పాత్రగా మలచడంలో కళా దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది.
అయితే సినిమా అంతా దాదాపు ఒకే లొకేషన్లో సాగిన ఫీలింగ్ రావడం కాస్త ఇబ్బందిగానే అనిపించే విషయం.
మణిశర్మ పాటలు ఓకే అనిపిస్తాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా లేవు. పైగా ఈ కథలో పాటలన్నీ ఇరికించిన ఫీలింగే కలుగుతుంది. కథకుడిగా కొరటాల తొలిసారి విఫలమైన సినిమా ఇది. మాటల్లోనూ పదును కనిపించలేదు. తనలోని రచయిత సహకరించకపోవడంతో దర్శకుడు కూడా చేతులెత్తేశాడు.
పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ నన్ను ఆచార్య అంటుంటారు. బహుశా.. గుణపాఠాలు చెబుతాననేమో అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. నిజానికి ఈ సినిమా కూడా ఓ పాఠం.. గుణపాఠం. స్టార్‌తో సినిమా ఎలా తీయకూడదో చెప్పే పాఠం. కథలో బలం లేకపోతే, పాత్రల్ని సరిగా డిజైన్ చేయకపోతే సినిమా ఏం అవుతుందో చెప్పే గుణపాఠం.. ఆచార్య.
(అభిప్రాయాలు వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?
- ఖర్చులు తగ్గించుకుని, డబ్బులు మదుపు చేయడానికి ఏడు మార్గాలు
- విదేశాంగ మంత్రి జైశంకర్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?
- కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'
- మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)